– ప్రజలకు క్రీడల శాఖ మంత్రి వాకిటి పిలుపు
– ‘ఖేలో తెలంగాణ’ కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30: పౌరుల్లో ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడల శాఖ, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జీ) ఆధ్వర్యంలో ఖేలో తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పౌరులు తమ దైనందిన జీవితంలో శారీరక వ్యాయామాన్ని అంతర్భాగంగా చేసుకోవడాన్ని ప్రోత్సహించడం ద్వారా తెలంగాణను ఆరోగ్యవంతమైన, చురుకైన, ఉత్సాహభరితమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం లక్ష్యం. నడక, పరుగు, యోగా, క్రీడలు, ఇతర ఫిట్నెస్ కార్యకలాపాల్లో ప్రజలు క్రమం తప్పకుండా పాల్గొనాలని ఈ ప్రచారం ప్రోత్సహిస్తోంది. ప్రజలందరూ ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయించాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎల్బీ స్టేడియంలో బుధవారం జరిగిన ‘ఖేలో తెలంగాణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజారోగ్యమే అభివృద్ధి చెందిన, సుసంపన్నమైన తెలంగాణకు పునాది అని పేర్కొన్నారు. ఫిట్నెస్ను జీవితాంతం అలవాటుగా చేసుకోవాలని పౌరులను కోరారు. విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, వృద్ధులు, అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొని తమ కుటుంబాలు, సమాజాన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించేలా ప్రేరేపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
సీఎంకు ఖేలో తెలంగాణ బంధన్ ఛాలెంజ్
ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, శాట్జీ చైర్మన్ కె.శివసేన రెడ్డి, వైస్ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ.సోనిబాలా దేవి, డీజీపీ సి.వి.ఆనంద్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, పారా అథ్లెట్ దీప్తి జీవాంజి, షూటర్ ఈషా సింగ్ తదితర ప్రముఖులకు మంత్రి ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరారు. పాల్గొనేవారు మరో తొమ్మిదిమందిని నామినేట్ చేయాలని ప్రోత్సహించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యం, ఫిట్నెస్ సందేశాన్ని విస్తృతం చేయవచ్చని తెలిపారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు, పౌరులు తమ ఫిట్నెస్ కార్యకలాపాలను ప్రదర్శించే 27 సెకన్ల వీడియో రీల్ రూపొందించి మరో తొమ్మిది మందిని ఈ ఉద్యమంలో చేర్చాలని సవాలు చేయాలని కోరారు. ఫిట్నెస్ అవగాహనను సమర్థవంతంగా పెంపొందించే ఉత్తమ వీడియోలను స్పోర్ట్స్ అథారిటీ గుర్తించి ప్రోత్సహిస్తుంది. స్వామి వివేకానంద ప్రేరణాత్మక సందేశమైన ‘లేచి నిలబడండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి’ అని ఉటంకిస్తూ ప్రతి ఇల్లు, గ్రామం, పట్టణం ‘జాగో తెలంగాణ -భాగో తెలంగాణ -ఖేలో తెలంగాణ’ స్ఫూర్తిని స్వీకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ కుమార్, పీఆర్వో కాలేరు సురేష్, గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్ కన్నం మధు, కోచ్లు, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





