– గురుకులాల్లో యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో అందాలి
– శానిటేషన్, భద్రత, తాగునీరు, వంటశాలలపై ప్రత్యేక దృష్టి
– క్వాలిటీ, క్వాంటిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి
– ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక కార్యాచరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 3: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫార్ములు, షూస్, పుస్తకాలు తదితర వస్తువులు ఆలస్యం లేకుండా అందించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గురుకులాలు, వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో పీఎంయÖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రస్థాయి నుంచి జిల్లాలకు చేరిన యూనిఫార్ములు, షూస్, పుస్తకాలు తదితర సామగ్రిని విద్యార్థులకు వెంటనే అందించాలని మంత్రి సూచించారు. సరఫరా ఎక్కడ నిలిచిపోయింది, ప్రొక్యూర్‌మెంట్‌లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే అంశాలను గుర్తించి జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. వందýమంది విద్యార్థులు ఉండే పెద్ద క్యాంపస్‌లలో ప్రస్తుత పారిశుధ్య సిబ్బంది సరిపోతున్నారా అనే అంశాన్ని పరిశీలించాలన్నారు. పారిశుధ్య, స్కావెంజింగ్ సేవలను సమర్థంగా నిర్వహించేందుకు తగిన విధానం రూపొందించాలన్నారు. స్థానిక అవసరాలనుబట్టి కాంటింజెన్సీ సిబ్బందిని వినియోగించడంతోపాటు, అవసరమైతే పారదర్శక ఆన్‌లైన్ టెండర్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం సిబ్బందికి అందిస్తున్న వేతనాలు చాలా తక్కువ ఉన్నాయని, వాటిని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులు ఆదేశించారు. గురుకులాలను పూర్తిస్థాయిలో మరింత తీర్చిదిద్దేందుకు విద్యార్థుల సంఖ్య, స్థానిక అవసరాలకు అనుగుణంగా సమగ్ర మౌలిక వసతుల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా బాలికల గురుకుల విద్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అనుసంధానం చేయాలని మంత్రి ఆదేశించారు. గురుకులాల్లో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. బోధనా విధానంలో ఏకరూపత తీసుకురావడంతోపాటు గతంలో ఎదురైన సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో సబ్జెక్టు నిపుణుల సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఆన్‌లైన్ తరగతులు, రిమోట్ అకడమిక్ సపోర్ట్, ఫౌండేషన్ కోర్సులను విస్తరించాలని సూచించారు. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు, స్టడీ మెటీరియల్, డిజిటల్ లెర్నింగ్ వనరులు, అదనపు కోచింగ్ అందించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. పోటీ పరీక్షలు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు మార్గదర్శనం కల్పించాలని సూచించారు. మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. నియామకాల సమయంలో పోస్టుల మంజూరు, రోస్టర్, సీనియారిటీ, నియామక విధానం, ఆర్థిక శాఖ అనుమతులను పరిగణనలోకి తీసుకున్నారా అనే అంశాలను ధ్రువీకరించాలని సూచించారు. సంబంధిత వివరాలను గవర్నింగ్ బాడీ ముందుంచి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. గురుకులాలు, విద్యా సంస్థలకు సంబంధించిన భవనాల అద్దెలపై జీఎస్టీ వర్తింపు అంశాన్ని కూడా సమావేశంలో సమీక్షించారు. అద్దె రేటు జీఎస్టీతో అదనంగా కలపడం అనే విషయాన్ని ఒప్పందాల్లో స్పష్టంగా పేర్కొనాలని నిర్ణయించారు. విద్యా సంస్థలు, వసతి గృహాలకు వర్తించే జీఎస్టీ నిబంధనలు, మినహాయింపులపై పరిశీలించాలని సూచించారు. సమీక్షలో సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యసాచి ఘోష్, ఎస్‌సీడీడీ కార్యదర్శి విజయేంద్ర బోయి, ఎస్సీ గురుకులాల కార్యదర్శి రవి గుగులోతు, ఎస్టీ గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి, ఆశ్రమ పాఠశాలల డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





