– ఇది ముమ్మాటికీ ప్రజల, రైతాంగ విజయం
– బీర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్రలను బయటపెడుతూ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల కోసం రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేయవద్దని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చిల్లర ప్రచారాలు బంద్ చేసి ప్రాజెక్టు మరమ్మతులపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులపాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన అన్ని కుట్రలకు ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ముగింపు పడిందని అన్నారు. కాళేశ్వరాన్ని ‘కూలేశ్వరం’ అంటూ పిట్టల దొరల మాదిరి అడ్డగోలుగా అబద్ధపు ప్రచారాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు చెంప ఛళ్ల్లుమనిపించే తీర్పు ఇచ్చిందన్నారు. కూలింది కాలేశ్వరం కాదు అని, కాంగ్రెస్ పార్టీ గారడీ మాటలు, కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలు కూలిపోయాయని కేటీఆర్ అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు.. అది పీసీసీ నివేదిక అని ఎప్పటినుంచో చెబుతున్నామని, కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తున్నదని తాము చెబుతున్న మాటలకు హైకోర్టు తీర్పు సాక్ష్యంగా నిలిచిందని అన్నారు. అబద్ధాలతో అద్భుతాల నిజాన్ని ఎంతోకాలం దాచలేరన్నారు. కాళేశ్వరం మహాత్యాన్ని కూడా కనిపించకుండా చేయలేరని తేలిపోయిందన్నారు. రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆ బ్యారేజీ మీద నిలబెట్టి అక్కడ ఉన్న ఒక పర్రెను చూపిస్తూ ‘ఇది మొత్తం కూలిపోయింది, కొట్టుకుపోయింది’ అని చెప్పి చేసిన చిల్లర ప్రచారం ఇవాళ కొట్టుకుపోయిందని అన్నారు. అంతిమ విజయం సత్యానిదే అని రుజువైందన్నారు. గోబెల్స్‌ను మించి దుష్ప్రచారం చేసిన ధూర్తులందరికీ ఇవాళ గుణపాఠం చెప్పే తీర్పును రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిందని తెలిపారు. 60 ఏళ్ల పాటు తెలంగాణ కరువుతో, సాగునీటి కొరతతో ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తించి అయినా కాళేశ్వరంపై రాజకీయ రాబందుల మాదిరి వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ తీర్పుతో జ్ఞానోదయం కలిగి వెంటనే దానిని మరమ్మతులు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుర్మార్గులే ఏదో కుట్ర చేసి ఉంటారని, ఆ విషయం కూడా నిలకడగా తెలుస్తుందని అన్నారు. రూ.94,000 కోట్ల ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కూలి రూ.400 కోట్ల మరమ్మతులు అవసరమయ్యాయని, వాటిని కాంట్రాక్టింగ్ ఏజెన్సీనే తిరిగి కడతామన్నా వారిని బెదిరించి కాళేశ్వరం పూర్తిగా కూలిపోయేలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని ఆరోపించారు. సాగునీటిపైన, రైతాంగ భవిష్యత్తుపైన కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఆడిన కుట్రకు ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సమాధానం దొరికిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆరఎస్‌పైన, పార్టీ నేతలపైన కోపం ఉంటే ఎన్ని విచారణలైనా చేసుకోండి కానీ రైతులను ఇబ్బందిపెట్టవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆగమేఘాల మీద స్పందించిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూలిన ప్రాజెక్టులపై ఎందుకు స్పందించలేదు.. కనీసం రిపోర్టు కూడా అడగలేదు అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి, కేంద్రానికి సంబంధం లేకపోతే కేంద్ర సొలిసిటర్ జనరల్ ఈ కేసును ఎందుకు ముందుకు తీసుకువెళ్లడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎన్డీయే భాగస్వామిలా మారిపోయారని, ఆయన ఒక హైబ్రిడ్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. ఏనాటికైనా కాంగ్రెస్‌ను 15 కి.మీ లోపల బొందపెట్టి ఆ పార్టీ మళ్ళీ కోలుకోకుండా చేసేది రేవంత్ రెడ్డే అని కేటీఆర్ జోస్యం చెప్పారు. చివరకు రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని అన్నారు. ఓటుకు నోటు కేసు గురించి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరుగుతూ ఆయన ముమ్మాటికీ అజ్మల్ కసబ్ వంటి తీవ్రవాది అని విమర్శించారు. కసబ్ ఏవిధంగా అయితే కెమెరాలకు దొరికిపోయాడో రేవంత్ రెడ్డి కూడా కెమెరాల సాక్ష్యంగా దొరికిపోయిన ‘ఓటుకు నోటు’ దొంగ అని మండిపడ్డారు. అలాంటి కేసునే బీజేపీ¾ పట్టించుకోవడం లేదన్నారు. కేవలం రేవంత్ అన్నట్లు తమకు ప్రతిపక్ష హోదా రాదు.. ముమ్మాటికీ అధికారపక్ష హోదానే వస్తుంది అని కేటీఆర్ అన్నారు.
కేంద్ర మంత్రులు, బీజేపీపై విమర్శలు
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని, వారి మధ్య ఉన్నది ఫెవికాల్ బంధం అని కేటీఆర్ విమర్శించారు. బండి సంజయ్ కాంగ్రెస్ పెద్దలకు మూటలు అందుతున్నాయని ఆరోపిస్తుంటే ఆ మూటలను పట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర హోంమంత్రిది కాదా అని ప్రశ్నించారు. కేంద్రానికి దమ్ముంటే తెలంగాణ నుంచి ఏఐసీసీకి వెళ్తున్న ప్రతి పైసాను పట్టుకోవాలని సవాల్ విసిరారు. ‘ఆరఆర్ టాక్స’ దిల్లీ పెద్దలకు చేరుతుంటే బీజేపీ నేతలు గాడిదలు కాస్తున్నారా అని నిలదీశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉంటూ రేవంత్ రెడ్డికి సహాయం చేయడం తప్ప రాష్ట్రానికి బండి సంజయ్ ఒక్క రూపాయి అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గమైన వేములవాడలోని గుడి ‘దివ్య భారత’ స్కీమ్‌లో చేరలేదన్న విషయం కూడా ఆయనకు తెలియకపోవడం విచారకరమన్నారు. కరీంనగర్ గల్లీల్లో కార్పొరేటర్‌లా మాట్లాడటం మానేసి కేంద్ర మంత్రిగా వ్యవహరించాలని సంజయ్‌కు హితవు పలికారు. అమృత్ పథకం నుండి సింగరేణి వరకు ప్రతి విషయంలో స్కామ్ జరుగుతుంటే కిషన్ రెడ్డి మౌనంగా ఉంటూ కాంగ్రెస్ మంత్రులతో కలిసి తిరుగుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
ఆర్టీసీ సమ్మెకు బీఅర్ఎస్ మద్దతు
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ నైతిక మద్దతు తెలుపుతున్నదని కేటీఆర్ ప్రకటించారు. ప్రతి డిమాండ్ న్యాయమైనదేనని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే దానిని ఇప్పటిదాకా అమలు చేయకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఆరోపించారు. వారికి వెంటనే అపాయింట్‌మెంట్ డేట్ ప్రకటించాలని, పీఆర్సీతోపాటు డీఏలు, ఇతర బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఈ అంశాలను ఇప్పుడు పట్టించుకోకుండా తప్పించుకుంటున్నారని విమర్శించారు. కేబినెట్ సమావేశం పెట్టుకొని కేవలం డబ్బుల పంపిణీపై కాకుండా ఆర్టీసీ సమ్మె వంటి ప్రజా సమస్యలపై చర్చించాలని కేటీఆర్ సూచించారు. మేనిఫెస్టోలోని అర్టీసీ కార్మికులకు హామీల గురించి తోటి మంత్రి శ్రీధర్ బాబును అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. మూడు బడ్జెట్లు అయిపోయిన తర్వాత కూడా మేనిఫెస్టోలో ఏం రాశారో తెలియకపోవడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





