– ప్రధాని మోదీని నిలదీసి స్పష్టమైన హామీలు తేవాలి
– సమ్మక్క సారక్క డీపీఆర్‌ను వెనక్కి పంపడంతో రాష్ట్రానికి అన్యాయం
– పోలవరం నుండి అనుసంధానం మొదలు పెడితే సహించం
– నీటి హక్కులను తాకట్టు పెడితే ప్రజా ఉద్యమం తప్పదు
– బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీష్ రావు హెచ్చరిక
-సీఎం రేవంత్, ఉత్తం కుమార్ దిల్లీ పర్యటన నేపథ్యంలో ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల దిల్లీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర నీటి ప్రయోజనాల పరిరక్షణపై రాజకీయం వేడెక్కింది. రాష్ట్రానికి చట్టబద్ధంగా దక్కాల్సిన 968 టీఎంసీల గోదావరి జలాల హక్కులపై ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయాలని, కేంద్రం నుంచి స్పష్టమైన హామీలు సాధించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం దిల్లీ వెళ్తున్న సందర్భంగా వారు రాష్ట్ర హక్కుల కోసం పోరాడతారా లేక తల దించుకుని వస్తరా అనేది చూడాలన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన పలు కీలక డిమాండ్లను తెరపైకి తెస్తూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైడ్రాలజీ సహా కీలక అనుమతులు పూర్తయిన సమ్మక్క–సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను కొత్త మార్గదర్శకాల పేరుతో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) వెనక్కి పంపడం రాష్ట్ర ప్రయోజనాలపై గొడ్డలిపెట్టు లాంటిదని హరీష్ రావు మండిపడ్డారు. కేవలం టీఏసీ (టీఏసీ) అనుమతి మాత్రమే రావాల్సిన దశలో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
గోదావరి-కావేరి అనుసంధానం అలైన్మెంట్ మార్పు
గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును మొదట ఇచ్చంపల్లిని ప్రతిపాదించగా ఆ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకు పోలవరం–బనకచర్ల అలైన్‌మెంట్‌కు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏపీకి మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా,తెలంగాణకు దక్కాల్సిన వాటాను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని దుయ్యబట్టారు. గోదావరి నుంచి కావేరికి తరలించే 148 టీఎంసీల నీటిలో తెలంగాణకు 50 శాతం (75 టీఎంసీలు) వాటాను దక్కించుకోవాలని, ఇచ్చంపల్లి నుంచే ఈ ప్రాజెక్టును చేపట్టాలని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రధాన డిమాండ్లు
తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులకు తక్షణమే కేంద్రం నుంచి అనుమతులు సాధించాలి. పాత మార్గదర్శకాల ప్రకారమే సమ్మక్క–సారక్క ప్రాజెక్టు డీపీ ఆర్ ను ఆమోదించి వెంటనే టీఏసీ అనుమతి ఇప్పించాలి. గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలి.ఈ ప్రాజెక్టులో తెలంగాణకు రావాల్సిన 75 టీఎంసీల వాటాను ఖరారు చేయాలి. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే పోలవరం–బనకచర్ల అలైన్మెంట్ మార్పును తీవ్రంగా వ్యతిరేకించాలి.
మరో ఉద్యమం తప్పదు
తెలంగాణ నీటి హక్కుల విషయంలో కేంద్రం వద్ద గట్టిగా వాదన వినిపించకుండా మౌనంగా వెనుదిరిగితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హరీష్ రావు హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ప్రజాక్షేత్రంలో మరో భారీ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





