రైతుసంఘాల తీరుపై సుప్రీం సీరియ‌స్‌

దల్లేవాల్‌కు వైద్య సాయం అందకుండా అడ్డంకులెందుకు?
త‌క్ష‌ణమే చికిత్స అందించాల‌ని ప్ర‌భుత్వానికి ఆదేశాలు

న్యూదిల్లీ, డిసెంబర్ 28 (ఆర్ఎన్ఎ): రైతు సంఘాల నేతలపై సుప్రీంకోర్టు  ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నా.. ఆయనకు వైద్య సహాయం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. నిజంగా ఆయన క్షేమం కోరుకునేవారైతే అలా అడ్డుకోరనే విషయాన్ని వారికి తెలియజేయాలని జస్టిస్‌ సూర్యకాంత్‌ పంజాబ్‌ చీఫ్‌ సెక్రటరీకి సూచించారు. దల్లేవాల్‌కు వైద్య సహాయం అందించాలన్న ఆదేశాలను అమలుచేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యంపై విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

నిరవధిక దీక్షను కొనసాగిస్తున్న దల్లేవాల్‌కు వైద్య సహాయం అందేలా చూడాలని తాము పంజాబ్‌ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చామని.. అయితే వాటిని అమలు చేయడానికి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలపై కోర్టు సంతృప్తి చెందలేదని జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. ఈ విషయంలో పంజాబ్‌ రాష్టాన్రికి ఏదైనా సహాయం అవసరమైతే, కేంద్ర ప్రభుత్వం మద్దతివ్వాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ కేసుపై తదుపరి విచారణను డిసెంబర్‌ 31న చేపట్టనున్నట్లు వెల్లడిరచింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి డిమాండ్లతో నవంబరు 26 నుంచి జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ పంజాబ్‌-హరియాణా సరిహద్దులోని ఖనౌరీ శిబిరం వద్ద నిరవధిక నిరసన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page