ఎల్నినో ప్రభావంతో రాష్ట్రం తీవ్రమైన నీటి సంక్షోభంలో మునిగిపోయింది. రాష్ట్రంలో వర్షపాత లోటు 23 శాతానికి చేరుకోవడం, జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటడం ఆందోళన కలిగిస్తున్నది . సాధారణంగా ఈ సమయానికి ఉండాల్సిన 460 టీఎంసీల నీటికి బదులుగా ప్రస్తుతం కేవలం 209 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో, రాబోయే యాసంగి సీజన్లో రైతులు వరి సాగును వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దాదాపు 11.18 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లే ముప్పు పొంచి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతున్నది . అయితే, కేవలం సాగు వాయిదా వేయాలని కోరడం మాత్రమే సరిపోతుందా? దీనివల్ల నష్టపోయే అన్నదాతల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం ఇస్తున్న హామీ ఏమిటన్నదే ఇప్పుడు మిగిలి ఉన్న మిలియన్ డాలర్ల ప్రశ్న.
వరి సాగు వొద్దని కోరుతున్న ప్రభుత్వం, దానివల్ల రైతాంగానికి జరిగే ఆదాయ నష్టాన్ని ఏ మేరకు భరిస్తుందనే దానిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో, తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల దెబ్బతిన్న లేదా పంట సాగు నిలిపివేసిన రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఎకరానికి ₹10,000 చొప్పున ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ (పరిహారం) అందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం సానుకూల పరిణామం. దీనికోసం దాదాపు ₹1,118 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. తాగునీరు, ఇతర ప్రత్యామ్నాయాల కోసం కలిపి మొత్తం ₹2,170 కోట్లకు పైగా బడ్జెట్తో సమగ్ర ప్యాకేజీని ప్రభుత్వం సిద్ధంచేస్తున్నది . అలాగే, రాష్ట్రంలో సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్డీఆర్ ఎఫ్) కింద ప్రత్యేక నిధులు రాబట్టేందుకు ఒక రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు.
అయితే, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా కింది అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన కార్యాచరణను గ్రౌండ్ లెవెల్లో అమలు చేయాలి. సుమారు 73 లక్షల మంది రైతులకు అందాల్సిన ‘రైతుభరోసా’ పెట్టుబడి సాయాన్ని ఈ సంక్షోభ సమయంలో ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయాలి. భూమిని నమ్ముకుని సాగు చేసే కౌలు రైతులకు ఈ నీటి ఎద్దడి వల్ల కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ప్రతిపాదిత ఎకరానికి ₹10,000 పరిహారం కేవలం భూ యజమానులకే కాకుండా, అసలైన కౌలు రైతులకు కూడా చేరేలా పారదర్శక విధానాన్ని తీసుకురావాలి. వరి సాగు లేకపోతే లక్షలాది మంది వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోతారు. వారి వలసలను నివారించడానికి ఉపాధి హామీ పథకం కింద ప్రత్యామ్నాయ పనులను తక్షణమే విస్తరించాలి.
ఇక్కడ గుర్తించాల్సిన అంశం … ప్రభుత్వం ప్రస్తుతం పంట సాగు చేసి దెబ్బతిన్న (ఎండిపోయిన) పొలాలకు మాత్రమే నష్టపరిహారం అందించడానికి సిద్ధమవుతున్నది . యాసంగిలో వరి పంట సాగును వాయిదా వేసుకోవాలని (నిలిపివేయాలని) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినప్పటికీ, పంట వేయకుండా ఖాలీగా ఉంచినందుకు (లేదా నిలిపివేసినందుకు) ప్రత్యేకంగా పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఎల్నినో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు మాత్రమే కరువు సాయం (ఆర్థిక ప్యాకేజీ) అందించేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. సాధారణంగా విపత్తు నిర్వహణనిబంధనల ప్రకారం ప్రకృతి వైపరీత్యాలు, కరువు వల్ల చేతికొచ్చిన పంట దెబ్బతింటేనే ప్రభుత్వాలు పరిహారం చెల్లిస్తాయి. నీటి కొరత వల్ల పంట వేయకుండా పొలాన్ని ఖాలీగా ఉంచితే దానికి ప్రభుత్వం నుండి ఎలాంటి నష్టపరిహారం అందదు. ఆవిధంగా ఖాలీగా వుంచినందుకు రైతులు కోల్పోయే ఆదాయం భర్తీ ఎట్లా అనేది ప్రధాన ప్రశ్న! నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి పంటలను నియంత్రించడం తప్పనిసరి కావొచ్చు. కానీ నష్టపోయే ఆర్థిక భారాన్ని కేవలం రైతులపైనే రుద్దటం సమంజసం కాదు. సాగు చేయవొద్దు అని చెప్పే ముందు ఆదాయ భద్రతను చూపటం ప్రభుత్వ కనీస బాధ్యత. గోదావరిలో వరదనీటిని పంపిగ్ చేసినట్లయితే ఈ దుస్థితి దాపురించేది కాదని బీఆర్ఎస్ వాదిస్తున్నది . ప్రభుత్వం సాంకేతిక కారణాలు చెప్పినా, రైతులకు వరదనీరు వృధాగా పోయిందన్న మాటే నాటుకుపోతుందన్న మాట సత్యం!
మరోవైపు, రాష్ట్రంలో విద్యుత్ గరిష్ఠ డిమాండ్ 20,003 మెగావాట్లకు చేరుకున్నది . భూగర్భ జలాలు పడిపోవడంతో రైతులు మోటార్లు ఎక్కువగా వాడాల్సి రావడం దీనికి ఒక కారణం. అయితే, నీటి పొదుపు చర్యలు కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాకూడదు. రాష్ట్ర పురోగతిలో కీలకమైన ఐటీ రంగానికి చెందిన డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలు ప్రతిరోజూ మిలియన్ల లీటర్ల నీటిని వినియోగిస్తుంటాయి. సంక్షోభ సమయాల్లో నియంత్రణలు అందరికీ సమానంగా ఉండాలి. రైతులను త్యాగాలు చేయమని కోరుతున్నప్పుడు, పరిశ్రమలు , డేటా సెంటర్ల నీటి వినియోగంపై కూడా సమానమైన ఆంక్షలు లేదా నియంత్రణలు విధిస్తారా లేదా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలి.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అన్ని వర్గాలూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందే. కానీ ఆ భారం కేవలం సమాజంలో బలహీన వర్గమైన రైతాంగంపైనే పడకుండా చూడటం ప్రజాస్వామ్య ప్రభుత్వాల కనీస కర్తవ్యం. సంక్షోభాన్ని అధిగమించేందుకు తక్షణమే సమగ్ర కార్యాచరణను ప్రకటించి, అన్నదాతల్లో భరోసా నింపాలని ఆశిద్దాం.





