– కరోనా సమయంలో మోదీ పిలుపునకు స్పందించిన ప్రజలు
– ఇప్పుడు కూడా ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించాలి
– ప్రతిపక్షాల విమర్శలపై భట్టి విక్రమార్క ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : ప్రకృతి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదు.. ప్రజలకు అండగా నిలవడమే రాజకీయ పార్టీల బాధ్యత కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కరోనా సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపులకు స్పందించి ప్రజలు చప్పట్లు కొట్టడం, గంటలు మోగించడం, దీపాలు వెలిగించడం ద్వారా ప్రభుత్వాలకు మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం విచారకరమని వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేసే సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్షాలు విమర్శలకే పరిమితం కావడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రజాభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పీసీసీ ముఖ్య నాయకులు, డీసీసీ అధ్యక్షులతో శుక్రవారం నిర్వహించిన ఎల్‌నినోపై అవగాహన, ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలతోపాటు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో సాధారణం కంటే 27 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, 621 మండలాలకుగాను 324 మండలాల్లో భూగర్భ జలాల కొరత ఉన్నట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేయడం, నీటి వినియోగంపై అవగాహన కల్పించడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. కరోనా సమయంలో ప్రభుత్వాల పిలుపులకు ప్రజలు ఎలా సహకరించారో గుర్తు చేసుకోవాలని, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కూడా అదే స్ఫూర్తితో సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతిపక్షాలు ప్రజలకు మేలు చేసే అంశాలపై సూచనలివ్వాలని, ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించాలని కోరారు.
324 మండలాల్లో అడుగంటిన భూగర్భ జలాలు
వర్షాభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయని, రాష్ట్రంలో సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండగా ఈ నెలలో దాదాపు 15 లక్షల పంపుసెట్లు వినియోగంలో ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటినట్లు అధికారులు అంచనా వేస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. బోరు బావుల్లో నీరు లేకపోయినా మోటార్లు ఆన్ చేయడంతో అవి కాలిపోతున్నాయని, రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని వివరించారు. నీరు లేని ప్రాంతాలను గుర్తించి, మోటార్లు దెబ్బతినకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నీటి లభ్యతపై ఎప్పటికప్పుడు సమాచారం అందించి రైతులను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.
రబీలో ప్రత్యామ్నాయ పంటలే మేలు
కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో రానున్న రబీ సీజన్లో వరికి బదులు వ్యవసాయ శాఖ సూచించిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని భట్టి తెలిపారు. అందుబాటులో ఉన్న నీటి ఆధారంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. జల విద్యుత్ ఉత్పత్తి తగ్గినప్పటికీ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని, రాష్ట్రంలో 20,018 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైందని వివరించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్, నీటి వినియోగంపై ముందస్తు ప్రణాళికలు అవసరమని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు, పశువులు సహా అన్ని జీవరాశులకు తాగునీరు అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నీటి వనరులను సంరక్షించుకోవడంతోపాటు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకునేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



