కోదండరెడ్డి, కొండలరావు, కనకవ్వలకు ‘పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలు’

  • వ్యవసాయం, సాహిత్యం, కళారంగాల్లో విశేష సేవలకు ప్రతిష్టాత్మక గుర్తింపు
  • ఈ ఏడాది నుంచి కొత్తగా వ్యవసాయ రంగానికి పురస్కారం
  • ఈఎల 13న రవీంద్రభారతిలో అవార్డుల ప్రదానోత్సవం

 

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌ : మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య స్మారకార్థం పొన్నం సత్తయ్య ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏటా అందిస్తున్న పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలకు ఈ ఏడాది ముగ్గురిని ఎంపిక చేశారు. వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, సాహిత్య రంగంలో వెలిచాల కొండలరావు, కళారంగంలో విశేష సేవలందిస్తున్న గొట్టే కనకవ్వలను ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారాలకు ఎంపిక చేసినట్లు ట్రస్టు ఉపాధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్ తెలిపారు.
అవార్డుల జ్యూరీ కమిటీ కన్వీనర్ డాక్ట‌ర్‌ పొన్నం రవిచంద్ర సారథ్యంలో కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, ప్రముఖ పాత్రికేయులు దిలీప్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డైరెక్టర్ జి.వి.శ్యాంప్రసాద్ లాల్, బి.సి. స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రచయిత్రి అయినంపుడి శ్రీలక్ష్మి సభ్యులుగా ఉన్న జ్యూరీ కమిటీ అవార్డులకు ఎంపిక చేసిన జాబితాను ఆదివారం ట్రస్టు చైర్మన్ పొన్నం ప్రభాకర్ కు అందజేసింది.

Ponnam Awards

గత నాలుగేళ్లుగా సాహిత్య రంగంలో నాలేశ్వరం శంకరం, నలిమెల భాస్కర్, చంద్రబోస్, అంపశయ్య న‌వీన్ కు, కళారంగంలో ఒగ్గు ధర్మయ్య, ప్ర‌జాగాయ‌కురాలు విమలక్క, బలగం కొమురమ్మ, అంతడుపుల రమాదేవిలకు పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలను అందజేశారు. ఈ ఏడాది నుంచి వ్యవసాయ రంగాన్ని కూడా పురస్కారాల పరిధిలోకి తీసుకువచ్చి తొలిసారిగా వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తికి అవార్డును అందజేస్తున్నారు.

ఈనెల 13న పుర‌స్కారాల ప్ర‌దానం..

పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా ఈనెల 13న మధ్యాహ్నం 2 గంటలకు రవీంద్రభారతిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పొన్నం అశోక్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అవార్డులకు ఎంపికైన ముగ్గురికి రూ.50 వేల నగదు పురస్కారంతో పాటు మెమెంటో, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు వెల్లడించారు.
పొన్నం సత్తయ్య ఆశయాలను కొనసాగిస్తూ సమాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి గౌరవించడమే ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశ‌మని ట్రస్టు ఉపాధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్ తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *