– రాహుల్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టకుండా
– ప్రజాస్వామ్యబద్ధ హక్కును అణచివేస్తున్న పోలీసులు
– రామచందర్‌రావు ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్ కు వ్యతిరేకంగా, అలాగే ఆరు గ్యారంటీలు సహా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన రాహుల్ గాంధీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ను తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు శనివారం హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న రెండు రోజుల భారత్ సమ్మిట్‌కు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ రావడాన్ని నిరసిస్తూ నల్లజెండాలు ప్రదర్శించాలని పార్టీ శ్రేణులకు రామచందర్‌రావు ఇప్పటికే పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ శనివారం ఉదయం హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో రామచందర్‌రావు, పార్టీ ముఖ్యులను పోలీసులు ముందుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును అణచివేస్తూ పోలీసులు గృహనిర్బంధం చేయడం పూర్తిగా అన్యాయం, అక్రమం అని ఖండించారు. దేశానికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి నిరంతరం నీతులు చెప్పే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పాలిత తెలంగాణలో ప్రతిపక్ష నాయకులను అక్రమంగా హౌస్ అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తోందన్నారు. రాహుల్ గాంధీ హాజరవుతున్న ‘భారత్ సమ్మిట్’ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే సదస్సు ఎంతమాత్రం కాదని, ఇది కేవలం భారతదేశ అంతర్గత రాజకీయ పరిస్థితులపై విదేశీయులను పిలిపించి చర్చించేందుకు కాంగ్రెస్ పెట్టిన కార్యక్రమమని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం ప్రజల సొమ్మును వెచ్చించి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం దారుణమని ఆయన అన్నారు. ప్రజల పన్నుల సొమ్మును వృథా చేస్తూ రాజకీయంగా విఫలమైన రాహుల్ గాంధీని మరోసారి రాజకీయంగా రీలాంచ్ చేయడానికి, దేశ వ్యతిరేక శక్తులకు వేదికగా నిలుస్తున్న ఈ సదస్సును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. దేశ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఈ సదస్సును నిరసిస్తున్నందుకే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందని రామచందర్‌రావు విమర్శించారు. రాజకీయంగా వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులను పిలిచి దేశంలో అస్థిరతను సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు పోలీసులను ఉపయోగిస్తోందన్నారు. ఆరు గ్యారంటీల అమలులో విఫలమైన ప్రభుత్వానికి నిరసనలను అడ్డుకునే నైతిక హక్కు లేదన్నారు. శాంతియుత నిరసనలకు భయపడి రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా నిర్బంధించిన బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలు, జాబ్ క్యాలెండర్, రైతుభరోసా అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, అందువల్ల రాహుల్ గాంధీకి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదని రామచందర్‌రావు అన్నారు. ప్రభుత్వ నిర్బంధాలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





