– విదేశీ ప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 14 : తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటే రాయబారులుగా నిలవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి విదేశీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో రెండు రోజులపాటు జరిగిన ‘భారత్ సమ్మిట్ 2026’ ముగింపు సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. ఆర్థిక వృద్ధికి విస్తృత అవకాశాలున్న తెలంగాణ దేశంలో పెట్టుబడులకు అత్యంత ఆశాజనకమైన రాష్ట్రాల్లో ఒకటని అన్నారు. ఆవిష్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు రాష్ట్రం ప్రధాన కేంద్రంగా ఎదిగిందన్నారు. తమకున్న అంతర్జాతీయ పరిచయాలను ఉపయోగించి ఆయా దేశాల పెట్టుబడిదారులు, సంస్థలు, వ్యాపార వర్గాలను తెలంగాణతో అనుసంధానించాలని కోరారు. తెలంగాణలో వారు పొందిన అనుభవం రాష్ట్రంపై అంతర్జాతీయ ఆసక్తిని పెంచి, పెట్టుబడులు, దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు దారితీయాలని ఆకాంక్షించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి సదస్సుకు వచ్చిన ప్రతినిధులు, వక్తలు, పాల్గొన్న వారందరి భాగస్వామ్యంతో సదస్సుకు సార్థకత చేకూరిందని, ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, కొత్తగా అందివస్తున్న అవకాశాలపై మరింత లోతుగా చర్చలు సాగాయని చెప్పారు.\
మారుతున్న ప్రపంచంలో భారత్ పాత్రపై చర్చ
మారుతున్న ప్రపంచ వ్యవస్థను, అందులో భారత్ స్థానాన్ని పరిశీలించేందుకు ఈ సదస్సు వేదికగా నిలిచిందని ఉత్తమ్ అన్నారు. కృత్రిమ మేధ, క్లౌడ్ క్యాపిటలిజం, మరింత న్యాయబద్ధమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అవసరం, భవిష్యత్ రాజకీయాల్లో యువత పాత్ర, గ్లోబల్ సౌత్ దేశాల పరస్పర సహకారం, వాతావరణ మార్పులు, బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు, లింగ న్యాయం వంటి అంశాలపై చర్చలు జరిగాయన్నారు.‘ఫోర్జింగ్ ఎ న్యూ వరల్డ్’ (నూతన ప్రపంచ నిర్మాణం) అనే సదస్సు ఇతివృత్తం ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న కీలక మార్పులను అర్థం చేసుకొని వాటిపై జరిగే చర్చల్లో భాగస్వాములు కావాలన్న పిలుపునిస్తోందని మంత్రి చెప్పారు. భిన్న అనుభవాలు, దృక్పథాలు ఒక వేదికపైకి రావడంతో ప్రజాస్వామ్యం, న్యాయం, అంతర్జాతీయ సహకారంపై లోతైన చర్చకు ఆస్కారం ఏర్పడిందన్నారు. డిజిటల్ శక్తి సమాజాలను ఎలా మారుస్తోందో ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తోందో సాంకేతికత, నూతన ప్రపంచ వ్యవస్థపై జరిగిన సమావేశాల్లో పరిశీలించారని తెలిపారు. ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, సంక్షేమంపై జరిగిన చర్చల్లో ప్రజలకు లభించే అవకాశాలు, వారి గౌరవం, శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. యువత, లింగ న్యాయం, మీడియా, ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై జరిగిన చర్చల్లో ప్రజాస్వామ్య సంస్థలు, ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించిన కీలక ప్రశ్నలు ప్రస్తావనకు వచ్చాయని చెప్పారు.
రాహుల్ గాంధీ రాకతో సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యం
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పాల్గొనడంతో సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ స్వరానికీ, దేశం తీసుకునే నిర్ణయాలకూ ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో ప్రజల ఆకాంక్షలను ప్రపంచంలో భారత్ పోషించాల్సిన పాత్రతో ముడిపెట్టి చూడగల రాహుల్ గాంధీ దృక్పథానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. ఆయన నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసిన మంత్రి రాబోయే సంవత్సరాల్లో దేశానికి నాయకత్వం వహించేందుకు అవసరమైన లక్షణాలు ఆయనలో ఉన్నాయని దేశంలో చాలామంది భావిస్తున్నారని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





