తెలంగాణ సమాజంలో భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదు అది ఆత్మగౌరవం, జీవనాధారం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో భూ పరిపాలన వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం సామాన్య రైతును, పట్టణ మధ్యతరగతి భూయాజమానులను తీవ్ర అశాంతికి గురి చేస్తున్నది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ధరణి పోర్టల్’ లోని ప్రాథమిక లోపాలు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని ‘సెక్షన్ 22ఎ’ కింద లక్షలాది ఎకరాల ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలోకి నెట్టడం నేడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ, సామాజిక వివాదంగా మారింది. ఈ లోపాలను సరిదిద్దేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి హైపవర్ కమిటీని ఏర్పాటు చేయడం స్వాగతించదగిన పరిణామమే అయినా, క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రతను బట్టి తక్షణ ముందడుగు పడాల్సి ఉంది.
గత ప్రభుత్వం నిర్దిష్టమైన క్షేత్రస్థాయి పరిశీలనలు లేకుండా, కేవలం డిజిటల్ రికార్డుల ఆధారంగా ధరణి పోర్టల్‌ను రూపొందించడం పెద్ద తప్పిదంగా మారింది. ఇందులో సాగుదారుల వాస్తవ హక్కులను ప్రతిబింబించే ‘స్వాధీనం’,’అనుభవం’ వంటి కీలకమైన కాలమ్‌లను తొలగించడం వల్ల అక్రమాలకు, భూ లావాదేవీల దుర్వినియోగానికి దారితీసిందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా భూమిపై వాస్తవంగా సాగు హక్కులు కలిగి ఉండి, దస్తావేజులు లేని లక్షలాది మంది నిరుపేదలు, కౌలు రైతులు రాత్రికి రాత్రే తమ హక్కులను కోల్పోయారు. డిజిటల్ రికార్డుల అప్‌డేట్ లోపభూయిష్టంగా జరగడం వల్ల, దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న సామాన్య రైతుల పట్టా భూములు సైతం రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి. రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22ఎ నిబంధన నిజానికి ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల అక్రమ విక్రయాలను అడ్డుకోవడానికి ఉద్దేశించినది. అయితే, రెవెన్యూ యంత్రాంగం. ధరణి సాఫ్ట్ వేర్ లోపాల కారణంగా అసలైన ప్రైవేటు భూములు, కోర్టు వివాదాల్లో లేని ల్యాండ్ పార్సెల్స్ కూడా ఈ నిషేధిత జాబితాలోకి వెళ్లాయి.
క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఉన్న భూమి విస్తీర్ణానికి ఆన్‌లైన్ రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి మధ్య తీవ్రమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి . సిస్టమ్ సర్వీస్ లెవెల్ స్టాండర్డ్స్‌ను దాటవేసి, సామాన్య రైతుల భూ విస్తీర్ణాన్ని ఐటీ సిస్టమ్స్ ద్వారా ఏకపక్షంగా తగ్గించడం లేదా మార్చేసారు. ఒకే సర్వే నంబర్‌లో వందల ఎకరాల భూమి ఉన్నప్పుడు, అందులో ఒక చిన్న భాగం (ఉదాహరణకు 10 గుంటలు) దేవాదాయ లేదా ప్రభుత్వ భూమి ఉంటే, ఆ మొత్తం సర్వే నంబర్‌ను (వందల ఎకరాలను) ‘సెక్షన్ 22ఎ’ నిషేధిత జాబితాలోకి చేర్చారు. సర్వే నెంబర్ల ఉప-విభజన ప్రక్రియను పూర్తి చేయకపోవడమే ఈ బ్లైండ్ లాకింగ్ వ్యవస్థకు ప్రధాన కారణం. దీనివల్ల రైతులు అత్యవసర పరిస్థితుల్లో తమ భూములను అమ్ముకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక ఆర్థికంగా అతలాకుతలమవుతున్నారు.
ఉమ్మడి లేఅవుట్లు, జీఓ 59 పరిధిలోని భూములు, సింగరేణి కోల్‌బెల్ట్ కార్మికులకు కేటాయించిన స్థలాలు కూడా ఈ 22ఎ ఉచ్చులో చిక్కుకోవడం సమస్య తీవ్రతను సూచిస్తున్నది . ధరణి చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ నిర్ణయమే అంతిమంగా మారింది. తహశీల్దార్ లేదా కలెక్టర్ ఒక దరఖాస్తును తిరస్కరించడంతో బాధితులు వేలాదిగా హైకోర్టును ఆశ్రయించాల్సి వొచ్చింది. గతంలో నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో కేవలం వివాదాలు లేని భూములను ‘పార్ట్-ఎ’ కింద చేర్చి పాస్ పుస్తకాలు ఇచ్చారు. కానీ, స్వల్ప వివాదాలు ఉన్న లక్షలాది ఎకరాల ‘పార్ట్-బి’ భూములను అలాగే ఒదిలేశారు. ఈ అపరిష్కృత డేటా నేరుగా డిజిటల్ పోర్టల్‌లోకి వలసరావడం వల్ల వివాదాలు మరింత ముదిరాయి. ఇటీవలి ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలినట్లుగా, సిస్టమ్ ఆర్కిటెక్చర్‌లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేట్ వ్యక్తులు, వేస్టెడ్ ఇంటరెస్ట్స్ ల్యాండ్ రికార్డుల్లోకి అనధికారికంగా ప్రవేశించి తప్పుడు మార్పులు చేశారు. కేవలం కొన్ని జిల్లాల పైలట్ ప్రాజెక్ట్ తనిఖీల్లోనే కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుల మళ్లింపు, అక్రమ లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. రికార్డుల్లో తప్పులను సరిదిద్దడానికి దాదాపు 33 రకాల వేర్వేరు కరెక్షన్ మాడ్యూల్స్ పెట్టారు. సామాన్య రైతులకు ఏ తప్పుకు ఏ మాడ్యూల్ కింద, ఎలా అప్లై చేయాలో తెలియక, ప్రతి అప్లికేషన్‌కు ₹1,000 ఫీజు చెల్లించి, చివరకు సాంకేతిక కారణాలతో లక్షలాది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.
ప్రస్తుత ప్రభుత్వం ధరణి స్థానంలో ‘భూ భారతి’ రికార్డుల చట్టం, 2025 కింద నూతన వ్యవస్థను తెచ్చినప్పటికీ, పాత రికార్డుల తప్పుల తడకను ఇంకా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సి ఉంది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా, 22ఎ పరిధిలోని 12 ప్రధాన అంశాలపై (యూఎల్‌సీ, భూదాన్, ఇందిరమ్మ ఇళ్లు తదితర భూములు) ఈ కొత్త హైపవర్ కమిటీ 30 రోజుల్లోగా లోతైన నివేదికను సమర్పించాల్సి ఉంది. కేవలం కమిటీల ఏర్పాటుకే పరిమితం కాకుండా, ఒకవేళ వివాదంలో ఉన్న భూమి నిజమైన ప్రైవేట్ ఆస్తి అని తేలితే.. రెండు రోజుల్లోనే దానికి క్లియరెన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలనే ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా పాటించాలి. సాంకేతికత ఎప్పుడైనా పరిపాలనను సులభతరం చేయాలి గానీ, సామాన్యుడి పాలిట శాపంగా మారకూడదు.





