– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని మరోసారి బట్టబయలు చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. భారీ అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని చట్టపరంగా, సమర్థవంతంగా కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా తగిన ఆధారాలను సమర్పించలేకపోవడం వల్ల కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోరాదంటూ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు, మంత్రులు, బీఆరఎస్ ఎమ్మెల్యేలు చేసిన అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పెద్దపెద్ద హామీలు ఇచ్చారు.. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావస్తున్నా ఏ ఒక్క అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టలేదు, చర్యలు తీసుకోలేదు అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి, ఫార్ములా వన్ రేస్ పేరుతో జరిగిన ఖర్చులు, డ్రగ్స్ కేసు, భూఆక్రమణలు, భూకేటాయింపులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలలో అవినీతి, అక్రమాలు జరిగాయని, అవినీతి సొమ్మును కక్కిస్తానని పదేపదే సీఎం ప్రకటించినప్పటికీ వాటిపై ఒక్క చర్య కూడా తీసుకోలేదని అన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఈ రెండు పార్టీల మధ్య ఉన్న దోస్తీయేనని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో ఈ పార్టీలు ‘డూప్ ఫైటింగ’ చేస్తున్నాయన్నారు. రెండున్నరేళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకుంటోందని ఆరోపించారు. అందుకే బీఆరఎస్ అక్రమాలపై చర్యలకు వెనుకాడుతోందన్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత, అసెంబ్లీలో, బయట ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే అవినీతి కేసుల్లో చట్టబద్ధమైన, పారదర్శకమైన చర్యలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
సుప్రీం కోర్టులో అప్పీల్ చేయాలి :రామచందర్‌రావు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దర్యాప్తు అంశంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఈ స్టే రావడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం, తప్పిదాలేనని స్పష్టమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. హైకోర్టు సూచించిన అంశాలు, వెల్లడించిన కారణాలు అన్నీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలనే ఎత్తి చూపుతున్నాయన్నారు. పభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ విధివిధానాలు, విచారణలో నిబంధనలు పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడిందన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాల విషయంలో అసలు అవినీతిపరులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోందన్నారు. ఈ మొత్తం పరిణామానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అంటూ దోషులు ఎవరైనా వారికి చట్టపరంగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





