– నక్సలిజం, ఉగ్రవాద నియంత్రణలో కీలక పాత్ర
– గ్రేహౌండ్స్ లో షూటింగ్ హౌస్ ప్రారంభం
– ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీల్లో ప్రథమ స్థానం సాధించాలి
– డీజీపీ ఆనంద్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : రాష్ట్ర గ్రేహౌండ్స్ దేశ పోలీసు వ్యవస్థకే ఆదర్శంగా నిలుస్తోందని డీజీపీ సి.వి.ఆనంద్ కొనియాడారు. నక్సలిజం, ఉగ్రవాదం, హైజాకింగ్ వంటి ముప్పులను ఎదుర్కోవడంలో రాష్ట్ర అంతర్గత భద్రతతోపాటు దేశ భద్రతలోనూ గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ గ్రేహౌండ్స్ తరహా ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశారన్నారు. రాజేంద్రనగర్ లో గ్రేహౌండ్స్ షూటింగ్ హౌస్‌ను శనివారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1980 కాలంలో నక్సల్స్ కార్యకలాపాలు, ఉగ్రవాద ముప్పులను సమర్థంగా ఎదుర్కోవడంలో గ్రేహౌండ్స్ విశేష పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఇటీవల అక్టోబరు 31న గుజరాత్‌లోని కెవాడియాలో నిర్వహించిన జాతీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో తెలంగాణ గ్రేహౌండ్స్ ప్రదర్శించిన కవాతు అందరినీ ఆకట్టుకుందని, మన్ననలు పొందిందని తెలిపారు. గ్రేహౌండ్స్ సిబ్బంది మెరుగైన శిక్షణ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. గ్రేహౌండ్స్ సిబ్బంది సంఖ్య కనీసం 700 మందికి తగ్గకుండా ఉంటుందన్నారు. కర్రెగుట్టలు ప్రాంతాల్లో సాధనతోపాటు అటవీ ప్రాంతాల్లో జంగిల్ ప్రాక్టీస్, వార్‌ఫేర్ శిక్షణను నిరంతరం కొనసాగించాలన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 2027 ఫిబ్రవరి 2 నుంచి జరగనున్న ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీల్లో రాష్ట్ర గ్రేహౌండ్స్ బృందం ప్రథమ బహుమతి సాధించాలని ఆకాంక్షించారు. శిక్షణ, షూటింగ్‌లో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించారు. ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో రాణించి జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసుల కీర్తిని ఇనుమడింపజేయాలని సూచించారు.
కఠినమైన శిక్షణ.
డీజీ ఆపరేషన్స్ డాక్టర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ.సిబ్బందికి పూర్తి అంకితభావంతో శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. శారీరక దృఢత్వం, బ్రీఫింగ్, ఫైరింగ్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రెండేళ్ల క్రితం జరిగిన ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీల్లో నాలుగో స్థానం సాధించామని డీజీపీకి ఆయన వివరించారు.
నాలుగు సూత్రాలే కీలకం
సందీప్, పవన్, శ్రీధర్ అమర వీరుల త్యాగాల స్మృతికి ఎస్పీఎస్ ఊడా షూట్ హౌస్ అని నామకరణం చేశారు. Observe (పరిశీలన), Orient (పరిస్థితులకు అనుగుణంగా సిద్ధం కావడం), Decide (నిర్ణయం తీసుకోవడం), Act (చర్య చేపట్టడం) అనే నాలుగు సూత్రాలు కమాండోల విధి నిర్వహణలో కీలకమని వివరించేలా దీనిని రూపొందించారు. క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా పరిస్థితులను అంచనా వేసి, సరైన నిర్ణయం తీసుకుని చర్యలు చేపట్టే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే దీని ఉద్దేశం. కార్యక్రమంలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల అధిపతి డాక్టర్ అనిల్‌కుమార్, రాజేంద్ర నగర్డీ సీపీ శ్రీనివాస్, ఏఎస్పీ ఫాతిమా, గ్రూప్ కమాండర్లు ఎండీ అష్ఫాక్, వెంకటేశ్వర్లు, స్క్వాడ్రన్ కమాండర్ రాజు, క్యాంపు కమాండెంట్ విద్యాసాగర్, కమ్యూనికేషన్ డీఎస్పీ సలీం, అసిస్టెంట్ కమాండెంట్ ఎండీ షరీఫ్ బెగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





