-స్టేజీ మధ్యలో వెళ్లిపోవడమే దీనికి నిదర్శనం
– విదేశాల ముందు దేశాన్ని కించపరచడం దేశద్రోహమే
– ప్రజాస్వామ్యం గురించే మాట్లాడే నైతికత రాహుల్‌కు లేదు
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ సమ్మిట్ స్టేజీ నుంచి మధ్యలోనే వెళ్లిపోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. సమ్మిట్ ముగిసిన అనంతరం రాహుల్ తీరును, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ బండి సంజయ్ మీడియాకు ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సంజయ్ తీ వ్రంగా స్పందిస్తూ ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను విదేశీయుల ముందు అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కుటుంబంలో సమస్యలు వస్తే ఇంటి సభ్యులు అంతర్గతంగా చర్చించుకున్నట్లే దేశంలో సమస్యలు ఉంటే అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని హితవు పలికారు. ప్రపంచ వేదికలపై ప్రధాని మోదీ దేశ ఖ్యాతిని పెంచుతుంటే రాహుల్ గాంధీ మాత్రం భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడి దేశ పరువును బజారున పడేశారని మండిపడ్డారు. దేశ భక్తులు, పోరాట యోధుల పరమ పవిత్ర నిలయమైన తెలంగాణను ఇలాంటి భారత్ వ్యతిరేక శక్తులకు వేదికగా మార్చి అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ మార్క్ ప్రజాస్వామ్యం ఇదేనా?
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని బండి స్పష్టం చేశారు. “ప్రజాస్వామ్యమంటే ఒకే కుటుంబం దశాబ్దాలపాటు దేశాన్ని పాలించడమా? ఒకే కుటుంబం పార్టీని చెప్పుచేతుల్లో పెట్టుకోవడమే రాహుల్ మార్క్ ప్రజాస్వామ్యమా?” అని నిలదీశారు. కాంగ్రెస్‌లో ఒక సామాన్య కార్యకర్త అధ్యక్షుడిగా ఎదగగలరా? కుటుంబ అనుమతి లేకుండా కీలక నిర్ణయం తీసుకోగలరా? అని ప్రశ్నించారు. ముందు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సూచించారు.
ఫాసిజం గురించి మాట్లాడే అర్హత లేదు
దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ హక్కులను కాలరాసి, లక్షలాది మందిని జైళ్లలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఫాసిజం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. మూడు వేల మంది సిక్కులను ఊచకోత కోసినప్పుడు కాంగ్రెస్‌కు ఫాసిజం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అలాగే, 2014 ఎన్నికల్లో బీజేపీ వందల కోట్లు ఖర్చు చేసిందంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్న రాహుల్‌కు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని, కోర్టుకు వెళ్లి పోరాడాలని సవాల్ విసిరారు.
కౌలు రైతులపై డ్రామాలు
భారత్ సమ్మిట్‌లో కౌలు రైతుల కోసం స్టాల్ ఏర్పాటు చేయడం పెద్ద జోక్ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా కౌలు రైతులకు ఇచ్చిన హామీలను, రైతు భరోసాను ఎందుకు అమలు చేయలేకపోయారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





