ఈ జాడ్యానికి ముగింపు ఏదీ!?

“ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులు అనేవి అందరికీ సమానంగా ఉండాలి.కనుక “వారసత్వ రాజకీయ నిరోధక చట్టం”గురించి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టానికి నూటికి నూరు శాతం ఆలోచించాల్సిన అంశం ! అవసరమే కాదు, అనుసరణీయం కూడా! ఒకసారి చట్టసభ కు ఎన్నికైన వారి కుటుంబం నుండి మరొకరికి ప్రాతినిధ్యం కల్పించకుండా నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది.అంతేకాదు, ఒకసారి చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తికి కనీసం రెండు సార్లు మించి ఆ అవకాశం ఇవ్వకపోవడం వలన రాజకీయాల్లో,చట్టసభల్లో ఎప్పటికప్పుడు నూతన తరం ప్రవేశిస్తుంది..”

-ఎన్.తిర్మల్
(పొలిటికల్ ఎనలిస్ట్, రచయిత, సామాజిక కార్యకర్త)
సెల్:9441864514

రాజులు పోయినా,రాజ్యాలుకూలినా,రాజరికపు ఆనవాళ్ళు పోవడం లేదు..రాజ”కీయం” అంటేనే రాజులు ఆడే దైనందిన క్రీడ! ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా పాత రాజకీయ విలువలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.వారసత్వంగా తండ్రి,తాతలు నుండి సంక్రమించే ఆస్తి, భూమిపై హక్కులు లాగా లేని రాజకీయ హక్కులు కొందరు తేరగా అనుభవిస్తున్నారు.ఇది ప్రజాస్వామ్య మనబడే ప్రక్రియ కు విరుద్దం అయిన అంశమే అయినప్పటికీ వారసత్వ రాజకీయాలను ఇప్పటికీ తమ పూర్వీకుల నుండి దారాదత్తం అయ్యిందనే భావనతోనే కొందరు వారసత్వ రాజకీయాలు అనుభవిస్తున్నారు.ప్రజలు కూడా ఇది ప్రజాస్వామ్య విరుద్దమైన అంశమని భావించనంతగా వారసత్వ రాజకీయాలకు జై కొడుతున్నారు.ఆదునిక రాజకీయాలలో ఇదొక అసంకల్పిత రాజకీయ క్రీడగా అమలు జరుగుతున్న దాని మూలాలు,నష్టాలు ప్రజలకు అర్థం కావడం లేదు.

రాజకీయ నేతలు పిల్లలు,వారి వారసులకు ఆస్తి హక్కు తోపాటు తేరగా వచ్చిన హక్కుగా రాజకీయాలలో పదవులు అనుభవిస్తున్నారు.ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాలను ప్రొత్సహించడం అంటే ప్రజల సర్వసమాన ప్రాతినిధ్య హక్కుకు మంగళం పాడినట్లే అవుతుంది.ఒక రాజకీయ నేతగా అధికారం అందలం ఎక్కడానికి రాజకీయ వారసుడైతే అన్ని రకాల రాజకీయ విధానాలు బైపాస్ చేసి అందలం ఎక్కిస్తున్నారు.చాలా సులువుగా తేలిగ్గా పదవుల్లోకి ఎగబాకుతున్నారు.అదే ఓ సాదారణ కార్యకర్త అయితే దిగువ నుండి అధికార స్థాయికి అంత తొందరగా ఎదగడం అసాధ్యం.అంతేకాదు అనేక రాజకీయ వైకుంఠ పాళీలు దాటి రావడానికి చాలా సమయం వృధా అవుతుంది.ప్రజాస్వామ్య భావన అనుభవించడం లో ఓ వారసత్వ రాజకీయ నాయకుడికి,సాధారణ కార్యకర్త కు మధ్య ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా వైవిధ్యం ఉంటుంది.మన భారత దేశంలో అయితే ఈ వారసత్వ రాజకీయ జాడ్యం అడుగడుగునా కనిపిస్తుంది.ప్రజాస్వామ్యానికి పట్టిన బంకలాగా సాగుతుంది.మరకలాగా మిగులుతుంది.

ఒకసారి పీఠం ఎక్కిన వాడు తన పిల్ల ,పిల్ల తరం రాజకీయం తన వీరభోజ్యంగా ,తమ వారసుల అప్రకటిత ఆస్థిపాస్థిగా భావిస్తున్నారు..! ఈ జాడ్యం దేశవ్యాప్తంగా ఉంది.ముఖ్యంగా కుల రాజకీయ ఆధిపత్యం కలిగిన వ్యవస్థల్లో ఎక్కువగా కనిపిస్తుంది.అందుకు ఉదాహరణలు ఉత్తరప్రదేశ్, బీహార్,ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉదాహరణగా తీసుకొనవచ్చును.ప్రాంతీయ అస్థిత్వం కోసం కొట్లాడిన తమిళనాడు, ఝార్ఖండ్, తెలంగాణా రాష్ట్రలలో వారసత్వ రాజకీయాలకు పెద్ద పీఠనే ఉంది.ఇక మనకు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ జాడ్యం మరింత వికృత రూపం తీసుకుందని చెప్పవచ్చును.ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, ప్రస్థుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారసత్వ రాజకీయ ప్రతినిధులే! ఇకపోతే తెలంగాణలో కూడా తక్కువేం తినలేదు.తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని రాజకీయ వారసత్వం తొలినుండి గ్రహణంలా వెంటాడుతూనే ఉంది.కాంగ్రెస్ లో కూడా సంస్కృతి తక్కువేం లేదు.మంత్రులతోపాటు తమ్ముడినో,అన్ననో,కాకుంటే భార్యనో తమ కుటుంబ సభ్యులు చట్టసభల్లో కొనసాగుతున్న వారి సంఖ్య అరడజనుకు పైగానే ఉన్నారు. చట్టసభలు నుంచి సీనియర్ ప్రతినిధులు నిష్క్రమణ చేసే సమయం లో ,లేదా చనిపోయిన సందర్భంలో తమకోసం కష్టపడిన కార్యకర్తలకు బదులు తమ కూతురికో,కుమారునితో టిక్కెట్ ఇవ్వమని కోరుతున్నారు.ఒక కుటుంబంలో నేత ఎదిగిన తర్వాత ఆ అధికారం తమ కుటుంబం దారాదత్తం అని భావించే నాయకుల సంఖ్య కాస్తా ఎక్కువేనని చెప్పవచ్చును.

ప్రాంతీయ పార్టీలే కాదు! జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్, మరికొన్ని ఇతర పార్టీల లాంటి పార్టీలు ఈ వారసత్వ రాజకీయాలకు అతీతంగా లేవు.అంతేకాదు,తమ కుటుంబ సభ్యులు ఎంత అసమర్థులు ఐనప్పటికీ తమ అధికార బలంతో సమర్థులుగా చూపడానికి సైతం ప్రయత్నాలు చేయడానికి వెనుకాడడం లేదు. అయితే ఈ రాజకీయ వ్యవస్థ లో వారసత్వ రాజకీయ నేతలు రాజ్యం తమ వీరబోజ్యం గా భావిస్తూ రాజకీయ విలువలు,వలువలు దిగజార్చుతున్నారు.ప్రజాస్వామ్య మనబడే పదాలకు అర్థాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే చెడగొడుతున్నారు .వారసులకు పెద్ద పీట ఆయాచితంగా వేయడం ద్వారా ప్రజల, బలహీన వర్గాల ప్రాతినిధ్య హక్కుకు ,ఎదుగుదలకు ప్రజాస్వామ్య వ్యవస్థ లో కత్తెర వేసినట్లే అవుతుంది.కనుక ప్రజాస్వామ్య మనుగడ లో కుక్క మూతి పిందెలాంటి ఈ వారసత్వ రాజకీయాలు గురించి ఆలోచించవలసిన అవసరం ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థల ముందు ఓ సవాల్ లాంటిదే! మనదేశ రాజకీయాల్లో ఇది ప్రజల్ని చాలాకాలం గా మభ్య పెడుతున్న రాజకీయ సంస్కృతి నే?“మా తాతలు నేతులు తాగారు,మా మూతులు వాసన చూడండి “అన్న విధంగా ఒక రకమైన రాజకీయ మత్తుతోపుగాకు పిలకల్లా వారసత్వ రాజకీయాలు విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.ఇది రాజకీయాల్లో ఒక రకమైన ప్రజాస్వామ్య హనన చర్యనే కనుక దీనిపై ప్రజలు, ప్రభుత్వాలు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది.

ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులు అనేవి అందరికీ సమానంగా ఉండాలి.కనుక “వారసత్వ రాజకీయ నిరోధక చట్టం”గురించి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టానికి నూటికి నూరు శాతం ఆలోచించాల్సిన అంశం ! అవసరమే కాదు, అనుసరణీయం కూడా! ఒకసారి చట్టసభ కు ఎన్నికైన వారి కుటుంబం నుండి మరొకరికి ప్రాతినిధ్యం కల్పించకుండా నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది.అంతేకాదు, ఒకసారి చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తికి కనీసం రెండు సార్లు మించి ఆ అవకాశం ఇవ్వకపోవడం వలన రాజకీయాల్లో,చట్టసభల్లో ఎప్పటికప్పుడు నూతన తరం ప్రవేశిస్తుంది.ఆయా తరం సమస్యలు నిత్యనూతనంగా చర్చించ బడతాయి.ఆధునిక సవాళ్ళను అధిగమించే బలం చట్టసభలకు దక్కుతుంది.ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది ప్రజలకు ప్రాతినిధ్యం లభించడంతో పాటు రాజకీయాల్లో ధనం,అదికారాల వినియోగం లాంటి అపసవ్య ధోరణలు కొంత వరకు అరికట్టే అవకాశం ఉంది.ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ లో అధికారాన్ని కేంద్రీకరించి కుండా వికేంద్రీకరణ దిశగా ప్రయాణం అవుతుంది.వారసుల కోసం నీచ నికృష్ట పద్దతులు అనుసరించే రాజకీయ స్వభావం లో కూడా మార్పులొస్తాయి.కనుక ప్రజలు, ప్రభుత్వాలు ఈదిశగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.

రాజకీయ నాయకులు వారసులకు ప్రజాస్వామ్య హక్కులు వర్తిస్తాయి.కానీ,కొన్ని నిర్దిష్టమైన చట్టాలు ద్వారా నియంత్రణ చేయవచ్చు.ప్రజాస్వామ్యం నాలుగు పాదాల మీద నడిచే ఒక ధర్మం అయినప్పటికీ దానిలోని ఔదార్యం సమాన పంపిణీ కోసం కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు,చర్యలు జరపడం లో తప్పులేదు.కనుక భారత రాజకీయాల్లో ఈ వారసత్వం అనే పదానికి చెక్ పెట్ట గలిగితే తరతరాలుగా పేరుకుపోయిన పాలనా జాడ్యం చాలా తొలగించబడుతుంది.నియంత్రణలో ఉంచవచ్చును.రాజకీయాల్లో ప్రజాస్వామ్యం అనే పదం మరింత అర్థవంతం అవుతుంది.విస్తృతార్థంలో ప్రజలకు ప్రజాస్వామ్య భావన చేరువ అవుతుంది.కనుక యువత తమ రాజకీయ భవితవ్యం కోసం, ప్రజలు, ప్రభుత్వాలు మనుగడ కోసం ఈ ప్రతిపాదనపై చర్చించాల్సిన అవసరం ఉంది.ఈ అభిప్రాయంతో ఎవరైనా ఎకీభవించనూవచ్చు లేదా విభేదించనూవచ్చు.కానీ ఇది ఎప్పుడో ఒకనాడు మన ప్రజాస్వామ్యం చట్రంలో పరిష్కారం కావలసిన ఆధునిక రాజకీయ సమస్యనే!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *