రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ‘సంక్షేమ’ భారం!

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక క్లిష్టమైన మలుపులో ఉంది. ఒకవైపు ప్రజా రంజక సంక్షేమ గ్యారంటీల అమలుకు పెరుగుతున్న వ్యయం, మరోవైపు ఆశించిన స్థాయిలో సాగని సొంత ఆదాయ వనరుల సమీకరణ రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణను సవాలు చేస్తున్నాయి. ఇటీవలి కాగ్  నివేదిక ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే (ఏప్రిల్-జూలై) రాష్ట్రం రూ. 19,266 కోట్ల రెవెన్యూ లోటును చవిచూసింది. అంతేకాకుండా, వార్షిక ద్రవ్య లోటు లక్ష్యంలో అప్పుడే 57.7 శాతం (రూ. 33,729 కోట్లు) ముగియడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తున్నది. రాష్ట్ర ఆర్థిక చక్రం కుంటుపడకుండా ఉండాలంటే తక్షణమే వ్యయ నియంత్రణ, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాల్సి ఉంది.

ఉచితాలు , ప్రజా రంజక పథకాలను గుడ్డిగా కాకుండా, కేవలం అర్హులైన పేదలకు మాత్రమే పరిమితం చేసేలా లబ్ధిదారుల వడపోత జరగాలె . తద్వారా ఖజానాపై అనవసర భారం తగ్గుతుంది. కేవలం రోజువారీ రెవెన్యూ వ్యయాలకే కాకుండా, సంపదను సృష్టించే మౌలిక వసతులు, ఐటీ, పారిశ్రామిక రంగాలపై పెట్టుబడులు పెంచాలి. అప్పుడే భవిష్యత్తులో స్థిరమైన పన్ను ఆదాయం లభిస్తుంది. మైనింగ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ల్యాండ్ పూలింగ్ వంటి విభాగాల ద్వారా పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవడంలో ఉన్న  లొసుగులను అరికట్టాలి. నష్టాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో సంస్కరణలు తీసుకురావడం లేదా వాటిని మూసివేయడం ద్వారా వృథా ఖర్చులను తగ్గించుకోవొచ్చు.

భారత ఫెడరల్ స్ఫూర్తికి కేంద్ర-రాష్ట్రాల మధ్య నిధుల వికేంద్రీకరణ అత్యంత కీలకం. అయితే, ప్రస్తుత వ్యవస్థలో రాష్ట్రాల హక్కులను దెబ్బతీసే కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా  ప్రస్తుతం 41 శాతంగా ఉంది. అయితే, కేంద్రం ఇటీవల కాలంలో నేరుగా విధించే సెస్‌లు , సర్‌ఛార్జీలను విపరీతంగా పెంచేసింది. ఇవి ‘డివిజిబుల్ పూల్’ (రాష్ట్రాలతో పంచుకోవాల్సిన నిధులు) పరిధిలోకి రావు. ఫలితంగా, కేంద్రం భారీగా ఆదాయం పొందుతు న్నా, రాష్ట్రాలకు దక్కే అసలు వాటా తగ్గిపోతున్నది .

ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రస్తావించినట్లు.. తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రం కేంద్ర పన్నుల రూపంలో ఇచ్చే ప్రతి 1 రూపాయికి కేవలం 30 నుండి 45 పైసలు మాత్రమే తిరిగి పొందుతున్నది . అదే సమయంలో కొన్ని ఇతర రాష్ట్రాలు తాము కట్టే రూపాయికి బదులుగా 6 రూపాయల వరకు కేంద్ర సాయం పొందుతున్నాయి. ఇది ఆర్థిక పనితీరు కనబరిచే రాష్ట్రాలను శిక్షించడమే అవుతుంది. కేంద్ర నిధుల పథకాలకు  ఇచ్చే గ్రాంట్లు ‘వన్-సైజ్-ఫిట్స్-ఆల్’ (అందరికీ ఒకే నిబంధన) విధానంలో ఉంటున్నాయి. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ఆ నిధులను వాడుకునే స్వేచ్ఛ లేకపోవడం వల్ల నిధులు సకాలంలో వినియోగం కావడం లేదు. రాష్ట్రాలు బహిరంగ మార్కెట్ నుంచి తీసుకునే రుణాలపై  కేంద్రం విధిస్తున్న కఠినమైన ఆంక్షలు తక్షణ అభివృద్ధి పనులకు అడ్డంకిగా మారుతున్నాయి.

ఆర్థిక గణాంకాలను లోతుగా పరిశీలిస్తే, తెలంగాణ తలసరి ఆదాయం రూ. 4,18,931 గా ఉన్నప్పటికీ, దాని విస్తరణలో స్థిరత్వం లోపించిందని స్పష్టమవుతున్నది . రాష్ట్ర బడ్జెట్ అంచనాలు రూ. 3,24,234 కోట్లుగా నమోదైనప్పటికీ, వాస్తవ రెవెన్యూ వసూళ్లు ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోతున్నాయి. మొదటి త్రైమాసికంలోనే ద్రవ్య లోటు వార్షిక పరిమితిలో 57.7 శాతానికి చేరడం వెనుక ఉన్న ప్రధాన కారణం ‘ఉత్పాదక రహిత వ్యయం’  విపరీతంగా పెరగడమే. జీతాలు, పెన్షన్లు, అప్పుల వడ్డీల చెల్లింపులు , సంక్షేమ పథకాల సబ్సిడీలకే  మొత్తం రెవెన్యూ ఆదాయంలో దాదాపు 75 శాతం పైగా ఖర్చవుతున్నది . దీనివల్ల, సంపదను సృష్టించే ‘మూలధన వ్యయం’  కేవలం 10-12 శాతానికే పరిమితమవుతున్నది . జీఎస్‌డీపీ లో అప్పుల శాతం ‘ఎఫ్‌ఆర్‌బీఎమ్’ నిర్దేశించిన 25 శాతం పరిమితిని దాటి ప్రమాదకర స్థాయికి చేరువవుతున్నది.

కేంద్రం నుండి వొచ్చే డివిజిబుల్ పూల్ వాటా కేవలం 2.102 శాతంగానే ఉండటం వల్ల రాష్ట్రం కొత్త అప్పుల కోసం బహిరంగ మార్కెట్‌పై ఆధారపడాల్సి వొస్తున్నది . ఈ రుణ ఊబి  నుండి బయటపడాలంటే, ఉత్పాదక రంగాలపై పెట్టుబడులను కనీసం 20 శాతానికి పెంచడం తక్షణ ఆర్థికావసరం. ఆర్థిక సంక్షోభానికి కేవలం గణాంకాలే కారణం కాదు, రాజకీయ వైఫల్యాలు కూడా తోడయ్యాయి. గత ప్రభుత్వ అనాలోచిత రుణాల భారాన్ని మోస్తూనే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వోట్ల రాజకీయాల కోసం ఆరు గ్యారంటీలపై మితిమీరిన ఖర్చు చేస్తున్నది . విపక్షాల విమర్శలను తిప్పికొట్టే క్రమంలో ఆర్థిక వాస్తవాలను విస్మరించి, సంక్షేమాన్ని రాజకీయ అస్త్రంగా మార్చడం వల్లనే రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నది .

 తెలంగాణ సంక్షేమ నమూనా దేశానికే ఆదర్శంగా నిలవాలంటే, అది బలమైన ఆర్థిక పునాదులపై నిర్మితం కావాలి. సంక్షేమం అనేది వోట్ల రాజకీయం కాకుండా, మానవ వనరుల పెట్టుబడిగా మారినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. అదే సమయంలో, 16వ ఆర్థిక సంఘం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను గట్టిగా వినిపించి, సెస్‌ల రద్దు లేదా వాటిలో రాష్ట్రాలకు వాటా కల్పించేలా ఒత్తిడి తీసుకురావాలి. కేంద్రం కూడా రాజకీయాలకు అతీతంగా ‘ఫెడరల్ స్ఫూర్తి’ ని చాటుతూ, ఎక్కువ పన్నులు అందిస్తున్న తెలంగాణ లాంటి రాష్ట్రాల అభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *