– వాతావరణ సవాళ్లకు శాస్త్రీయ, ఆచరణాత్మక పరిష్కారాలే లక్ష్యం
– కరువు తట్టుకునే నమూనాలు, నీటి భద్రత, సుస్థిర వ్యవసాయంపై చర్చ
– క్లైమేట్ కాంక్లేవ్ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24 : తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ సిద్ధాంతపరమైన చర్చలకే పరిమితం కాకుండా వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లకు ఆచరణాత్మకంగా అమలు చేయగల, శాస్త్రీయంగా నిరూపితమైన పరిష్కారాలను సూచించే వేదికగా నిలవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరువును తట్టుకునే వ్యవస్థల నిర్మాణం, నీటి భద్రత, సుస్థిర వ్యవసాయం, ఎల్‌నినో పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలపై కాంక్లేవ్‌లో లోతైన చర్చ జరగాలని స్పష్టం చేశారు. తెలంగాణ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహిస్తున్న క్లైమేట్ కాంక్లేవ్ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కార్యక్రమ రూపకల్పన, నిపుణుల భాగస్వామ్యం, పెట్టుబడిదారులతో సంప్రదింపులు, వివిధ అంశాలపై రూపొందిస్తున్న ప్రదర్శనలు, ఆడియో–విజువల్ కంటెంట్‌పై విస్తృతంగా చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన వాతావరణ అనుకూల నమూనాలతోపాటు ఇక్రిశాట్ గుర్తించిన ఉత్తమ విధానాలను ప్రదర్శనలు, ఆడియో–విజువల్ కార్యక్రమాల్లో సమగ్రంగా పొందుపరచాలని మంత్రి సూచించారు. కాంక్లేవ్‌లో ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఐదు నెలల ఎల్‌నినో సన్నద్ధత కార్యక్రమాన్ని ప్రదర్శించనున్నారు. సుమారు రూ.10 వేల కోట్ల అంచనాతో చేపట్టనున్న ఈ బృహత్తర కార్యక్రమంలో సంక్రాంతి తరువాత ప్రతి నెలా దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన పనులను అమలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా అమలు చేయనున్న ఈ కార్యక్రమంలో చెరువులు, వాగులు, కాలువల పునరుద్ధరణ, భూగర్భ జలాల రీఛార్జ్, వర్షపు నీటి సంరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల పరిరక్షణకు సంబంధించిన పనులను విస్తృతంగా చేపట్టనున్నారు. వ్యవసాయ పనులు తగ్గే కాలంలో గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడం కూడా ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాల్లో ఒకటని మంత్రి వివరించారు.
నీరు, ఆహార భద్రత కల్పనకు తీసుకుంటున్న చర్యలను వివరించాలి
సంభావ్య కరువు పరిస్థితుల్లోనూ ప్రజలకు తాగునీరు, ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కాంక్లేవ్ ప్రదర్శనల ద్వారా వివరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలం వరకు జలాశయాల్లోని నీటి నిల్వలను సంరక్షించేందుకు అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలకు దాదాపు ఏడాదిపాటు సరిపడే బియ్యం నిల్వలు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. కరువు కారణంగా పంట దిగుబడులు తగ్గినప్పటికీ ప్రజల ఆహార భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ నిల్వలు కీలక రక్షణగా నిలుస్తాయన్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి విస్తరణ, శుద్ధి చేసిన మురుగునీటిని పరిశ్రమల్లో వినియోగించడం, తెలంగాణను నెట్–జీరో లక్ష్యాల దిశగా తీసుకెళ్లే చర్యలపైనా సమీక్షలో చర్చించారు. రాష్ట్రంలోని డేటా సెంటర్లు తమ మొత్తం విద్యుత్ అవసరాల్లో కనీసం 51 శాతాన్ని పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి సమకూర్చుకోవాలనే నిబంధన ఇప్పటికే అమల్లో ఉందని అధికారులు వివరించారు. క్లైమేట్ కాంక్లేవ్‌లో పర్యావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు, నీటి సంరక్షణ రంగ నిపుణులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, పెట్టుబడిదారులు పాల్గొననున్నారు. సర్పంచ్‌లు, క్షేత్రస్థాయి భాగస్వాములతో కూడిన సుమారు 125 మంది గ్రామీణ ప్రతినిధులను కూడా చర్చల్లో భాగస్వాములను చేయనున్నారు. నీటి భద్రత, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవస్థలు, జీవవైవిధ్య పరిరక్షణ, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నియంత్రణ, వ్యవసాయం, స్వచ్ఛ ఇంధనం తదితర అంశాలపై విస్తృత చర్చలు నిర్వహించనున్నారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ క్రెడిట్లు, పర్యావరణ పర్యాటకం, వ్యర్థాల పునర్వినియోగంతో కూడిన సర్క్యులర్ ఎకానమీ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు ప్రత్యేక పెట్టుబడిదారుల వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాతావరణ మార్పులను తట్టుకునే సుస్థిర అభివృద్ధిలో తెలంగాణను దేశానికి మార్గదర్శకంగా నిలపాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ కాంక్లేవ్ మరింత బలోపేతం చేయనుంది. రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీ ట్రాన్స్‌కో సీఎండీ డి.కృష్ణభాస్కర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





