ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తున్న పార్టీలు

– పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు
– అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న కాంగ్రెస్
– బీఆర్ఎస్, బీజేపీల్లో కొనసాగుతున్న కసరత్తు
– రంగంలోకి జనసేన, తెలంగాణ రక్షణ సేన పార్టీలు
– సభలు, యాత్రలతో హోరెత్తిస్తున్న రాజకీయ పక్షాలు

(మండువ రవీందర్‌రావు)
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు రాజకీయపార్టీలు వ్యూహాత్మక ప్రణాళికలను రచిస్తున్నాయ. ఈ ఎన్నికలను దాదాపు అన్ని రాజకీయపార్టీలు రానున్న సారస్వత ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి. ఆయాపార్టీల భవిష్యత్‌ను ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయన్న అభిప్రాయం ఇప్పుడా పార్టీల్లో నెలకొంది. అందుకే ఎట్టి పరిస్థితిలో ఈ రెండు గ్రాడ్యుయేట్‌ ‌స్థానాలను కైవసం చేసుకునేందుకు పార్టీ క్యాడర్లను ఆయా పార్టీలు సిద్దంచేసుకుంటున్నాయి.  ప్రధానంగా రెండు జాతీయ (కాంగ్రెస్‌, ‌బిజెపి) పార్టీలు, రెండు ప్రాంతీయ (బిఆర్‌ఎస్‌, ‌టిఆర్‌ఎస్‌), ఒక ప్రాంతేతర (జనసేన) పార్టీలు ఎన్నికలబరిలో దిగేందుకు సిద్దమైనాయి. కాంగ్రెస్‌ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి మిగతా పార్టీలకన్నా ముందునిలిచింది. హైదరాబాద్‌-‌రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ‌గ్రాడ్యుయేట్‌ ఎంఎల్సీ స్థానానికి సామా రామ్మోహన్‌రెడ్డిని, వరంగల్‌- ‌ఖమ్మం- నల్లగొండ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమరెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది. ప్రధాన పోటీదారు పార్టీలుగా భావిస్తున్న బిజెపి, బిఆర్‌ఎస్‌ ఇం‌కా అభ్యర్థుల ఎంపిక విషయంలో కుస్తీపడుతున్నాయి. ఈ రెండు పార్టీలుకూడా అధికార కాంగ్రెస్‌కు దీటైన వ్యక్తులను ఎంపిక చేసేందుకు తమ పార్టీ ముఖ్యనేతలతో పలు దఫాలుగా మంతనాలు చేస్తున్నాయి. కాగా రాష్ట్రంలో కొత్తగా పుట్టుకొచ్చిన తెలంగాణ రక్షణ సేన( టిఆర్‌ఎస్‌) ‌కూడా ఒక స్థానానికి తన అభ్యర్థిని ఇటీవల ప్రకటించింది. వరంగల్‌-‌ఖమ్మం-నల్లగొండ ఎంఎల్సీ స్థానానికి ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాకు చెందిన డాక్టర్‌ ‌నలమాస శ్రీకాంత్‌గౌడ్‌ను నిలబెట్టింది. కాగా ఇదే ఎంఎల్సీ స్థానానికి పవన్‌కళ్యాణ్‌ ‌నేతృత్వంలోని జనసేన అన్ని పార్టీలకన్నా ముందే తన అభ్యర్థిగా గడల శ్రీనివాస్‌ను ప్రకటించింది. శ్రీనివాస్‌ ‌చాలా ముందునుండే తన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్ని పార్టీలుకూడా ఈ రెండు స్థానాల్లో తమదే గెలుపన్న దీమాను వ్యక్తంచేస్తున్నాయి. హైదరాబాద్‌- ‌రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ ఎంఎల్సీ స్థానంలో దాదాపు రెండు దశాబ్దాలకాలంగా కాంగ్రెస్‌కు ప్రాతినిద్యంలేకుండా పోయింది. దానితోపాటు గత ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్న వరంగల్‌-‌ఖమ్మం-నల్లగొండ స్థానంతోపాటు ఈ స్థానాన్ని ఎట్టిపరిస్థితిలో గెలుచుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌ ఉం‌ది. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ప్రధానంగా అభ్యర్థుల ప్రకటన విషయంలో అలకబూనిన మిత్రపక్షాలను బుదగరించడంతోపాటు, పార్టీలో నెలకొన్న అసంతృప్తిని తొలగించేపని పార్టీ అధిష్టానం చూసుకుంటున్నది. కాగా వోట్లు చెదిరిపోకుండా రెండు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాలకు, జిల్లా కేంద్రాలకు ప్రత్యేక పర్యవేక్షకులను పార్టీ ఏర్పాటు చేసింది.  అలాగే  మంత్రులు, ఎంఎల్యేలకు బాధ్యతలను అప్పగించింది. యూత్‌క్యాడర్‌ ‌సేవలను వినియోగించుకునేవిధంగా అన్ని జిల్లాలకు యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌పక్షాన ఇన్‌ఛార్జిలను నియమించారు. కాగా కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుండి ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రతీ గ్రామ స్థాయికి తీసుకెళ్ళే ప్రచార అస్త్రశస్త్రాలను సిద్దంచేస్తున్నది.
‌మూడేళ్ళుగా అధికారానికి దూరమైన భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) ‌తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఇది తమకు సెమీఫైనల్‌ ఎన్నికలుగా భావిస్తున్నది. అందుకే అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. వరంగల్‌-‌ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి గతంలో పోటీచేసిన ఏనుగుల రాకేష్‌రెడ్డి తన వంతు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఇంకా అభ్యర్థుల విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  ఎట్టి పరిస్థితిలో ఈ రెండు స్థానాలు గెలువాలంటే కొంత స్వంత ఇమేజ్‌ఉం‌డి, ప్రజలకు ఆమోదయోగ్యుడినే ఎంపిక చేయాలనుకుంటున్నారు.  అభ్యర్థులను ప్రకటించకపోయినప్పటికీ అధికార కాంగ్రెస్‌ను ఎండగడుతూ ప్రచారకార్యక్రమాన్ని బిఆర్‌ఎస్‌ ‌ముమ్మరం చేసింది.  ప్రధానంగా గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడాన్ని బిఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నది. అంతేగాక ప్రాజెక్టులను పడావబెట్టి ప్రజలకు, రైతాంగానికి కృత్రిమ నీటి కొరతను కలిగించిందని, విద్యుత్‌ ‌విషయంలో ముందస్తు ఆలోచన చేయలేదన్న అంశాలతో ఇప్పటికే దాడి మొదలెట్టింది. ఎప్పటినుండో తెలంగాణరాష్ట్రంపైన కన్నేసిన బిజెపి రెండు స్థానాల్లో తామే గెలుస్తామన్న ధిమా వ్యక్తంచేస్తున్నది. ఈ పార్టీకూడా అభ్యర్థుల ఎంపిక  విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. కాగా గతంలో జరిగిన వివిధ ఎన్నికల సందర్భంగా కేంద్ర నాయకులను దింపినట్లు ఈ ఎన్నికల్లో కూడా  ప్రచారానికి కేంద్ర నాయకత్వాన్ని దింపుతున్నది. నవంబర్‌లో కేంద్ర మంత్రి అమిత్‌షాను, డిసెంబర్‌లో ప్రధాని నరేంద్రమోదీని తీసుకువచ్చేందుకు రంగం సిద్దంచేస్తున్నారు. కాగా నవంబర్‌ ఒకటిన హైదరాబాద్‌లో మహాపాదయాత్ర, నవంబర్‌ 3‌న కరీంనగర్‌లో భారీర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ర్యాలీకి  కేంద్ర మాజీమంత్రి, బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి స్మృతి ఇరానిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. విద్రోహులను తరిమి కొడదాం’ నినాదాలతో దూసుకుపోవాలన్న ప్రణాళికను బిజెపి రూపొందిస్తున్నది.అధికారపార్టీ పాలనా వైఫల్యం, మోదీ ఇమేజీ తమ గెలుపుకు దోహదపడుతుందని బిజెపి భావిస్తున్నది.
————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *