– భరోసా ఇవ్వడం మానేసి బెదిరింపులా?
– ఆరునెలల్లో తీసుకున్న కరువు నివారణ చర్యలేంటి?
– నీళ్లు ఇవ్వలేమనడం పాలనా దక్షత అనిపించుకోదు
– విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు
– అడ్డగోలుగా పెరుగుతున్న బియ్యం ధరలు
– ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలా?
– రేవంత్ వ్యాఖ్యలపై హరీష్‌రావు ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: అసమర్థుడికి అధికారం అప్పగిస్తే ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా ఉంది రేవంత్ పాలన!కరువు రాగానే చేతులెత్తేసిన చేతగాని సీఎంగా రేవంత్ చరిత్రలో మిగిలిపోతాడని మాజీ మంత్రి బిఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన రంకెలు వేసినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు రేవంత్ రెడ్డి.ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ చేతగానితనం వల్ల వచ్చిన కరువే. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమేనన్నారు. రైతులకు, ప్రజలకు భరోసా ఇవ్వడం మానేసి భయభ్రాంతులకు గురిచేస్తావా రేవంత్ రెడ్డి? కరువు వస్తోంది.. నేనేం చేయలేనని చేతులెత్తేసేవాడా పాలకుడు? తాగునీళ్లు కూడా ఉండవని భయపెట్టడానికేనా రేవంత్‌కు సీఎం పదవి ఉన్నది? ప్రజలను కాపాడేందుకు ఎంతకైనా సిద్ధమనవాడే నిజమైన పాలకుడు? ఇప్పుడు కేసీఆర్ సీఎంగా ఉంటే రేవంత్‌లాగా పనికిమాలిన, చేతగాని మాటలు చెప్పేవారా? వచ్చిన నీటిని వచ్చినట్టుగా ఒడిసిపట్టి తెలంగాణకు కరువు రాకుండా చూసేవారు. ముందస్తు చర్యలు తీసుకొని కరెంటు కోతలు నివారించేవారు.ఎల్‌నినో గురించి ఆరు నెలలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెబుతున్న మీరు ఈ ఆరు నెలల్లో కరువు నివారణకు తీసుకున్న ముందస్తు చర్యలేంటో చెప్పగలరా అని ప్రశ్నించారు. కరువు ప్రకృతి సృష్టి కావచ్చు.. కానీ కరువును ఎదుర్కొనే ప్రణాళిక రూపొందించడం, ప్రజలకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదా? నీటి నిల్వలు, విద్యుత్, ప్రత్యామ్నాయ పంటలు, పశుగ్రాసం, ఉపాధి అంశాలపై మీ కార్యాచరణ ఏంటి? కరువు వస్తుందని ఆరు నెలలుగా తెలుసని చెబుతున్నారు.. మరి గోదావరి, కృష్ణా నదుల నుంచి నీళ్లను ఎందుకు ఎత్తిపోలేదు? ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఎందుకు పెంచుకోలేదు?బొగ్గు నిల్వలు లేవు, కరెంట్ సంక్షోభం వస్తుందని మేం మొత్తుకుంటుంటే.. ఎందుకు ఫిడేలు వాయిస్తూ కూర్చున్నారు?ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు మీ చేతగానితనం కారణం కాదా? ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు?ఎల్‌నినో ప్రపంచవ్యాప్త సమస్య అయితే.. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు కరువు లేదు? అక్కడ ఎందుకు నీటి గలగలలు.. ఇక్కడ ఎందుకు రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి?కరువు పేరుతో వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేమని ముందే చేతులెత్తేయడం పాలనా దక్షత కాదు.. రైతులను సంక్షోభంలోకి నెట్టడమే!20 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగాన్ని గొప్పగా చెబుతున్నారు.. అదే సమయంలో విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ట్యాంకర్లతో నీళ్లు పోసుకుంటున్న రైతుల గోస కనిపించడం లేదా?బియ్యం ధరలు అడ్డగోలుగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. దాన్ని కూడా తన ఘనతగా చెప్పుకునే భావదారిద్య్రం రేవంత్ రెడ్డిది.ఇలాంటి వ్యక్తి కరువు నుండి ప్రజలను కాపాడతారా ప్రజలు ఆలోచించాలి.ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే రాజకీయ విమర్శలు.. ఇదేనా మీ ప్రజాపాలన?కరోనా సమయంలో కేసీఆర్ తీసుకున్న చర్యలపై మాట్లాడే ముందు.. నేటి కరువు పరిస్థితిని ఎదుర్కొనేందుకు మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి. కరోనా కాలంలో కేసీఆర్ తీసుకున్న చర్యలపై ప్రపంచమంతా ప్రశంసలు వెల్లువెత్తాయి. వ్యాక్సిన్ అందేలా చేయడంతోపాటు తన మాటలు, చర్యలతో ప్రజలను భరోసా ఇచ్చారు. వలస కూలీలను కూడా తెలంగాణ బిడ్డలుగా భావించి కాపాడారు. కేసీఆర్ చర్యలను దేశమంతా కొనియాడింది.దాన్ని కూడా తప్పుగా చూపించేందుకు రేవంత్ దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నారు.కేసీఆర్‌పై విమర్శలు చేయడానికి చూపిస్తున్న శ్రద్ధలో పావు వంతైనా రైతులకు, ప్రజలకు నీళ్లు అందించడంపై చూపించండి. రాజకీయాల కోసం పుట్టిన గడ్డనే కరువు రక్కసికి బలిపెట్టిన ప్రజా వ్యతిరేకి, రైతు వ్యతిరేకి రేవంత్ కాదా?నన్ను, కేసీఆర్ ని తిట్టినంత మాత్రాన, నా పొడుగు గురించి మాట్లాడినంత మాత్రాన ప్రాజెక్టుల్లో నీళ్లు పెరగవు. కరెంట్ సమస్య తీరదు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలు, తాగునీటి అవసరాలు, సాగునీటి పరిస్థితి, కరువు నివారణకు కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయండి. ప్రచార ఆర్భాటాలు పక్కన బెట్టి, కరువును ఎదుర్కొనే సమగ్ర కార్యాచరణను ప్రకటించండి. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు, పశువులకు గ్రాసం, కూలీలకు ఉపాధి కల్పించండి. నష్టపోయిన రైతులకు పరిహారం అందించండి. రైతులకు, పంటలకు బీమా పథకాలను తక్షణ అమలు చేయండి. ప్రకృతి వైపరీత్యాన్ని రాజకీయాలకు వాడుకోవడం కాదు.. ప్రజలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అన్న విషయాన్ని ఇకనైనా గుర్తించండని హితవు పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




