– జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని రద్దు చేయండి
– ఆ విద్యుత్తును తెలంగాణ అవసరాలకు వాడాలి
– సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు బహిరంగ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : మంచిర్యాల (జైపూర్) సింగరేణి విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్తును రాజస్థాన్‌కు తరలించే జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకుని ఆ విద్యుత్‌ను వంద శాతం తెలంగాణ అవసరాలకే వినియోగించాలని బీఆర్‌ఎస్ నేత టి.హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎంకు బహిరంగ లేఖ రాశారు. ఒకవైపు కరెంటు లేక పంటలు కళ్లెదుటే ఎండిపోతుంటే మరోవైపు మన రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు ధారాదత్తం చేసేందుకు మీరు సిద్ధపడటం ప్రజా వ్యతిరేక చర్య కాక మరేమిటని ప్రశ్నించారు. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు కావాల్సిన బొగ్గు మన సింగరేణి గనుల్లోనే ఉందని, నడపడానికి కావాల్సిన నీళ్లు పక్కన ఉన్న గోదావరి నుంచే పుష్కలంగా అందుతాయని తెలిపారు. బొగ్గు, నీళ్లు, స్థలం మనవి.. అలాంటప్పుడు ఇక్కడ కొత్తగా చేపడుతున్న విస్తరణలో 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌కు కట్టబెట్టేలా జాయింట్ వెంచర్ ఒప్పందం చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అని నిలదీశారు. మన బొగ్గు, మన నీళ్లు, మన ప్రాంతంలో తయారయ్యే కరెంటుపై హక్కు తెలంగాణదే కదా అని అన్నారు. సింగరేణి సంస్థ రాజస్థాన్‌కు చెందిన ఆర్‌ఆర్‌వీయూఎన్‌ఎల్ విద్యుత్ సంస్థతో ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొత్తగా నిర్మించే థర్మల్ విద్యుత్‌లో 800 మెగావాట్లు రాజస్థాన్‌కు కేటాయిస్తారని, అంతేకాక రాజస్థాన్‌లో 1500 మెగావాట్ల భారీ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధపడతారని, ఇది దాదాపు రూ.22,000 కోట్ల భారీ ప్రాజెక్టు అని తెలిపారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి.. అలాంటి సింగరేణి విద్యుత్‌ను, పెట్టుబడిని రాజస్థాన్ అభివృద్ధికి ఎందుకు మళ్లించాలి అని ప్రశ్నించారు. మన రాష్ట్రమే కరెంటు లేక అల్లాడుతున్న వేళ ఈ తొందరపాటు నిర్ణయం ఎందుకు అని అడిగారు. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ లోటును అధిగమించేందుకు కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మిస్తే అందులో ఉత్పత్తయ్యే విద్యుత్తును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సరిగ్గా అందించలేకపోతోందని ఎద్దేవా చేశారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కనీసం 7-8 గంటలు కూడా ఇవ్వలేకపోతున్నారన్నారు. ఈ పవర్ హాలిడేలతో రైతులు కన్నీరు పెడుతుంటే పాలనా వైఫల్యాన్ని ఎల్‌నినో మీదకు నెట్టి తప్పించుకోవాలని చూడటం సరికాదన్నారు. మీ నిర్వహణ లోపం వల్లే నేడు రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలు కునారిల్లుతున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం నిర్మించిన 4000 మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ ప్లాంటులో నేడు విద్యుత్ ఉత్పత్తి సగానికి పడిపోయిందని, దానికి జీ10, జీ11 నాణ్యత గల బొగ్గు వాడాల్సి ఉండగా నాసిరకమైన జీ13, జీ14 బొగ్గును వాడి బాయిలర్లు దెబ్బతినేలా చేస్తున్నారని ఆ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు కొరతతో కొత్తగూడెంలో 800 మెగావాట్లు, భద్రాద్రిలో 540 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని, నిబంధనల ప్రకారం థర్మల్ కేంద్రాల్లో 45 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉండగా కనీస ఉత్పత్తి ఉంచకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెబుతున్న మీరు విద్యుత్ కేంద్రాల వద్ద ఎందుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అడిగారు. ఈ వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిలదీసేందుకు బీఆర్‌ఎస్ పార్టీ వెళ్తే పోలీసులను పెట్టి అడ్డుకోవడం మీ నియంతృత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో ఎన్‌టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, 1600 మెగావాట్లు రాష్ట్రానికి ఇస్తామంటే మీ ప్రభుత్వం తిరస్కరించిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి ఎలాంటి అదనపు భారం లేకుండా వచ్చే ఈ విద్యుత్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు అని ఎందుకు చెప్పిందన్నారు. రాజస్థాన్‌తో చేసుకున్న విద్యుత్ జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలి. జైపూర్‌లో ఉత్పత్తయ్యే 800 మెగావాట్ల విద్యుత్‌ను వంద శాతం తెలంగాణే వినియోగించుకునేలా రాష్ట్ర డిస్కంలతోనే అగ్రిమెంట్ చేసుకోవాలి. యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం కేంద్రాల్లో బొగ్గు కొరత లేకుండా పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర విభజన హామీ ప్రకారం ఎన్టీపీసీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ కోసం తక్షణమే పీపీఏ ఒప్పందం చేసుకొని రాష్ట్రంలోని రైతులు, ప్రజల కరెంటు కష్టాలను తీర్చాలి. ఈ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రాజస్థాన్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని,. లేనిపక్షంలో రైతులు, ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతుందని హరీష్‌రావు హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





