హైదరాబాద్‌లో అక్టోబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక వోటర్ల నమోదు శిబిరాలకు ఆశించిన స్థాయిలో స్పందన కరువైందని అక్టోబర్ 17న ప్రచురితమైన వార్తా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా అర్హులైన కొత్త వోటర్లను చేర్చడానికి, డ్రాఫ్ట్ జాబితా నుంచి తొలగించిన పేర్ల పునరుద్ధరణకు ఫారమ్-6 ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. అయితే, క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆశించిన లక్ష్యాలను చేరుకోలేదన్న సంగతిని గణాంకాలు, పౌరుల స్పందనలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం నివేదికల ప్రకారం, వోటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా మొత్తం 2,64,87,213 వోటర్ల సమాచార ఫారమ్‌లు అందాయి. ఇందులో భాగంగా కేవలం హైదరాబాద్ నుంచే వోటరు నమోదు కోసం అత్యధికంగా 4.13 లక్షలకు పైగా ఫారమ్-6 దరఖాస్తులు వొచ్చాయి.
ఈ భారీ సంఖ్యలో వొచ్చిన అప్లికేషన్లలో ఇప్పటివరకు 2,04,346 దరఖాస్తులను అధికారులు ఆమోదించగా, 73,868 దరఖాస్తులను తిరస్కరించారు. ఇంకా 1,34,932 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ గణాంకాలు భారీ సంఖ్యలో ప్రజలు వోటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు చూపిస్తున్నప్పటికీ, అక్టోబర్ 15, 16 తేదీల్లో నేరుగా పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన ప్రత్యేక శిబిరాల విషయానికి వొచ్చేసరికి మాత్రం తీవ్రమైన నిరాశే మిగిలింది. నగరంలోని జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట వంటి కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలు రెండు రోజుల పాటు వెలవెలబోయాయి.
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో రెండవ రోజైన శుక్రవారం (అక్టోబర్ 16) నాడు పలుచోట్ల బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) కేంద్రాల్లో అందుబాటులో ఉన్నప్పటికీ, వోటర్ల రాక చాలా తక్కువగా నమోదైంది. దీనికి తోడు, ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించాల్సిన రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏ) కూడా అనేక కేంద్రాలకు హాజరుకాకపోవడం గమనార్హం. క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యపరచడంలో అటు ఎన్నికల సంఘం ప్రచార లోపం, ఇటు రాజకీయ పార్టీల ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తున్నాయి
ఈ శిబిరాలకు ఆశించిన స్పందన రాకపోవడానికి అతిపెద్ద కారణం—వాటిని గురు, శుక్రవారాలు (పనిదినాల్లో) నిర్వహించడమే. ఉద్యోగులు, ఐటీ రంగానికి చెందిన నగరవాసులు , దినసరి కూలీలు తమ విధులను వదులుకుని పనిదినాల్లో కేంద్రాలకు రావడం సాధ్యం కాలేదని వోటర్లు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. ఇటువంటి శిబిరాలను శని, ఆదివారాలు లేదా సాధారణ సెలవు రోజుల్లో నిర్వహిస్తేనే ఆశించిన ఫలితాలు వొస్తాయని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వోటర్లను నమోదు చేసుకోవాల్సిన ఎన్నికల యంత్రాంగం ప్రజలకు అనుకూలంగా పనిచేయకపోతే సార్వత్రిక వోటు హక్కుకు అర్థమేమిటి? వోటర్ల జాబితా సవరణ ప్రజాస్వామ్యానికి కీలకమైన ప్రక్రియ. అర్హులైన పౌరుల పేర్లు నమోదు కాకపోవడం, తొలగించిన పేర్ల పునరుద్ధరణలో ఇబ్బందులు ఎదురవడం ప్రజాస్వామ్య హక్కులకు సంబంధించిన సమస్య. శిబిరాలను సెలవు రోజుల్లో నిర్వహించడం, ఇంటింటి పరిశీలన చేపట్టడం, వోటర్లకు ముందస్తు సమాచారం అందించడం అవసరం.ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం, బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి వోటర్ల వివరాలను పరిశీలించాల్సి ఉంది. కానీ, నగరంలోని అత్యధిక ప్రాంతాలలో ఈ ఇంటింటి సందర్శనలు జరగలేదని వార్తా కథనాలు స్పష్టం చేశాయి. బీఎల్ఓలు కొన్ని నిర్దేశిత ప్రాంతాలకే పరిమితమవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో వాస్తవ వోటర్ల గుర్తింపు ప్రక్రియ కుంటుపడింది.
హైదరాబాద్ జిల్లాలో వోటర్ల జాబితా సవరణ ప్రక్రియలో దాదాపు 1.34 లక్షల దరఖాస్తులు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయి. నవంబర్ 7 వరకు వోటరు నమోదుకు అవకాశం ఉన్నప్పటికీ, ప్రత్యేక శిబిరాల వైఫల్యం నుండి ఎన్నికల సంఘం పాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్తులో ఈ శిబిరాలను తప్పనిసరిగా సెలవు రోజుల్లో నిర్వహించడంతో పాటు, ఇంటింటికీ వెళ్లి వోటర్లను ధ్రువీకరించే వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి. అప్పుడే ప్రజాస్వామ్యంలో సార్వత్రిక వోటు హక్కుకు అసలైన సార్థకత చేకూరుతుంది.
వోటరు నమోదు ప్రక్రియలో డిజిటల్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సాంకేతిక లోపాలు వోటర్లను వేధిస్తున్నాయి. నేషనల్ వోటర్స్ సర్వీస్ పోర్టల్ (ఎన్వీఎస్పీ) , వోటర్ హెల్ప్‌లైన్ యాప్‌లలో సర్వర్ డౌన్ సమస్యల వల్ల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సాంకేతిక అడ్డంకులను అధిగమించడానికే ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసినా, సరైన సమయాల్లో నిర్వహించకపోవడం వల్ల ఆశించిన ప్రయోజనం చేకూరలేదు. మరోవైపు, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలను భాగస్వాములను చేయాల్సిన రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల సమయంలోనే వోటర్ల గుర్తింపుపై శ్రద్ధ పెట్టడం విచారకరం. సాధారణ రోజుల్లో వోటర్ల జాబితా సవరణపై వారు చూపే నిర్లిప్తత వల్లే బూత్ స్థాయి ఏజెంట్లు ఈ శిబిరాలకు హాజరుకాలేదు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కేవలం ఎన్నికల యంత్రాంగమే కాకుండా, రాజకీయ పార్టీలు, పౌర సమాజం సమాన బాధ్యత వహించాలి. తదుపరి విడత శిబిరాల నాటికైనా యంత్రాంగం మేల్కొని, విస్తృత ప్రచారంతో పాటు సెలవు రోజుల్లోనే వీటిని నిర్వహించి ప్రతి ఒక్క అర్హుడికి వోటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.





