అక్రమ నిర్బంధం చెల్లదు 

 శాంతియుతంగా నిరసన తెలిపేవారిని అక్రమంగా నిర్బంధించవొద్దని   సుప్రీంకోర్టు  స్పష్టమైన ఆదేశాలు

సీజేపీ అగ్రనేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల

 ఆదివారం కూడా దిల్లీలో వందలాది మంది నిర్బంధం

 మెట్రో, రైలు, ఇంటర్నెట్ సేవలను సాధారణ స్థితిలో కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం 

 

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో దేశ రాజధానిలో కొనసాగుతున్న నిరసనలు ఆదివారం కీలక మలుపు తిరిగాయి. శనివారం వేలాది మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, మెట్రో, రైల్వే, ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆదివారం ప్రత్యేక విచారణ నిర్వహించింది. శాంతియుతంగా, నిరాయుధులుగా సమావేశమయ్యే పౌరులను చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా నిర్బంధించరాదని స్పష్టం చేసింది. ప్రజారవాణా, ఇంటర్నెట్ సేవలను సాధారణ స్థితిలో కొనసాగించాలని, బారికేడ్ల అవసరాన్ని తక్షణమే సమీక్షించాలని అధికారులను ఆదేశించింది.

మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను ఆదివారం విడుదల చేశారు. అయినప్పటికీ జంతర్‌మంతర్‌కు చేరుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థులు, యువజన సంఘాల కార్యకర్తలను పోలీసులు పలుచోట్ల అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం కూడా వందలాది మందిని నిర్బంధించినట్లు సమాచారం.

సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణలో కీలక ఆదేశాలు

న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై దిల్లీ పోలీసుల చర్యలు, రవాణా ఆంక్షలపై విచారణ జరిపింది.

అక్టోబర్ 9న ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘించారని పిటిషనర్లు ఆరోపించారు. మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దు, న్యాయవాదులు, జర్నలిస్టుల నిర్బంధం, పౌరుల రాకపోకలపై ఆంక్షలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

వాదనలు విన్న ధర్మాసనం మెట్రో, రైల్వే సేవలను సాధారణ షెడ్యూల్ ప్రకారం కొనసాగించాలని ఆదేశించింది. శాంతిభద్రతల పరిస్థితి అవసరమైనప్పుడు మాత్రమే చట్టబద్ధమైన, సమంజసమైన పరిమితులు విధించవచ్చని పేర్కొంది.

సుప్రీంకోర్టు పరిసరాల్లో భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 163 కింద ఆంక్షలను ప్రకటిస్తూ ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని ఆదేశించింది. న్యాయస్థానాలకు వెళ్లే పౌరులు, న్యాయవాదుల రాకపోకలకు ఆటంకం కలగకూడదని స్పష్టం చేసింది.

ఇంటర్నెట్ సేవలను సాధారణ స్థితిలో కొనసాగించాలని, నగరంలో బారికేడ్ల అవసరాన్ని పునఃసమీక్షించాలని సూచించింది. జర్నలిస్టులు, న్యాయవాదులు తమ వృత్తిపరమైన విధులను నిర్వర్తించకుండా అడ్డుకోరాదని పేర్కొంది.

ప్రభుత్వం, సంబంధిత అధికారులు తమ చర్యలపై వివరణతోపాటు ఆదేశాల అమలు నివేదికను సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 13, మంగళవారానికి వాయిదా పడింది. ధిక్కరణ ఆరోపణలపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు.

విడుదలైన సీజేపీ ముగ్గురు అగ్రనేతలు

శనివారం దిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను ఆదివారం దిల్లీ కంటోన్మెంట్ ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

బీఎన్ఎస్ఎస్ సెక్షన్లు 126, 170 కింద ముందస్తు నిర్బంధ చర్యలు చేపట్టినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. ఏడాదిపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదనే షరతుతో, ఒక్కొక్కరికి రూ.50 వేల పూచీకత్తుపై విడుదల చేసినట్లు వెల్లడించారు.

సీజేపీ న్యాయ వ్యవహారాల బాధ్యురాలు రత్నా సింగ్ ముగ్గురి విడుదలను ధ్రువీకరించారు. అయితే నిరసనలు నిర్వహించకూడదనే ప్రత్యేక నిషేధం విధించలేదని ఆమె వివరించారు.

విడుదల అనంతరం దీప్కే మాట్లాడుతూ, తాము నిరసనలు చేయబోమని ఎలాంటి హామీ ఇవ్వలేదని, పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. తన నానమ్మ మరణించిన నేపథ్యంలో మహారాష్ట్రకు తిరిగి వెళ్తున్నట్లు తెలిపారు.

రెండో రోజూ దిల్లీలో నిర్బంధాలు

ఆదివారం ఉదయం 10 గంటలకు జంతర్‌మంతర్ వద్ద మరోసారి సమావేశం కావాలని సీజేపీ నాయకుడు అజింక్య షిండే పిలుపునిచ్చారు. అయితే పోలీసులు ప్రధాన నిరసన ప్రాంగణానికి వెళ్లే మార్గాల్లో భద్రతను కొనసాగించారు.

దీంతో కన్నాట్ ప్లేస్, ఆర్కే ఆశ్రమ్ మెట్రో స్టేషన్, రాజీవ్ చౌక్ తదితర ప్రాంతాల్లో విద్యార్థులు, యువజన సంఘాల కార్యకర్తలు చిన్న బృందాలుగా నిరసనలు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం పలువురు నిరసనకారులను పోలీసులు వాహనాల్లో తరలించినట్లు తెలుస్తుంది .

ఐసా అధ్యక్షురాలు నేహా బోరాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్కే ఆశ్రమ్ వద్ద నిరసనలను కవర్ చేస్తున్న నలుగురు జర్నలిస్టులను కొద్దిసేపు నిర్బంధించినట్లు వార్తలు వెల్లడించాయి. వారిలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ముగ్గురు జర్నలిస్టులు విడుదలయ్యారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *