– గ్రామీణస్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారుల గుర్తింపు
– క్రీడలు, యువజనుల శాఖల మంత్రి వాకిటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు ఖేలో ఇండియా గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతోందని యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఖేలో ఇండియా పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, క్రీడాకారుల ఎంపిక, స్టేడియాల సిద్ధత, శిక్షణ తదితర అంశాలపై సచివాలయంలో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖేలో ఇండియా గేమ్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులు, కోచ్‌లు, ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
గ్రామీణ స్థాయి నుంచే క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. 27 రకాల క్రీడాంశాల్లో 1:4, 1:2, 1:1 నిష్పత్తుల ఆధారంగా క్రీడాకారులను దశలవారీగా గుర్తించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఖేలో ఇండియా పోటీలకు సిద్ధం చేయాలని సూచించారు. క్రీడాకారుల ఎంపికలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతిభ ఆధారంగానే అవకాశాలు కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేవలం పోటీల నిర్వహణకే పరిమితం కాకుండా రాష్ట్ర క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగాలని తెలిపారు.
స్టేడియాల సిద్ధత.. క్రీడాకారులకు పోషకాహారం
ఖేలో ఇండియా పోటీలు నిర్వహించే క్రీడా వేదికలు, స్టేడియాలను గుర్తించి వాటిలో అవసరమైన మౌలిక సదుపాయాలు, క్రీడా పరికరాలు, ఇతర ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి శ్రీహరి ఆదేశించారు. పోటీల నిర్వహణకు సంబంధించి ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. క్రీడాకారుల శారీరక దృఢత్వం, సామర్థ్యం పెంపొందించేందుకు నాణ్యమైన శిక్షణతోపాటు పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ప్రభుత్వ పరంగా అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, వైద్య సహాయం, వసతి, రవాణా వంటి సదుపాయాల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
దేశానికే ఆదర్శంగా నిర్వహణ
ఖేలో ఇండియా గేమ్స్ దేశానికే దిక్సూచిగా నిలిచేలా ఏర్పాట్లు ఉండాలని మంత్రి శ్రీహరి ఆకాంక్షించారు. క్రీడాకారులకు అత్యుత్తమ వసతులు కల్పిస్తూ, పోటీల నిర్వహణలో ఎక్కడా లోపాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని చెప్పారు. ఈ పోటీలు రాష్ట్ర క్రీడా రంగానికి కొత్త దిశానిర్దేశం చేయడంతోపాటు రాష్ట్ర యువతలో క్రీడల పట్ల ఆసక్తిని మరింత పెంచేలా ఉండాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ క్రీడల సలహాదారు, తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సోని బాలాదేవి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి, ప్రవీణ్ కుమార్ మల్లారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్లు రవీందర్, రవితేజ, అశోక్, శ్రీనివాస్, ఇంజినీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





