రోడ్డు ప్రమాదం లో ఏడుగురు మృతి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 16:
మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు  వ్యక్తులు మృతి చెందారు. వివరాలు ఇలా వున్నాయి. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని ఉసిరిక పల్లి చౌరస్తాలో కారు బోల్తా పడిన ఘటనలో ఏడుగురు వ్యక్తులు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన భీమ్లా తండాకు చెందినవారు ఈ ప్రమాదంలో మరణించారు. శాంతి (38), అమ్ము (12) సీతారాం తాండ, అనిత (35), హిందూ (13), శ్రావణి(12), తలపల్లి తండా, శివరాం (56), దుర్గి (45), డ్రెవర్ నంసింగ్ ఒక్కడే బతికి ఉన్నాడు. కాలు విరిగింది. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మండల పరిధిలోని భీమ్లా తండాకు చెందిన కుటుంబ సభ్యులు తూప్రాన్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కారు రోడ్డు పక్కనే ఉన్న నీటి కాలువలోకి  దూసుకెళ్లడంతో కారు బోల్తా పడింది. కారులోని చిన్నారులతో పాటు కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు .ఈ ఘటనతో ఒక్కసారిగా మండల వ్యాప్తంగా విషాద ఛాయలవలముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులతో పాటు ఆయా శాఖల అధికారులు స్థానికులు ఘటన స్థలానికి వెళ్లి రక్షించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కుటుంబం మొత్తం మృత్యువాత పడింది. ఘటనపై శివంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి..తక్షణ చర్యలకు ఆదేశాలు 
మెదక్ జిల్లా శివంపేట మండలం లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అధికారుల తో మాట్లాడి జరిగిన ప్రమాదం పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య చికిత్స తో పాటు, అవసరమైన సాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
 మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి   
మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో పాముబండ తండాకు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారికి తక్షణం వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *