– ప్రతి చిన్నారి రక్షణ సమాజ సమష్టి బాధ్యత
– మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
– బాలల దినోత్సవం సందర్భంగా బాలల సంక్షేమం, సంరక్షణకు పలు కార్యక్రమాలు ప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: బాలలే దేశ భవిష్యత్తు అని నెహ్రూ విశ్వసించేవారని, బాలల దినోత్సవం సందర్భంగా ప్రతి చిన్నారి ప్రాధాన్యతను గుర్తించి దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను గుర్తు చేసుకోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవ వేడుకలను మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ప్రభుత్వం శనివారం ఘనంగా నిర్వహించింది. ముఖ్య అతిధులుగా మంత్రి సీతక్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరై చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ చేసిన త్యాగాలను గుర్తు చేశారు. అనంతరం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, నెహ్రూ దేశ రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ బాలల సంక్షేమం, రక్షణ కోసం పలు కీలక కార్యక్రమాలను చేపడుతోందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం చైల్డ్ హెల్ప్ డెస్క్‌లు, చట్టబద్ధమైన దత్తత సేవల విస్తరణ వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. ప్రతి అధికారి, అంగన్వాడీ టీచర్, ఆయా, శాఖ ఉద్యోగి బాలల రక్షణను తమ ప్రధాన బాధ్యతగా భావించాలని సూచించారు. పిల్లల పోషకాహారం, ఆరోగ్యం, భద్రత, విద్య వంటి ప్రతి అంశంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. చిన్నారులకు సహజసిద్ధమైన, పోషక విలువలున్న ఆహారాన్ని అందించడం ఎంతో ముఖ్యమని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై తల్లిదండ్రులకు అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పించాలని సూచించారు. బాల్య వివాహాల నివారణపై మాట్లాడుతూ ఈ దురాచారాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా బాలిక వివాహం బతుకు ఆగం అనే నినాదంతో రూపొందించిన ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన అంగన్వాడీ కేంద్రాలను గుర్తించి అవార్డులు అందించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, సంచాలకులకు మంత్రి సూచించారు. చిన్నారులతో మంత్రి ముచ్చటిస్తూ ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో, ధైర్యంగా ఉండాలని సూచించారు. అనాథాశ్రమాలు, ఇతర బాలల సంరక్షణ సంస్థల్లో ఉంటున్న పిల్లల సమస్యల పరిష్కారానికి శాఖ తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. అర్హులైన చిన్నారులకు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు అందించేందుకు వేలాది గుర్తింపు కార్డులు, దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు రూపొందించి జారీ చేసినట్లు పేర్కొన్నారు.శాఖ పరిధిలోని అనాథాశ్రమాలు, బాల సదనాలు, శిశు విహారాలు సహా ప్రతి సంరక్షణ సంస్థలో అత్యుత్తమ వసతులు, నాణ్యమైన సేవలు, పిల్లల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అవకాశాలు కల్పించాలని ఆదేశించారు.
ప్రతి చిన్నారికి ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆకాంక్షిస్తూ పిల్లలు ప్రేమ, భద్రత, ఆప్యాయతతో కూడిన వాతావరణంలో ఎదిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను సత్కరించారు. బాల్య వివాహాల నివారణకు నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని సంతకం చేశారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా బాలల రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, సాంకేతిక పరిజ్ఞానంతో సేవల నాణ్యత పెంపొందించడం, సంస్థాగత సంరక్షణ సదుపాయాలను విస్తరించడం లక్ష్యంగా పలు కార్యక్రమాలను మంత్రి సీతక్క వర్చువల్‌గా ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహార ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు అంగన్వాడీ సేవల్లో సామర్థ్యం, పారదర్శకత, కచ్చితత్వాన్ని పెంపొందించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతిక పరిష్కారాలను ప్రవేశపెట్టింది. అనాథలు, వదిలివేయబడిన, నిరాశ్రయులైన చిన్నారులకు కుటుంబ ఆధారిత సంరక్షణ, రక్షణ కల్పించే లక్ష్యంతో కామారెడ్డి, మెదక్, వనపర్తి, సూర్యాపేట, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కొత్తగా ఆరు ప్రత్యేక దత్తత సంస్థలను ప్రారంభించారు. ప్రతి కేంద్రంలో గరిష్ఠంగా 10 మంది చిన్నారులకు సంరక్షణ కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కోఆర్డినేటర్, సోషల్ వర్కర్, ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్, నర్సు, వైద్యుడు, ఆరుగురు ఆయాలతో కలిపి మొత్తం 11 మంది సిబ్బందిని నియమించనున్నారు. ఆపదలో ఉన్న చిన్నారులను గుర్తించి తక్షణ సహాయం, రక్షణ కల్పించేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ప్రధాన బస్టాండ్లలో నాలుగు చైల్డ్ హెల్ప్ డెస్క్‌లను ప్రారంభిస్తున్నారు. మిషన్ వాత్సల్య పరిధిలో పనిచేస్తున్న చైల్డ్ హెల్ప్‌లైన్ 1098ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ 112తో అనుసంధానించారు. దీనివల్ల నిరంతర సహాయం, సమన్వయంతో కూడిన అత్యవసర స్పందనకు అవకాశం కలుగుతుంది. బాలల సంరక్షణ సంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా హైదరాబాద్ జిల్లాలో బాలల సంరక్షణ గృహం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. సూర్యాపేట జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలల సంరక్షణ గృహాన్ని ప్రారంభించారు.
చిన్నారుల హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత 
మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రుతి ఓజా మాట్లాడుతూ ప్రతి చిన్నారి భద్రత, ఆరోగ్యం, విద్య, హక్కులు, అభివృద్ధి అవకాశాలను పరిరక్షించడం సమాజంలోని ప్రతి ఒక్కరి సమష్టి బాధ్యత అని పేర్కొన్నారు. మిషన్ వాత్సల్య, పోషణ్ అభియాన్ కార్యక్రమాల ద్వారా చిన్నారులకు సురక్షితమైన, సహాయక వాతావరణం కల్పించడంతోపాటు అవసరమైన సమయంలో తక్షణ సహాయం, రక్షణ అందించేందుకు శాఖ కృషి చేస్తోందని వివరించారు. చిన్నారులు విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, క్రీడలు, ఇతర పాఠ్యేతర కార్యక్రమాల ద్వారా శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైనా లేదా అభద్రతకు గురైనా సహాయం కోరేందుకు వెనుకాడకూడదని, ఉపాధ్యాయులు, వార్డెన్లు, నమ్మకమైన పెద్దలను సంప్రదించాలని తెలిపారు. అవసరమైతే 24 గంటల పాటు సేవలందించే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు సంగీత సత్యనారాయణ, జాయింట్ డైరెక్టర్లు అక్కేశ్వర్ రావు, మోతి, జిల్లా సంక్షేమ అధికారి రాజేందర్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చందన, వందన, ప్రేమలత, సరిత, సీడీపీవోలు, అంగన్వాడీ సిబ్బంది, బాలల సంరక్షణ సంస్థలు, బాలల గృహాల ప్రతినిధులు, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





