తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగంలో ‘డయాగ్నోస్టిక్ గ్యాప్’ (రోగ నిర్ధారణ లోపం) తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది . రాష్ట్ర అసెంబ్లీలో ఆరోగ్యశాఖ స్వయంగా వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, సుమారు 3.8 కోట్ల జనాభా కలిగిన తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల్లో కేవలం 9 ఎంఆర్ఐ యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని అర్థం ప్రతి 42 లక్షల మంది ప్రజలకు ఒకే ఒక్క ఎంఆర్ఐ మిషన్ అందుబాటులో ఉంది. అంతకంటే ఘోరమైన వాస్తవం ఏమిటంటే, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 29 జిల్లాలకు అసలు ప్రభుత్వ ఎంఆర్ఐ సౌకర్యమే లేదు. ఈ గణాంకాలు పాలనాపరమైన వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయి . ఒకవైపు గ్లోబల్ హెల్త్‌కేర్ హబ్‌గా, అత్యాధునిక కార్పొరేట్ హాస్పిటల్స్ కు నిలయంగా హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తుంటే, మరోవైపు దానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామీణ, జిల్లా రోగులు కనీస రోగ నిర్ధారణ పరీక్షల కోసం అల్లాడిపోతున్నారు. మెదడు, వెన్నెముక, నరాలు, కీళ్ల సంబంధిత తీవ్రమైన వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడానికి ఎంఆర్ఐ అత్యంత కీలకం. ప్రమాదాలు జరిగినప్పుడు అంతర్గత గాయాలను గుర్తించాలన్నా ఇదే శరణ్యం. అటువంటి కీలకమైన స్కానింగ్ సౌకర్యం 29 జిల్లాల్లో లేకపోవడం వల్ల పేద రోగులకు తీరని అన్యాయం జరుగుతున్నది .
గడిచిన కొన్నేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా అనేక ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. వైద్య సీట్ల సంఖ్య పెరిగింది, భారీ భవనాలు వెలిశాయి. కానీ, ఆయా హాస్పిటల్స్ ల్లో అత్యాధునిక వైద్య పరికరాలు లేకపోవడం వల్ల అవి కేవలం సాధారణ ఓపీ కేంద్రాలుగానే మిగిలిపోతున్నాయి. నిపుణులైన వైద్యులు ఉన్నప్పటికీ, సరైన రేడియోలాజికల్ మౌలిక వసతులు లేకపోవడంతో వారు కూడా రోగులను హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ లేదా నిమ్స్ హాస్పిటల్స్ కు ‘రెఫర్’ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ తీవ్రమైన కొరతను అధిగమించడానికి నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని నీలోఫర్, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ లలో మరో 9 కొత్త ఎంఆర్ఐ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ అసెంబ్లీ వేదికగా ప్రకటించడం కొంత ఉపశమనం కలిగించే అంశం. అయితే, కేవలం యంత్రాలను కొనుగోలు చేసి హాస్పిటల్స్ ల్లో పడేస్తే సమస్య సర్దుమణగదు. తెలంగాణ రాష్ట్ర రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్ (టీఎస్ఆర్డీఏ) ప్రతినిధులు హెచ్చరిస్తున్నట్లుగా, ప్రస్తుతం రాష్ట్ర వైద్యరంగంలో మంజూరైన పోస్టుల్లో దాదాపు 50 శాతం ఖాలీలు ఉన్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ వంటి జిల్లాల్లోని ద్వితీయ శ్రేణి హాస్పిటల్స్ ల్లో ఏకంగా 56.1 శాతం, మహబూబ్‌నగర్ బోధనా హాస్పిటల్ లో 52.8 శాతం వైద్యుల పోస్టులు ఖాలీగా దర్శనమిస్తున్నాయి.
ఈ జిల్లాల్లో సరిపడా రేడియోలాజిస్టులు, శిక్షణ పొందిన ఎంఆర్ఐ టెక్నీషియన్లు లేకపోతే, కోట్ల రూపాయల ప్రజాధనంతో కొనే అత్యాధునిక యంత్రాలు తుప్పుపట్టిపోవడానికి ఎంతో కాలం పట్టదు. మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు మానవ వనరుల భర్తీ సమాంతరంగా సాగవలసి ఉంది. జిల్లా కేంద్రాల నుంచి ప్రభుత్వ వైద్యం కోసం ఒక పేద రోగి హైదరాబాద్‌కు రావాల్సి వొస్తే, కేవలం ప్రయాణ ఖర్చులే కాక, తోడుగా వొచ్చే సహాయకుల ఖర్చులు తోడవుతాయి. ఇక్కడికి వొచ్చాక ప్రభుత్వ హాస్పిటల్స్ ల్లో ఉండే విపరీతమైన రద్దీ వల్ల ఎంఆర్ఐ అపాయింట్మెంట్ కోసం వారాల తరబడి నిరీక్షించాల్సి వొస్తున్నది . ఈ నిరీక్షణను తట్టుకోలేక, ప్రాణాలను కాపాడుకునేందుకు రోగులు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఒక్కో స్కాన్‌కు వేలాది రూపాయలు వసూలు చేస్తుండటంతో, పేదలు అప్పులపాలు కావడమో లేదా చికిత్సను అర్ధాంతరంగా ఆపేయడమో జరుగుతున్నది . అన్నింటికంటే భయంకరమైనది ‘ట్రీట్మెంట్ డిలే’ (చికిత్సలో ఆలస్యం). రోగ నిర్ధారణ సకాలంలో జరగకపోవడం వల్ల వ్యాధి ముదిరిపోయి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతున్నది. ఒక పక్షవాతం లేదా రోడ్డు ప్రమాదానికి గురైన రోగికి మొదటి కొన్ని గంటలు ‘గోల్డెన్ అవర్’ అత్యంత కీలకం. ఆ సమయంలో స్కానింగ్ చేసి సమస్యను గుర్తించాల్సింది పోయి, వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయించడం వల్ల దారిలోనే ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇది కేవలం వ్యవస్థాగత లోపం కాదు, పేదవాడి ప్రాణాల పట్ల సాగుతున్న నెరవేరని సామాజిక న్యాయం.
ఈ వివక్ష మారాలి. రాజధాని కేంద్రంగా సాగే కేంద్రీకృత వైద్య విధానం ప్రజాస్వామ్య ఆరోగ్య సూత్రాలకు విరుద్ధం. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం స్థానికంగానే అందాలనే ఉద్దేశంతోనే జిల్లాల విభజన, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు జరిగాయి. కానీ, మౌలిక వసతులు, డయాగ్నోస్టిక్ పరికరాలు లేని వైద్య కళాశాలలు కేవలం భవనాలుగా మిగిలిపోతాయి. ప్రభుత్వం బడ్జెట్లో వైద్య రంగానికి కేటాయింపులను కేవలం జీతాలు, భవనాల నిర్మాణాలకే పరిమితం చేయకుండా, ఇలాంటి లైఫ్-సేవింగ్ డయాగ్నోస్టిక్ టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రకటించిన కొత్త ఎంఆర్ఐ యంత్రాల స్థాపనతో పాటు, మిగిలిన జిల్లాల్లో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలోనైనా సరే స్కానింగ్ సేవలను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలి. అలాగే ప్రభుత్వం వాడుతున్న ‘ఈ-ఉపకరణ్’ వెబ్ ఆధారిత ఇన్వెంటరీ విధానం ద్వారా యంత్రాల నిరంతర నిర్వహణను పర్యవేక్షించాలి. అప్పుడే జిల్లాల్లోని పేద రోగులకు ప్రయాణ భారంతో పాటు, ఆర్థిక భారం, ప్రాణాపాయం తప్పుతాయి. ఆరోగ్య తెలంగాణ కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం కాకూడదు; అది ఆదిలాబాద్ నుండి అలంపూర్ దాకా ఉన్న ప్రతి పేదవాడి దరిచేరినప్పుడే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుంది.





