విద్యార్థుల హక్కులకు “సుప్రీం” భరోసా!

ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు, ముఖ్యంగా దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థులకు తమ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్ధమైనది. ఇటీవల కాలంలో విద్యా రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో, విద్యార్థుల నిరసనల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు స్పందిస్తూ ప్రత్యేక విచారణ సంఘం (సిట్‌) దర్యాప్తునకు ఆదేశించడం, క్రిమినల్ నేపథ్యం లేని మైనర్లను తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేయడం అత్యంత అభినందనీయమైన, చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇది కేవలం ఒక న్యాయపరమైన ఆదేశం మాత్రమే కాదు, విద్యార్థుల హక్కులకు న్యాయస్థానం కల్పించిన ఒక భరోసా.  ఈ పిటిషన్ ప్రాథమికంగా జూలై 20, 2026న న్యూదిల్లీలో జరిగిన ‘కాక్రోచ్ ‘ల  పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడి ఆధారంగా దాఖలైనప్పటికీ, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పోటీ పరీక్షల చుట్టూ జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటూ సుప్రీంకోర్టు “అన్ని రాష్ట్రాలకు” వర్తించేలా ఈ స్పష్టమైన ఆదేశాలను జారీ చేయ‌డంతో ఇవి తెలంగాణ‌కు కూడా వ‌ర్తిస్తాయి.
పరీక్షల నిర్వహణలో లోపాలు, పేపర్ లీకేజీలు, వాయిదాలు లేదా విద్యా సంస్కరణల పేరిట తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు యువతలో తీవ్ర ఆందోళనను, అభద్రతా భావాన్ని నింపుతున్నాయి. తమ భవిష్యత్తు అంధకారమవుతుందనే ఆవేదనతో విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు. అయితే, ఈ నిరసనలను శాంతిభద్రతల సమస్యగా మాత్రమే చూస్తూ, లాఠీఛార్జీలు చేయడం, నిర్బంధాలకు గురిచేయడం ప్రజాస్వామ్య పాలకులకు తగదు. చర్చల ద్వారా పరిష్కరించాల్సిన సమస్యను, పోలీసు బలగాలతో అణచివేయాలని చూడడం ప్రభుత్వాల పాలనాపరమైన వైఫల్యాన్నే సూచిస్తుంది.విద్యార్థుల నిరసనల సమయంలో హింస చెలరేగడానికి దారితీసిన పరిస్థితులపై సుప్రీంకోర్టు ‘సిట్’ దర్యాప్తును ప్రకటించడం అత్యంత కీలకమైన పరిణామం.
ఎందుకంటే… నిరసనల వెనుక ఉన్న అసలు సమస్యలేమిటి? విద్యార్థులను హింస వైపు ప్రేరేపించిన శక్తులు ఎవరు? అనేది నిష్పాక్షికంగా బయటకు రావాలి. నిరసనలను అదుపు చేసే క్రమంలో చట్టాన్ని అమలు చేసే సంస్థలు తమ పరిధిని దాటి ప్రవర్తించాయా లేదా అనే కోణంలో పోలీసుల చర్యలపై కూడా ఇది జవాబుదారీతనాన్ని పెంచుతుంది. ఎలాంటి నేర చరిత్ర  లేని, కేవలం ఉద్వేగంతో నిరసనల్లో పాల్గొన్న మైనర్ విద్యార్థులను సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉంచడం వారి మానసిక స్థితిని, భవిష్యత్తును దెబ్బతీస్తుంది. విద్యార్థి దశలో పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి వొస్తే వారి విద్యాసంవత్సరాలు వృథా అవడమే కాకుండా, కెరీర్ శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ మానవీయ కోణాన్ని గుర్తించిన సుప్రీంకోర్టు, మైనర్లను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించడం ద్వారా దేశంలోని లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రుల కు పెద్ద ఊరటనిచ్చింది. చట్టం కేవలం శిక్షించడానికే కాదు, రక్షించడానికి కూడా ఉందనే నమ్మకాన్ని ఈ తీర్పు బలపరిచింది.
విద్యార్థుల ఆందోళనలను కేవలం రాజకీయ కోణంలోనో లేదా శాంతిభద్రతల సమస్యగానో చూడటం మానేసి, వారి డిమాండ్లలోని న్యాయాన్ని గుర్తించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పును ఒక హెచ్చరికగా భావించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగంలో పారదర్శకతను పెంచాలి. యువతతో నిరంతరం చర్చలు జరుపుతూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే ఒక శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమే ఈ సమస్యకు అసలైన పరిష్కారం.  రాష్ట్రంలో ఈనెల 24న‌ హైదరాబాద్‌లోని నారాయణగూడ, హిమాయత్‌నగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీలు నిర్వహించి, రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలను నిరసిస్తూ ఈ ఆందోళనలు జరిగాయి. జూన్ మధ్యలో దిల్‍సుఖ్‍నగర్, చైతన్యపురి ప్రాంతాలలో వందలాది మంది అభ్యర్థులు వీధుల్లోకి వొచ్చి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని మరియు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు.
2024 అక్టోబ‌ర్ నెల‌లో గ్రూప్‌-1 మెయిన్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాల‌ని కోరుతూ హైద‌రాబాద్‌లోని కోచింగ్ హబ్ అయిన అశోక్ నగర్, దిల్‍సుఖ్‍నగర్ ప్రాంతాలలో వేలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వొచ్చి శాంతియుతంగా నిర్వ‌హించిన‌ ఆందోళనల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా పోలీసులు లాఠీఛార్జీలు చేయడం, అర్ధరాత్రి హాస్టళ్లపై దాడులు చేసి అభ్యర్థులను, మైనర్ విద్యార్థులను పోలీస్ స్టేషన్లకు తరలించడం తీవ్ర కలకలం రేపింది. అశోక్ నగర్, దిల్‍సుఖ్‍నగర్ నిరసనల సమయంలో పోలీసులు అర్ధరాత్రి హాస్టళ్లపై దాడులు చేసి, హాల్ టికెట్లు చూపిస్తున్నా వినకుండా చాలా మంది యువకులను, డిగ్రీ/ఇంటర్ చదువుతున్న మైనర్ విద్యార్థులను పోలీస్ స్టేషన్లకు తరలించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు అలాంటి అమాయక విద్యార్థులకు చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది. ఎలాంటి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పోలీసుల‌కు చిక్కిన మైన‌ర్  విద్యార్థులను జైళ్లలో లేదా నిర్బంధంలో ఉంచడం వారి కెరీర్‌ను శాశ్వతంగా దెబ్బతీస్తుంది. ఈ మానవీయ కోణాన్ని గుర్తించిన సుప్రీంకోర్టు, మైనర్లను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించడం ద్వారా తెలంగాణలోని వందలాది కుటుంబాలకు, తల్లిదండ్రులకు పెద్ద ఊరటనిస్తుంద‌నేది వాస్త‌వం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *