– మీ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
– కరీంనగర్‌లో కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభం
కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : పేదలకు సంక్షేమ పథకాలు చేరవేసే ప్రతినిధులు ప్రభుత్వోద్యోగులే అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో బుధవారం పర్యటించిన ముఖ్యమంత్రి కరీంనగర్ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉద్యోగులే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతినిధులని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేది అధికారులే అని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగుల సమస్యలను మీ సహకారంతో ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని, మనం ప్రజలకు సేవలు అందిస్తూనే సమస్యలను పరిష్కరించుకుందామని సీఎం చెప్పారు. అప్పుడే ప్రజలకు మనపై విశ్వాసం బలపడుతుందన్నారు. మీరంతా కష్టపడితేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రికైనా, ప్రధానమంత్రికైనా మంచి పేరు రావాలంటే ఉద్యోగుల సహకారంతోనే సాధ్యమని అన్నారు. ప్రజలకు సేవలు అందించే మీకు మౌలిక వసతులు కల్పించాలనే ఈ భవన సముదాయ నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం కోసం రూ.944 కోట్లతో పనులను ప్రారంభించుకున్నామని తెలిపారు. అందరి సహకారంతోనే ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. పేదల సమస్యల చిక్కుముడులు విప్పడానికి ఈ కార్యాలయం ఉపయోగపడాలన్నారు. సహాయం కోసం నిస్సహాయంగా వచ్చే వారిలో మన కుటుంబ సభ్యులను చూడండి.. అప్పుడే సహాయం వారికి నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుందని, సమస్యలతో వచ్చిన పేదలకు వెంటనే పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మించినా కేంద్రం అనుమతులు ఇవ్వకపోతే ప్రయోజనం ఉండదన్నారు. కొందరు తమ దిల్లీ పర్యటనలను లెక్కలేస్తున్నారు.. సమస్యలు పరిష్కరించుకునేందుకు ఎన్నిసార్లైనా కేంద్రాన్ని కలవాల్సిందేనని, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరు నెలల్లోనే 170 ఎకరాలు డిఫెన్స్ భూములను రాష్ట్ర అభివృద్ధి కోసం బదలాయించేలా చేశామని, బేగంపేట రన్ వే కింద నుంచి రోడ్డు వేసుకునేందుకు అనుమతులు సాధించామని, సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధి కోసం ఒకరికొకరం సహకరించుకుంటాం అని స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను ముందు కార్యక్రమాలను ఎన్నికల సమయంలోనే రాజకీయం చేయాలన్నారు. ఎన్నికలు లేని సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 
కరీంనగర్ జిల్లాలో రూ.944 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించామని, మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.840 కోట్ల నిధులు సాధించామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తే ముఖ్యమంత్రిగా అభినందించడంలో ఎలాంటి శషభిషలు లేవన్నారు. మరోసారి ఇక్కడికి వచ్చి జిల్లా అభివృద్ధిపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తానన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అక్కడినుంచే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





