అడవిని కాపాడాలి.. ఆదివాసీల బతుకులనూ కాపాడాలి!

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచలునలు, సిద్ధాంతాలకు భిన్నంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ  పాలన నడుస్తున్నది. దేశ వనరులను, భూములను, అటవీ సంపదను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ లకు దోచి పెడుతుందని ..కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు, పేదలకు ముఖ్యంగా ఆదివాసులకు అండగా నిలబడుతుందని జాతీయ స్థాయిలో దశాబ్ద కాలంగా రాహుల్ గాంధీ  పోరాటం కొనసాగిస్తున్నారు. ఆదివాసీలు అడవులకు అసలైన సంరక్షకులని, భూమి, అడవి, నీటిపై వారి హక్కులను పరిరక్షించాలని పదేపదే స్పష్టం చేశారు. ఆదివాసీలను కేవలం వనవాసులుగా కాకుండా అడవులపై హక్కులున్న మూలవాసులుగా గుర్తించాలని ఆయన వాదన . మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరిస్తున్నదా? అమ్రాబాద్ పరిణామాలు ఈ ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి.

అడవి అంటే కేవలం చెట్లు, వన్యప్రాణులు మాత్రమే కాదు. తరతరాలుగా ఆ అడవినే నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీల బతుకు కూడా! ప్రకృతితో మమేకమై, అడవిని తమ జీవనాధారంగా మలుచుకున్న ఆదివాసీలను అడవి నుంచి వేరు చేయడమంటే వారి జీవన విధానాన్ని, సంస్కృతిని, అస్తిత్వాన్ని దెబ్బతీయడమే. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యం పరిధిలో తాజాగా తలెత్తిన వివాదం ఈ మౌలిక సత్యాన్ని మరోసారి గుర్తుచేస్తున్నది. వన్యప్రాణుల సంరక్షణ పేరుతో ఆదివాసీల నివాస హక్కులను ప్రశ్నార్థకం చేస్తున్న ప్రభుత్వ విధానాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

అమ్రాబాద్ అభయారణ్యం పరిధిలోని వట్వర్లపల్లి గ్రామస్థులు అక్టోబర్ 13న హైదరాబాద్–శ్రీశైలం రహదారిపై చేపట్టిన నిరసన వెనుక కేవలం పునరావాస సమస్య మాత్రమే లేదు. తమ గ్రామాన్ని ఖాలీ  చేయించేందుకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, పాఠశాల భవనం, తాగునీటి ట్యాంకు వంటి అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై అధికారుల వివరణ అవసరమే. అయితే, గ్రామస్థుల అభ్యంతరాలను పట్టించుకోకుండా పునరావాస ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం సమంజసమా అన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

పులుల సంరక్షణ అత్యంత అవసరం. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత. కానీ పులుల మనుగడ కోసం మనుషుల మనుగడనే ప్రమాదంలోకి  నెట్టడం ఏ విధమైన పర్యావరణ న్యాయం? శతాబ్దాలుగా అడవుల్లో నివసిస్తున్న ఆదివాసీలను ప్రకృతికి శత్రువులుగా చిత్రీకరించడం చారిత్రక అన్యాయం. అడవుల విధ్వంసానికి ప్రధాన కారణాలైన వాణిజ్య ప్రయోజనాలు, అక్రమ కలప రవాణా, గనుల తవ్వకాలు, భారీ నిర్మాణాలపై చూపని కఠినత్వాన్ని నిరుపేద ఆదివాసీలపై చూపడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం కాదా?

భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల పరిపాలనకు ప్రత్యేక రక్షణలను కల్పిస్తున్నది. అటవీ హక్కుల చట్టం–2006 ఆదివాసీలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసితుల వ్యక్తిగత, సామూహిక హక్కులను గుర్తిస్తున్నది. ముఖ్యంగా అటవీ హక్కుల గుర్తింపు, పునరావాసానికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి కాకుండా ప్రజలను వారి నివాసాల నుంచి తొలగించరాదనే రక్షణలు ఉన్నాయి. వన్యప్రాణుల సంరక్షణ కోసం పునరావాసం అవసరమైన సందర్భాల్లో కూడా శాస్త్రీయ ఆధారాలు, ప్రత్యామ్నాయాల పరిశీలన, గ్రామసభల పాత్ర, బాధితుల సమ్మతి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ఇక్కడ అసలు ప్రశ్న పునరావాసం అవసరమా, కాదా అన్నది మాత్రమే కాదు. అది ఎవరి ప్రయోజనం కోసం, ఎవరి సమ్మతితో, ఏ విధంగా జరుగు తున్నదన్నది. తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూములను, నివాసాలను, అడవితో పెనవేసుకున్న జీవనోపాధిని వొదులుకోవడం ఆదివాసీలకు సాధారణ విషయం కాదు. కేవలం నగదు పరిహారం అందించినంత మాత్రాన వారి జీవితాలకు భద్రత కల్పించినట్లు కాదు. పునరావాస ప్రాంతంలో సాగుభూమి, నీరు, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక సంబంధాల పరిరక్షణకు స్పష్టమైన హామీలు అవసరం.

ముఖ్యంగా పునరావాసానికి అంగీకరించని గ్రామాలకు మౌలిక సదుపాయాలను నిరాకరిస్తున్నారనే ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. తాగునీరు, విద్య వంటి కనీస అవసరాలను పునరావాసానికి అంగీకారంతో ముడిపెట్టడం జరిగితే అది పరోక్ష బలవంతమే అవుతుంది. ప్రజల సంక్షేమాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే వారి నిస్సహాయతను ఒత్తిడి సాధనంగా ఉపయోగించకూడదు. ఈ ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపించి వాస్తవాలను బహిర్గతం చేయాలి.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, సహజ వనరులపై స్థానిక ప్రజల అధికారానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ ఆకాంక్షలకు  అనుగుణంగా పాలన సాగాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వం పై ఉంది. ఆదివాసీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, వారి జీవనాధారాలను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటే అది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికే విరుద్ధం. ప్రభుత్వం తక్షణమే అమ్రాబాద్ పరిధిలోని ప్రభావిత గ్రామాల ప్రతినిధులు, ఆదివాసీ సంఘాలు, పర్యావరణ నిపుణులు, అటవీ అధికారులతో బహిరంగ చర్చలు నిర్వహించాలి. గ్రామసభల తీర్మానాలు, గుర్తించిన అటవీ హక్కులు, పునరావాస ప్రణాళికలు, పరిహార వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. పునరావాసం నిజంగా అనివార్యమని నిర్ధారణ అయితే, చట్టబద్ధమైన ప్రక్రియలో ప్రజల సమ్మతితోనే ముందుకు సాగాలి.

అడవిని కాపాడడమంటే అక్కడి ప్రజలను తరిమేయడం కాదు. ప్రకృతితో వారి సహజీవనాన్ని గౌరవిస్తూ జీవవైవిధ్యాన్ని పరిరక్షించే మార్గాలను అన్వేషించడం. పులుల సంరక్షణ, ఆదివాసీల హక్కుల పరిరక్షణ రెండూ ప్రభుత్వ బాధ్యతలే. ఒకదాని కోసం మరొకదాన్ని బలిపెట్టే విధానం ప్రజాస్వామ్య పాలనకు తగదు. అడవి బతకాలంటే ఆదివాసీ బతకాలి. ఆదివాసీ బతకాలంటే అడవిపై అతని హక్కు నిలవాలి. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పేరుతో బలహీనవర్గాల బతుకులను బలిపెట్టే విధానాలకు స్వస్తి పలకాలి. అదే నిజమైన ప్రజా పాలన, పర్యావరణ న్యాయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *