తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో, ఐటీ రంగ విస్తరణలో దూసుకుపోతుందని పాలకులు గర్వంగా ప్రకటిస్తుంటారు. కానీ, అదే తరుణంలో సామాన్యుడి నడ్డి విరుస్తున్న ధరల పెరుగుదలలోనూ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది . జాతీయ సగటు కంటే తెలంగాణలో ద్రవ్యోల్బణం ఎందుకు నిరంతరం ఎక్కువగా ఉందనే అంశంపై ఇప్పుడు క్షేత్రస్థాయిలో ముమ్మర చర్చ సాగుతోంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతం ఉంటే, మన రాష్ట్రంలో అది ఏకంగా 6.27 శాతానికి చేరింది.”గడిచిన జూన్ నెలలో ఇది ఏకంగా 6.36 శాతానికి చేరి అత్యంత గరిష్ట (పీక్) స్థాయిని తాకింది”.అభివృద్ధి నమూనాగా చెప్పుకునే ఒక రాష్ట్రంలో, జీవన వ్యయం ఇంతలా పెరిగిపోవడం వెనుక ఉన్న కారణాలను విశ్లేషించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.తాత్కాలికంగా ఒక నెల ధరలు పెరిగితే దానిని మార్కెట్ ఒడిదొడుకులుగా సరిపెట్టుకోవొచ్చు . కానీ, 2026 జనవరి నుంచి వరుసగా ఎనిమిది నెలలుగా దేశంలోనే అత్యధిక రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించడం సామాన్యమైన విషయం కాదు. 2025 అక్టోబర్‌లో మైనస్ 1.16% ద్రవ్యోల్బణంతో (డెఫ్లేషన్) ఉన్న తెలంగాణ, 2026 జనవరి నాటికి 4.92%, మార్చికి 5.83%, మే నాటికి 6.15% కు చేరుకుంటూ నిరంతరాయంగా పెరగడం గమనార్హం. కొత్త వినియోగ ధరల సూచిక (సీపీఐ) సిరీస్ మార్పుల వల్ల ఆభరణాలు మరియు బంగారం ధరల్లో ఏకంగా 42% నుండి 71% వరకు ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇందుకు ప్రధాన కారణమైంది.
జాతీయ సగటు కంటే ఇక్కడి ద్రవ్యోల్బణం దాదాపు రెండు శాతం ఎక్కువగా కొనసాగుతున్నది . కొత్త వినియోగ ధరల సూచిక (సీపీఐ) సిరీస్ ప్రకారం ఆహారేతర రంగాలకు ప్రాధాన్యత పెరిగినప్పటికీ, రాష్ట్రంలో అన్ని రకాల వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు జాతీయ స్థాయిలో ధరలు కొంత నియంత్రణలోకి వొస్తున్నా తెలంగాణలో మాత్రం ఆ వేడి తగ్గకపోవడం వెనుక స్థానిక ఆర్థిక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.గ్రామీణ తెలంగాణపై ద్రవ్యోల్బణం డబుల్ దెబ్బ ధరల పెరుగుదల ప్రభావం కేవలం హైదరాబాద్ వంటి మహానగరాలకే పరిమితం కాలేదు. వాస్తవానికి గ్రామీణ తెలంగాణపై ద్రవ్యోల్బణం డబుల్ దెబ్బ కొట్టింది. ఆగస్టు గణాంకాల ప్రకారం జాతీయ గ్రామీణ ద్రవ్యోల్బణం 5.23 శాతం ఉంటే, తెలంగాణ పల్లెల్లో అది 6.79 శాతంగా నమోదైంది.స్థానిక మార్కెట్ ఒడిదొడుకుల వల్ల కేవలం ఒక్క జూన్-జూలై కాలంలోనే టమాటా ధరలు 53% పెరగడం, నిమ్మకాయలు, బత్తాయిల ధరలు 32% పైగా పెరగడం, పప్పుధాన్యాలతో సహా 29 రకాల నిత్యావసరాలు 15% ప్రియమవడం పల్లె ప్రజలను కోలుకోలేని దెబ్బ తీశాయి. పట్టణ ప్రాంతాల (5.88 శాతం) కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ధరల ఒత్తిడి ఎక్కువగా ఉండటం గమనార్హం. గ్రామీణ ప్రజల ఆదాయ మార్గాలు పరిమితంగా ఉన్న తరుణంలో, నిత్యావసరాలు, రవాణా చార్జీలు, ఇతర సేవల ధరలు పెరగడం వల్ల వారి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది.
ఇది పల్లెల్లో ఆర్థిక అసమానతలను మరింత పెంచుతున్నది .తెలంగాణలో ధరలు ఇంతలా పెరగడానికి దారితీస్తున్న అంతర్గత కారణాలను రాష్ట్ర ప్రభుత్వం విడివిడిగా విశ్లేషించాల్సి ఉంది. పొరుగు రాష్ట్రాల కంటే తెలంగాణలో ఇంధన ధరలపై స్థానిక పన్నులు (వ్యాట్) ఎక్కువగా ఉండటం వల్ల రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి, ఇది ప్రతి వస్తువు ధరపై ప్రభావం చూపుతుంది . స్థానిక ఉత్పత్తి మరియు మార్కెట్ డిమాండ్ మధ్య సమన్వయం లోపించడం వల్ల, ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకునే నిత్యావసరాల ధరలు అదుపు తప్పుతున్నాయి.తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల తరహాలో మన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎక్కువ నిత్యావసరాలు సరఫరా కాకపోవడం వల్ల, జనం ఓపెన్ మార్కెట్‌పై ఆధారపడి ఈ ద్రవ్యోల్బణానికి బలికావాల్సి వొస్తున్నది. హోల్‌సేల్ వ్యాపారుల నుండి రిటైల్ వ్యాపారుల వరకు మధ్యవర్తుల కమీషన్లు, అధిక లాభాల మార్జిన్లను అరికట్టే నిఘా వ్యవస్థ లోపించింది.
నగరాలు, పట్టణాల్లో అద్దెలు, వైద్యం, విద్య మరియు పర్సనల్ కేర్ సేవల ధరలు దేశంలోనే అత్యధిక స్థాయికి చేరాయి. మున్సిపల్ చార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, స్థానిక పన్నుల భారం అంతిమంగా వినియోగదారుడి పైనే పడుతుంది .ఈ ఐదు ప్రధాన కారణాలలో దేని వాటా ఎంత ఉందో రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు పౌరసరఫరాల విభాగం శ్వేతపత్రం ద్వారా ప్రజలకు స్పష్టం చేయాలి. ధరల నియంత్రణ అనేది కేవలం రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వడ్డీ రేట్ల సవరణతోనే సాధ్యం కాదు; స్థానిక సరఫరా లోపాలను సరిదిద్దడం రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) ను బలోపేతం చేయడం, మార్కెట్ ధరలపై టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షణ పెంచడం అత్యవసరం. కేవలం ‘ధరల సూచిక మారడం వల్లే గణాంకాలు అలా చూపిస్తున్నాయి’ అని ఆర్థికవేత్తల వాదనల వెనుక దాక్కోకుండా, సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌ను కుదిపేస్తున్న ఈ ద్రవ్యోల్బణ మహమ్మారికి తక్షణమే అడ్డుకట్ట వేయాలి. సంక్షేమ పథకాలు ఇస్తూనే, మరోవైపు మార్కెట్ ధరల ద్వారా సామాన్యుడి జేబులు గుల్ల కాకుండా చూడటమే నిజమైన సుపరిపాలన అనిపించుకుంటుంది.





