హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్15: ప్రముఖ బీసీ నేత, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని , ప్రభుత్వంలో ఒక ప్రత్యేక పదవితో అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వాస్తవ్యుడైన వకుళాభరణం గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఏళ్ల తరబడిగా బీసీ వర్గాల హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నేతగా, ఆయనకు మంచి గుర్తింపు ఉంది.
సుదీర్ఘకాలంగా బీసీ కమిషన్‌లో మూడు పర్యా యాలు సభ్యుడుగా, చైర్మన్ గా నియామకమై ఆయన విశేషంగా కృషి చేశారు.
విషయ పరిజ్ఞానిగా, మేధావిగా, బీసీలకు సంబం ధించిన అన్ని అంశాలపై సమగ్రమైన పరిజ్ఞానం, అనుభవం ఉన్న వకుళాభరణం సేవలను ఉపయోగించుకోవాలని రేవంత్ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.వకుళాభరణం ,రేవంత్ ప్రభుత్వంలో కూడా మిక్కిలి క్రియాశీలంగా పనిచేశారు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లను నిర్ణయించడానికి నిర్దిష్టమైన ప్రతిపాదనలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందజేశారు.
రాష్ట్రంలో కుల గణన చేపట్టడానికి వీలుగా, సమగ్రమైన రీతిలో పలు అధ్యయన పత్రాలను కూడా రేవంత్ ప్రభుత్వంకు అందజేశారు. కాగా 31 ఆగస్టున ఆయన 3 ఏళ్ల పదవి కాలం ముగిసింది. అయితే బిఆర్‌ఎస్ ప్రభుత్వం నియమించిన వారిని ఎట్టి పరిస్థితులలో కొనసాగించరాదన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచన మేరకు వకుళాభరణంను తిరిగి అదే పదవిలో కొనసాగించడానికి ప్రభుత్వానికి వీలు కాలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్థితులలో కుల గణన , లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించడం అత్యంత కీలకమైన అంశాలు. అయితే ప్రభుత్వం బీసీ కమిషన్ కు కొత్త పాలక మండలిని నియమించింది .
కాగా వారందరూ ఈ అంశాలకు సంబంధించిన నిపుణత, అనుభవం లేనివారు .ఈ నేపథ్యంలో వకుళాభరణం సేవలు అనువార్యంగా మారాయి. రేవంత్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా కృష్ణ మోహన్ ఎలాంటి అర మరికలు లేకుండా తన పనిని చిత్తశుద్ధిగా కొనసాగించారు. ఇలాంటి పని విధానంతో సీఎం రేవంత్ రెడ్డికి దగ్గర కాగలిగారు. ఆయనను ఆకర్షించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ కృష్ణమోహన్ సేవలను మరికొంత కాలం కొనసాగించాలని భావించారు. ఆదిశగా చర్యలకు ఉపక్రమించారు అయితే అధిష్టానం నిర్ణయం మేరకు వకుళాభరణం అదే పదవిలో కొనసాగించడం సాధ్యం కాలేదు. కాగా ప్రస్తుతం కీలక కార్యాచరణలకు అనుగుణంగా అవసరమైతే ఒక కొత్త పదవి నైనా ఏర్పాటు చేసి కృష్ణమోహన్ ను నియమించి ఆయన సేవలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల నుండి తెలుస్తుంది.





