– నెలలోనే టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా 3,885 కాల్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన, అందుబాటులో ఉండే సేవలను అందించేందుకు మీ సేవా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. ప్రజలు ఇకపై ఆదాయ, కుల, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆధార్ నమోదు, ఆధార్ వివరాల అప్ డేట్ వంటి పలు సేవలను తమ ఇంటి వద్దనే పొందవచ్చు. ఇందుకోసం మీ సేవ కేంద్రాలు లేదా ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, క్యూలలో వేచి ఉండకుండా మీ సేవ డోర్‌స్టెప్ డెలివరీ సేవ ద్వారా సేవలను పొందే అవకాశం కల్పించారు. ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయడం, మీసేవ పౌరుల పోర్టల్ ద్వారా అభ్యర్థన నమోదు చేయడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ఆ తర్వాత మీ సేవ ప్రతినిధి నిర్ణీత సమయంలో ఇంటికి వచ్చి అవసరమైన సేవను అందిస్తారు.
ప్రారంభం నుంచే లభించిన మంచి స్పందన
ఈ సేవ ప్రారంభమైన మొదటి నెలలోనే 1100 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌కు ప్రజల నుంచి 3,885 కాల్స్ వచ్చాయి. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం, పారదర్శకమైన పాలనను అందించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన దార్శనికతలో ఈ కార్యక్రమం ఒక భాగం. ప్రస్తుతం ఈ డోర్‌స్టెప్ సేవలు క్యూర్ పరిధిలోని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బుక్ చేసుకున్న సర్వీస్ ప్రకారం వర్తించే సేవా రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.
డోర్ స్టెప్ సేవలను ఎలా పొందాలి
టోల్‌ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయండి లేదా మీ సేవ పౌరుల పోర్టల్ ద్వారా అభ్యర్థన నమోదు చేయండి. అవసరమైన ధ్రువీకరణ పత్రం లేదా ఆధార్ సేవను ఎంచుకుని కాల్ సెంటర్ ప్రతినిధికి అవసరమైన వివరాలను అందించండి. నిర్ణయించిన సమయంలో మీ సేవ డోర్‌స్టెప్ ప్రతినిధి మీ ఇంటికి వచ్చి అవసరమైన సేవను అందిస్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





