నిజమైన ఫాసిస్ట్ పార్టీ కాంగ్రెస్సే

– ఎమర్జెన్సీ చీకటి రోజులను దేశం ఇంకా మరచిపోలేదు
– వంద ఎన్నికల్లో ఓటమితో ‘డిఫీట్ సెంచరీ’ చేసిన రాహుల్
– హైదరాబాద్లో జరిగింది పక్కా భారత వ్యతిరేక సమ్మిట్
– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: దేశ చరిత్రలో అసలైన ఫాసిస్ట్, నియంతృత్వ పార్టీ కాంగ్రెస్సేనని, 18 నెలల ఎమర్జెన్సీ కాలంలో పత్రికా స్వేచ్ఛను కాలరాసి, ప్రజల ప్రాథమిక హక్కులను అణచివేసి, జయప్రకాష్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్ వంటి లక్షలాది మందిని చీకటి జైళ్లలో బంధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కిషన్ రెడ్డి  గుర్తు చేశారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ ప్రభుత్వం అని విమర్శించిన రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుండటాన్ని ఎద్దేవా చేశారు. ఒకవైపు రాహుల్ గాంధీ వేదికపై నిలబడి ‘భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, ఎన్నికలు ఫ్రాడ్, దేశం ఫాసిస్టుల చేతిలో ఉంది’ అని విదేశీయుల ముందు ఉపన్యాసాలు ఇస్తుంటే.. ఫాసిస్టుల పాలనలో ఉన్న దేశానికి విదేశీ పెట్టుబడులు ఎలా వస్తాయో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని నిలదీశారు. రేవంత్ రెడ్డి ఇస్తున్న ప్రకటనలకు, సదస్సుకు పిలిచిన వ్యక్తులకు, రాహుల్ గాంధీ ప్రసంగాలకు కనీసం ఒక్క శాతం కూడా సంబంధం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు బహుళజాతి కంపెనీలు, డేటా సెంటర్లు, పెట్టుబడులు వస్తున్నాయంటే అది రేవంత్ రెడ్డినో, డి.కె. శివకుమార్‌నో, రాహుల్ గాంధీనో చూసి కాదని.. గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ స్ఫూర్తి, నేడు కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వ సుపరిపాలన, అనుకూల వాతావరణం వల్లేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల పన్నుల సొమ్మును దుర్వినియోగం చేసి, విదేశీయులకు ఫస్ట్ క్లాస్ విమాన టికెట్లు ఇచ్చి, స్టార్ హోటళ్లలో పెట్టి మేపి నిర్వహించిన ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఒరిగిందేంటో రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.హైదరాబాద్ వేదికగా జరిగింది ‘భారత్ సమ్మిట్’ కాదని, అది ముమ్మాటికీ ‘భారత వ్యతిరేక సమ్మిట్’ అని ఆరోపించారు. వంద ఎన్నికల్లో ఓడిపోయి ‘డిఫీట్ సెంచరీ’ కొట్టిన రాహుల్ గాంధీ.. పిట్టల దొరలాగా మాట్లాడుతూ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలన్నీ ఫ్రాడ్ అని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. పన్నెండేళ్లుగా మోదీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు రావడం లేదని ఆశ్చర్యపోతూ ఈవీఎంలు, ఎన్నికల కమిషన్, హైకోర్టు, సుప్రీంకోర్టు, భారత సైన్యం, లోక్‌సభ, రాజ్యసభ, చివరకు దేశ భద్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్న జాతీయ భద్రతా సలహాదారుపై కూడా విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉగ్రవాదులు, తీవ్రవాదులు, నక్సలైట్లతో అంటకాగిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని.ఛత్తీస్‌గఢ్‌లో ఒకేసారి 74 మంది జవాన్లను నక్సలైట్లు పొట్టనపెట్టుకుంటే కనీసం సంతాపం కూడా తెలపకుండా, తుపాకీ రాజ్యం కావాలనే వారికి లిప్ సింపతీ చూపిన చరిత్ర రాహుల్ గాంధీదని విమర్శించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశంలో మతకలహాలు, బాంబు పేలుళ్లు, వేర్పాటువాదం, రాళ్ల దాడులు లేకుండా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశామని గుర్తుచేశారు. విదేశీయుల వీసాల రద్దుపై కాంగ్రెస్ చేస్తున్న రాద్ధాంతాన్ని తిప్పికొట్టారు. జర్మనీ నుంచి భారత ప్రధానిని, దేశ ప్రజాస్వామ్యాన్ని అవమానించే వ్యక్తులకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికే కుసంస్కారం బీజేపీ ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు. దేశ విభజన సమయంలో లక్షలాది మంది హిందువుల ఊచకోత జరుగుతున్నా పట్టించుకోకుండా పదవుల కోసం పాకులాడిన నెహ్రూ కుటుంబ పాపం నేటికీ దేశాన్ని పట్టి పీడిస్తోందని, జకీర్ నాయక్ వంటి మత విద్వేషకులకు వీసాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు. తాను మోదీకి బానిస అని రేవంత్ రెడ్డి విమర్శించడంపై స్పందిస్తూ ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రులందరూ కలిసి పనిచేయడం రాజ్యాంగబద్ధమైన సంప్రదాయమని, రేవంత్ లాగా వారానికోసారి సూట్‌కేసులు మోసుకుంటూ ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానానికి కప్పం కట్టే సంస్కృతి తమది కాదని బదులిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *