– రూ.700 కోట్ల నుండి రూ.1000 కోట్లకు పెరిగిన చెల్లింపులు
– అక్టోబర్ 2025 వరకు రిటైర్డు ఉద్యోగుల జీపీఎఫ్ క్లియర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం రూ.1000 కోట్ల నిధులను ప్రభుత్వం బుధవారం మంజూరు చేసింది. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ నిధుల విడుదల చేశారు. ఈమేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఇచ్చిన హామీ నెరవేర్చారు. గత ఏడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారంగా మార్చి 2026 వరకు ప్రతి నెలా ఉద్యోగులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చింది. అయితే ఉద్యోగుల ఆర్థిక అవసరాలను, వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా గమనించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని రూ.1000 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్‌కు సంబంధించిన రూ.వెయ్యి కోట్లను యుద్ధప్రాతిపదికన విడుదల చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించింది. అక్టోబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డు ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలన్నింటినీ ఈ నిధులతో పూర్తిగా క్లియర్ చేశారు. తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది సీనియర్ సిటిజన్లకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం.
మెడికల్ బిల్లులకూ మోక్షం
ఉద్యోగుల ఆరోగ్య అవసరాలకు సంబంధించి మెడికల్ బిల్లులను ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు చెల్లించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం వాటి చెల్లింపులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో రాజీ పడకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు.. వారి సమస్యలను పరిష్కరించడం మా బాధ్యత అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. పెంచిన నిధులు, క్లియర్ అయిన జీపీఎఫ్ బకాయిలు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఉద్యోగ వర్గాల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనే విషయాన్ని ఈ తాజా నిర్ణయం నిరూపిస్తోంది. ఉద్యోగుల కష్టాలను గుర్తించి, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది అని అధికారులు అన్నారు. ఉప ముఖ్యమంత్రి చొరవతో పెద్ద మొత్తంలో నిధులు విడుదల కావడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





