– నీటి వాటాను వదులుకున్నది వాళ్లే
– అబద్ధాల హరీష్ రావు, ట్విట్టర్ టిల్లు, ఫాం హౌస్ లోని శకుని మామ కుట్ర
– టీ(బీ)ఆర్ఎస్ వైఫల్యాలపై తీవ్రంగా మండిపడ్డ మంత్రి పొంగులేటి
ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 24 : కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను గత బీఆర్ఎస్ పాలకులు ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేశారని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. స్వప్రయోజనాల కోసం, ధన దాహంతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. పాలేరు నియోజకవర్గంలో మంగళవారం విస్తృతంగా పర్యటించిన ఆయన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దతండాలో 25, 26, 27, 28 వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు.
578 టీఎంసీలకు బదులు 298 టీఎంసీలేనా?
2005లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న హరీశ్‌రావు తదితరులు కృష్ణా జలాల్లో తెలంగాణకు 578 టీఎంసీల వాటా రావాల్సి ఉండగా కేవలం 298 టీఎంసీల నీళ్లు సరిపోతాయని అంగీకరించారని పొంగులేటి ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పైగా పెంచినా పట్టించుకోలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పల్నాడు నీటి మళ్లింపు పథకాలకు కూడా గత బీఆర్ఎస్ పాలనలోనే అవకాశం కల్పించారని విమర్శించారు.
తుమ్మిడిహెట్టిపై మళ్లీ కదలిక
తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రయోజనాలను విస్మరించిందని మంత్రి మండిపడ్డారు. ధనదాహంతో తెలంగాణ సాగునీటి ప్రయోజనాలను దెబ్బతీశారని విమర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తును 145 అడుగుల నుంచి 148 అడుగులకు పెంచుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కేంద్ర మంత్రి, ప్రధానితోపాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ప్రాజెక్టు అంశంపై చర్చించామని, నిలిచిపోయిన ఫైల్‌కు మళ్లీ కదలిక తీసుకొచ్చామని వెల్లడించారు.
ప్రజలే గుణపాఠం చెబుతారు
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాగునీటి ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అబద్దాల హరీశ్‌రావు, ట్విట్టర్ టిల్లు, ఫామ్ హౌస్ లోని శకుని మామ తమ ప్రభుత్వంపై కావాలనే విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలే తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టి.ఎస్, ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





