– ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు
– కాంగ్రెస్‌పై రామచందర్‌రావు ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అని ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మరిచిపోయారన్నారు. మొన్నటిదాకా గుర్తింపు సంఘాల ఎన్నికల గురించి ఊసే లేదు.. ఇవాళ సమ్మె చేస్తామంటే చర్చల పేరుతో పిలిచి మళ్ళీ నాలుగు వారాల గడువు కావాలని అడగడం కాలయాపననకేనన్నారు. మంత్రి పొన్నం సమస్యను పరిష్కరించాల్సింది పోయి సమ్మె పరిష్కారం కాదని నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అహంకారంతో మాట్లాడటం కాక కార్మికుల సమస్యలు విని పరిష్కరించండి అని హితవు పలికారు. సమస్యల పరిష్కారం కంటే సమ్మెను విచ్ఛిన్నం చేయడానికే ప్రభుత్వం ఎక్కువ ఆసక్తి చూపుతోందని ఆయన విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ట్రేడ్ యూనియన్లపై పెట్టిన ఆంక్షలను తొలగించి వెంటనే గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు చేస్తున్న డిమాండ్లలో తప్పేముంది అని ప్రశ్నించారు. ఉచిత బస్సు పథకానికి సంబంధించి వందల కోట్ల బకాయిలను సర్కార్ విడుదల చేయకుండా సంస్థను దివాలా తీయించే కుట్ర చేస్తోందని, అద్దె బస్సుల డ్రైవర్లను, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. ఆర్టీసీని కాపాడుకోవాలన్న కార్మికుల ఆవేదనను బీజేపీ గౌరవిస్తోందని రామచందర్‌రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోవడంతో సామాన్యులు, ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు.. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో జనం దిక్కుతోచని స్థితిలో ఉంటే అటు ప్రైవేటు వాహనాలు, ఆటోలు చార్జీల మోత మోగిస్తున్నాయన్నారు. కరీంనగర్‌లో జరిగిన బస్సు ప్రమాదం వంటి ఘటనలు మనసును కలిచివేస్తున్నాయన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మొండివైఖరి వీడాలని, కమిటీల పేరుతో కాలయాపన ఆపి తక్షణమే ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరిపి 32 డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికులతో కలిసి బీజేపీ ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





