పేదల సొంతింటికి తాన్లా ఫౌండేషన్ చేయూత‌

– సత్తుపల్లి, అశ్వారావుపేటల్లో రూ.300 కోట్లతో 5వేల ఇళ్లు
– దసరా పండుగ రోజున భూమి పూజ
– రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి

సత్తుపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వంతో దాతృత్వ సంస్థలు చేతులు కలపడం అభినందనీయమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని నిరుపేదల కోసం తాన్లా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉదయ్ కుమార్ రెడ్డి సొంత నిధులతో సుమారు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో 5వేల ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలిపారు. దసరా పండుగ రోజున ఈ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారంలో తాన్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ ఆరోగ్య కేంద్రం, ల్యాబొరేటరీలను మంత్రి పొంగులేటి, కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి రక్త పరీక్ష చేయించుకున్నారు. అనంతరం వైద్యాధికారులు, రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే తాన్లా ఫౌండేషన్ తరఫున ఉదయ్ కుమార్ రెడ్డి తన సొంత నిధులతో 5వేల ఇళ్లను నిర్మించి ఇస్తానని ముందుకొచ్చారని తెలిపారు. పేద కుటుంబాలకు కేవలం ఇల్లు మాత్రమే కాక ఆత్మగౌరవంతో జీవించే సొంత చిరునామా కల్పించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లేందుకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు రాగమయి దయానంద్, ఆదినారాయణ సమన్వయంతో అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాన్సర్ హాస్పిటల్

నారాయణపురంలో పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు శ్రీ షిరిడి సాయి జనమంగళం ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతోందని మంత్రి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *