ప్రజాస్వామ్య పరిరక్షణకే నేటి పోరాటం

– నెహ్రూ దార్శనికతతోనే దేశం పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది
– రాజ్యాంగాన్ని, చట్టబద్ధ పాలనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది
– సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-హైదరాబాద్‌లో ఘనంగా ముగిసిన రెండు రోజుల ‘భారత్ సమ్మిట్’

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి, నియంతృత్వ ధోరణులకు మధ్యే ప్రధానంగా పోరాటం జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక శక్తి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకుంటుంటే మరో శక్తి దాన్ని పూర్తిగా నాశనం చేసి నియంతృత్వాన్ని రుద్దాలని చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగిన ‘భారత్ సమ్మిట్’ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా దిశానిర్దేశం చేశారు. సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులను తాము ఆహ్వానించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వారిలో చాలామందికి వీసాలు రద్దు చేయడం బాధాకరమని సీఎం పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు మన ప్రతి కదలికను గమనిస్తున్నారని అన్నారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈ సదస్సు జ‌ర‌గ‌డం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పారు.

రెండు శక్తుల మధ్యే పోరాటం

సమాజంలో జరుగుతున్న సైద్ధాంతిక పోరును వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలను ప్రస్తావించారు:
ప్రతి పౌరుడికి రాజ్యాబ్ధంగా సంక్రమించిన ఓటు హక్కును కాపాడుకోవాలని తాము కోరుకుంటుంటే, ప్రత్యర్థులు మాత్రం తమకు నచ్చిన కొద్దిమంది వర్గాలకే ఆ హక్కును పరిమితం చేయాలని కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. పర్యావరణాన్ని పరిరక్షించడం మన బాధ్యతగా భావిస్తుంటే కొందరు వాటిని ధ్వంసం చేసేందుకు వెనుకాడడం లేదన్నారు. పేదలు, మహిళలు, రైతులు, మైనారిటీల సంరక్షణే తమ ధ్యేయమని, కానీ అవతలి వారు కేవలం తమ సంపన్న మిత్రుల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అధికారం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదని, అందరికీ సమాన అవకాశాలు లభించాలని తాము కోరుకుంటుంటే ఒకే వ్యక్తి నుంచి ఆదేశాలు జారీ అయ్యే నియంతృత్వ విధానాన్ని వారు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం సాగుతున్న ఈ సైద్ధాంతిక పోరాటానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారని, దళితులు, బహుజనులు, మైనారిటీలకు సామాజిక న్యాయం అందించేందుకు ఆయన చేస్తున్న పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు.

తెలంగాణ రైజింగ్ – 2047, ఆర్థిక ప్రణాళికలు

రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుతూ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల మహా ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ధ్యేయమని ప్రకటించారు. దేశ జీడీపీకి 10 శాతం వాటా అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి విధానపరమైన గందరగోళం (పాలసీ పెరాలసిస్) లేదని, పీవీ నరసింహారావు తెచ్చిన ఓపెన్ ఎకానమీ స్ఫూర్తితోపాటు గత ప్రభుత్వాల హయాంలోని మంచి విధానాలను కూడా కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగాన్ని సర్వీస్ సెక్టార్‌గా మారుస్తూ ఓఆర్ఆర్‌ అవ‌త‌లి ప్రాంతంలో రీజినల్ రింగ్ రోడ్డు, 10 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక మాన్యుఫ్యాక్చరింగ్ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలను ఆహ్వానిస్తున్నామన్నారు.

నెహ్రూ దార్శనికతే నేటి భారత్‌కు పునాది

స్వాతంత్య్రం వచ్చిననాడు కనీసం తినడానికి తిండి కూడా లేని దుస్థితి నుంచి దేశం నేడు మిగులు ఆహార ధాన్యాల స్థాయికి చేరిందంటే అది పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దార్శనికత వల్లే సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్, భాక్రా నంగల్, శ్రీశైలం వంటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థకు నెహ్రూ పునాదులు వేశారని కొనియాడారు. అప్పట్లో నెహ్రూ, ఇందిరా గాంధీ హయాంలో ప్రారంభించిన ఐడీపీఎల్ తదితర సంస్థల వల్లనే నేడు హైదరాబాద్ దేశానికి ఫార్మా రాజధానిగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోని బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. ఈ సదస్సులో చర్చించిన అంశాలను, ప్రజాస్వామ్య పరిరక్షణ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లాలని విచ్చేసిన ప్రతినిధులను సీఎం కోరారు. కార్యక్రమంలో పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *