ప్రజల జీవన సంస్కృతికి ప్రతీకలు బతుకమ్మ – దసరా

“బతుకమ్మ – దసరా తెలంగాణ ప్రజల జీవన సంస్కృతిలో భాగమైన పండుగలు. పూలను పేర్చే చేతుల్లో ప్రకృతితో అనుబంధం, పాటల్లో మహిళల అనుభవాలు, పల్లె ఉత్సవాల్లో సామూహిక జీవితం, జానపద కళల్లో శ్రమజీవుల సృజన కనిపిస్తాయి. ఈ ప్రజా సంస్కృతిని మతతత్వం, మార్కెట్‌ వినియోగ సంస్కృతి తమ ప్రయోజనాలకు ఉపయోగించుకునే పరిస్థితిని ఎదుర్కోవాలి. సమానత్వం, లౌకికత, శ్రమ గౌరవం, మహిళా విముక్తి, పర్యావరణ పరిరక్షణ ఆధారంగా ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిని నిర్మించాల్సిన అవసరం ఉంది..”
పండుగ ఒక సమాజం తన జీవనాన్ని, ప్రకృతితో సంబంధాన్ని, శ్రమతో అనుబంధాన్ని, సంతోషాన్ని, బాధను, సామూహిక జ్ఞాపకాలను వ్యక్తం చేసుకునే సాంస్కృతిక రూపం. పండుగల చరిత్రను పరిశీలిస్తే.. ప్రజల జీవన పరిస్థితులు, వృత్తులు, ప్రకృతి, వ్యవసాయ చక్రం, సామాజిక సంబంధాలు, స్థానిక ఆచారాలు కనిపిస్తాయి. అందువల్ల పండుగను అర్థం చేసుకోవడం అంటే దాని వెనుక ఉన్న ప్రజల జీవితాన్ని అర్థం చేసుకోవడం. బతుకమ్మ తెలంగాణ మహిళల సృజనాత్మకతకు ప్రత్యేకమైన సాంస్కృతిక రూపం. వివిధ కాలాల్లో పూసే పూలను సేకరించి పేర్చడం, వాటి చుట్టూ పాటలు పాడటం, సమూహంగా చేరడం, తమ అనుభవాలను పాటల్లో వ్యక్తం చేయడం ఇందులో కనిపిస్తుంది. బతుకమ్మ పాటల్లో కుటుంబ జీవితం, పల్లె సంబంధాలు, ప్రకృతి, పంటలు, బంధాలు, స్త్రీల ఆశలు, బాధలు, సామాజిక అనుభవాలు ప్రతిఫలిస్తాయి. అక్షరాల్లో నమోదు కాని అనేక మహిళల జీవిత చరిత్రలు ఈ మౌఖిక సాహిత్యంలో నిలిచాయి. 
బతుకమ్మను కేవలం ఒక ఆచారంగా పరిమితం చేయడం సరికాదు, దాని సామాజిక సాంస్కృతిక పరిధిని కుదించవద్దు. అదే సమయంలో దాన్ని మార్కెట్‌ బ్రాండ్‌గా మార్చడం ప్రజల సంస్కృతిని వినియోగ వస్తువుగా మార్చే ప్రక్రియ. పూలు అమ్మే మహిళ నుంచి వాటిని పెంచే రైతు వరకు, పండుగకు అవసరమైన వస్తువులు తయారు చేసే కార్మికుడి నుంచి వాటిని రవాణా చేసే శ్రామికుడి వరకు అనేక చేతుల శ్రమ బతుకమ్మ వెనుక ఉంది. ఆ శ్రమ కనిపించకుండా పండుగను కేవలం అలంకరణగా చూపించడం ప్రజా సంస్కృతిలోని అసలు బలాన్ని మరుగుపరుస్తుంది. తెలంగాణ సంస్కృతిని రాజులు, సంస్థానాధీశులు, భూస్వాములు నిర్మించలేదు అనేది స్పష్టం. పొలాల్లో పనిచేసిన రైతులు, కూలీలు, పశుపోషకులు, నేతలు, కమ్మర్లు, కుమ్మర్లు, మత్స్యకారులు, చర్మకారులు, బుట్టలు అల్లేవారు, పూలు పెంచేవారు, చేతివృత్తిదారులు, జానపద కళాకారులు తమ శ్రమతో దాన్ని నిర్మించారు. పల్లె జీవనానికి అవసరమైన ప్రతి వస్తువు వెనుక ఒక వృత్తి ఉంది. ప్రతి వృత్తి వెనుక ఒక శ్రమజీవి సమూహం ఉంది. ఆ సమూహాల అనుభవాలే ప్రజా సంస్కృతికి పునాది అవుతుంది.
దసరా పండుగ కూడా తెలంగాణ సామాజిక జీవితంలో అనేక రూపాల్లో వ్యక్తమైంది. గ్రామీణ ప్రాంతాల్లో జాతరలు, ఆటలు, జానపద కళలు, సామూహిక సమావేశాలు, వృత్తులకు సంబంధించిన ఆచారాలు, ఆయుధ పూజ వంటి అనేక రూపాలు కనిపిస్తాయి. కాలానుగుణంగా వాటి అర్థాలు మారాయి. వ్యవసాయ సమాజం నుంచి పట్టణ సమాజానికి జరిగిన మార్పు, వృత్తుల్లో వచ్చిన మార్పులు, ఉపాధి కోసం వలసలు, మార్కెట్‌ విస్తరణ, మీడియా ప్రభావం పండుగల రూపాన్నీ మార్చాయి. ప్రతి మార్పును ప్రజల జీవితం, సామాజిక సంబంధాలు, వర్గ ప్రయోజనాల కోణంలో పరిశీలించాలి. మార్కెట్‌ సంస్కృతి పండుగలను పెద్ద వినియోగ మార్కెట్‌గా మార్చుతోంది. దుస్తులు, ఆభరణాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, రుణాలు, ప్రకటనలు, ఆఫర్లు పండుగల చుట్టూ విస్తరిస్తున్నాయి. పండుగ ఆనందాన్ని వినియోగ సామర్థ్యంతో కొలిచే పరిస్థితి పెరుగుతోంది. పేద కుటుంబాలపై ఖర్చుల ఒత్తిడి, అప్పుల భారం పెరిగే ప్రమాదం ఉంది. పండుగ ప్రజల ఆనందానికి వేదిక కావాలి. అప్పు, పోటీ, ప్రదర్శనలకు వేదికగా మారకూడదు.
మతతత్వ రాజకీయాలు ప్రజా సంస్కృతికి మరో ప్రమాదం. ప్రజల మధ్య తరతరాలుగా ఏర్పడిన సాంస్కృతిక సంబంధాలను మతపరమైన గుర్తింపులుగా విడదీసే ప్రయత్నాలు నేడు జరుగుతున్నాయి. ఒక పండుగను మరో మతానికి వ్యతిరేకంగా నిలబెట్టడం, చరిత్రను మత ఘర్షణల చుట్టూ మాత్రమే వివరించడం, ప్రజా ఉత్సవాలను రాజకీయ సమీకరణాలకు ఉపయోగించడం సమాజాన్ని విభజిస్తుంది. తెలంగాణ పల్లెల్లో వివిధ మతాలు, కులాలు, వృత్తుల ప్రజలు పరస్పర సంబంధాలతో జీవించిన చరిత్ర ఉంది. బతుకమ్మ, దసరా, పీర్‌ పండుగలు, గ్రామదేవతల ఉత్సవాలు, జాతరలు అనేక సందర్భాల్లో ప్రజల సామూహిక జీవనంలో భాగమయ్యాయి. ఈ చరిత్రను మతతత్వపు గోడల మధ్య బంధించలేం. ప్రజా సంస్కృతి అంటే గతంలోని ప్రతి ఆచారాన్ని యథాతథంగా కాపాడటం కాదు. ప్రజల జీవితంలో ఏర్పడిన సృజనాత్మక, మానవీయ, సమానత్వ విలువలను ముందుకు తీసుకెళ్లడం. అదే సమయంలో కుల వివక్ష, అంటరానితనం, మహిళలపై ఆధిపత్యం, మూఢనమ్మకాలు, దోపిడీ, మత విద్వేషం వంటి అంశాలను ప్రశ్నించడం. శాస్త్రీయ దృక్పథం, మానవ గౌరవం, సమానత్వం, శ్రమ గౌరవం, లౌకికత, సామూహికత ప్రజా సంస్కృతికి ఆధారాలుగా నిలవాలి.
బతుకమ్మలో మహిళల పాత్ర గురించి మాట్లాడేటప్పుడు పూలు పేర్చే చేతుల సృజనను మాత్రమే గుర్తించడం సరిపోదు. ఇంటి పనులు, వ్యవసాయ శ్రమ, కూలి పని, వృత్తి పని, పిల్లల సంరక్షణ వంటి అనేక రూపాల్లో మహిళలు సమాజాన్ని నడిపిస్తున్నారు. పండుగ రోజున మహిళలను సాంస్కృతిక ప్రతీకలుగా గౌరవిస్తూ, మిగిలిన రోజుల్లో వారి శ్రమకు విలువ ఇవ్వకపోతే అది సంపూర్ణ ప్రజా సంస్కృతి కాదు. మహిళలకు విద్య, ఉపాధి, ఆస్తి హక్కు, రాజకీయ భాగస్వామ్యం, సమాన వేతనం, హింస నుంచి రక్షణ, కట్న వ్యవస్థకు వ్యతిరేక స్వేచ్ఛ, కుల వివక్ష నుంచి విముక్తి అవసరం. మహిళా విముక్తి ప్రజా ప్రత్యామ్నాయ సంస్కృతిలో అంతర్భాగం. పండుగల వెనుక ఉన్న పర్యావరణాన్ని గుర్తించడం మరో ముఖ్యమైన అంశం. తెలంగాణ పల్లెల్లో పూలు చెరువుల గట్లపై, పొలాల అంచుల్లో, పచ్చిక బయళ్లలో, అడవి అంచుల్లో పెరిగేవి. నేల, నీరు, విత్తనం, వర్షం, చెట్లు, పూలు, జీవ వైవిధ్యం గ్రామీణ జీవనానికి ఆధారం. చెరువులు ఎండిపోతే, సహజ వనరులు నశిస్తే, పూల వైవిధ్యం తగ్గితే పండుగలతో అనుబంధమైన జీవన సంస్కృతి కూడా బలహీనపడుతుంది. ప్లాస్టిక్‌ వినియోగం, రసాయన కాలుష్యం, నీటి వనరుల నాశనం, పర్యావరణ విధ్వంసం ప్రజా సంస్కృతిపై ప్రభావం చూపుతాయి. ప్రకృతిని కాపాడటం పండుగ సంస్కృతిని కాపాడటంలో భాగం.
జానపద కళలు ప్రజా సంస్కృతికి జీవనాడి. బుర్రకథ, ఒగ్గుకథ, డప్పు, కోలాటం, జానపద గేయాలు, వీధి నాటకాలు ప్రజల జీవితాన్ని, వారి పోరాటాలను, సామాజిక ప్రశ్నలను ప్రజల్లోకి తీసుకెళ్లిన కళారూపాలు. వాటిని కేవలం వినోద ప్రదర్శనలుగా పరిమితం చేయడం వాటి సామాజిక శక్తిని తగ్గించడం. ఆధునిక సాంకేతికతను జానపద కళాకారుల సృజనకు ఉపయోగించాలి. కళాకారులకు గౌరవం, పారితోషికం, ప్రదర్శన వేదికలు కల్పించాలి. పండుగ వేదికలు రైతుల సమస్యలు, కార్మికుల జీవితం, మహిళా సమానత్వం, కుల వివక్ష నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయ దృక్పథం వంటి అంశాలపై ప్రజా కళకు వేదికలుగా మారాలి. తెలంగాణ ప్రజల సంస్కృతిని వారి పోరాట చరిత్ర నుంచి వేరు చేయలేం. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సాగిన పోరాటాలు, భూమి కోసం జరిగిన రైతాంగ పోరాటాలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు సాగించిన ప్రతిఘటనలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రజల చైతన్యంలో చెరిగిపోని ముద్ర వేశాయి. భూమి, భుక్తి, గౌరవం, విముక్తి కోసం ప్రజలు సాగించిన పోరాటాలు ఒక ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతికి పునాది వేశాయి. పాటలు, కథలు, నాటకాలు, జానపద కళలు ఆ పోరాటాలను తరతరాలకు తీసుకెళ్లాయి.
ప్రజా సంస్కృతి అంటే ప్రజల జీవితాన్ని రాజకీయాల నుంచి వేరుచేయడం కాదు. దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు చేసే పోరాటాల్లో కొత్త విలువలు పుడతాయి. కుల ఆధిపత్యాన్ని ప్రశ్నించే పోరాటంలో సమానత్వం పుడుతుంది. మహిళల విముక్తి కోసం జరిగే పోరాటంలో కొత్త సామాజిక సంబంధాలు పుడతాయి. కార్మికుల హక్కుల పోరాటంలో శ్రమ గౌరవం ముందుకు వస్తుంది. భూమి, నీరు, అడవుల రక్షణ పోరాటాల్లో పర్యావరణ చైతన్యం పెరుగుతుంది. ప్రజాస్వామ్య హక్కుల కోసం జరిగే పోరాటాల్లో స్వేచ్ఛ, లౌకికత, సామాజిక న్యాయం బలపడతాయి. ఈ విలువలు ప్రజా ప్రత్యామ్నాయ సంస్కృతికి జీవం పోస్తాయి. పండుగను ప్రజల నుంచి దూరం చేయడం ఒక రకమైన సాంస్కృతిక ఆధిపత్యం. ప్రజల సంస్కృతిని మార్కెట్‌ స్వాధీనం చేసుకోవడం మరో రూపం. మతతత్వ రాజకీయాలు దాన్ని విభజనకు ఉపయోగించడం ఇంకో రూపం. పాలకులు ప్రజా ఉత్సవాలను తమ ప్రచార వేదికలుగా మార్చే ప్రయత్నాలు చేస్తే ప్రజల సాంస్కృతిక హక్కుల ప్రశ్న ముందుకు వస్తుంది. సంస్కృతి ప్రజల జీవితానికి ప్రతిబింబం కావాలి. అధికారానికి అలంకారంగా మారకూడదు.
పండుగల రూపాలు మారడం సహజం. గ్రామం పట్టణంగా మారుతుంది. వృత్తులు మారుతాయి. ఉపాధి కోసం వలసలు పెరుగుతాయి. కొత్త సాంకేతికత వస్తుంది. సామాజిక మాధ్యమాలు ప్రజల సంస్కృతిని వేగంగా వ్యాప్తి చేస్తాయి. ఈ మార్పులను తిరస్కరించడం పరిష్కారం కాదు. మారుతున్న పరిస్థితుల్లో ప్రజల సృజనాత్మకతను, సామూహికతను, సమానత్వాన్ని బలపరిచే మార్గాలను అన్వేషించాలి. సాంకేతికత ప్రజలకు సేవ చేయాలి. మార్కెట్‌ ఆధిపత్యానికి సాధనంగా మారకూడదు. బతుకమ్మ పూలలో ప్రకృతి కనిపించాలి. ఆ పూల వెనుక ఉన్న రైతు, కూలీ, మహిళా శ్రమ కనిపించాలి. పాటల్లో మహిళల స్వరం వినిపించాలి. దసరా ఉత్సవాల్లో సామూహికత కనిపించాలి. జానపద కళల్లో శ్రమజీవుల జీవితం ప్రతిధ్వనించాలి. పండుగ వేదికల్లో కులం, మతం, లింగం ఆధారంగా వివక్షకు స్థానం ఉండకూడదు. ప్రకృతిని నాశనం చేసే వినియోగ సంస్కృతికి ప్రత్యామ్నాయం కనిపించాలి.
ప్రజల ఆనందం ప్రజల హక్కు. పండుగల్ని జరుపుకునే హక్కు ప్రజలదే. ఆ ఆనందం వెనుక ఉన్న శ్రమను గుర్తించడం, ప్రకృతిని కాపాడటం, అప్పుల భారాన్ని తగ్గించడం, మహిళల గౌరవాన్ని నిలబెట్టడం, కుల – మత వివక్షను ఎదుర్కోవడం, కళాకారుల జీవనాన్ని గౌరవించడం ప్రజా బాధ్యత. ప్రజల సంస్కృతిని ప్రజల జీవిత విముక్తితో అనుసంధానించినప్పుడే అది ప్రత్యామ్నాయ సంస్కృతిగా ఎదుగుతుంది. ప్రజల చేతుల్లో పుట్టిన సంస్కృతి ప్రజల చేతుల్లోనే బలపడాలి. మార్కెట్‌ దాన్ని సరుకుగా మార్చకూడదు. మతతత్వం దాన్ని విభజన ఆయుధంగా మార్చకూడదు. పాలకులు దాన్ని ప్రచార వేదికగా మార్చకూడదు. ప్రజల జీవితం, శ్రమ, సమానత్వం, ప్రకృతి, స్వేచ్ఛ, లౌకికత, సోదరభావం ప్రజా సంస్కృతికి పునాదులుగా నిలవాలి. అదే ప్రజా సంస్కృతి. అదే ప్రజా ప్రత్యామ్నాయ సంస్కృతికి దారి.
– మామిండ్ల రమేష్ రాజా, 
సెల్ : 78932 30218

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *