హ‌ఠాత్తుగా ర‌గులుతున్న రాష్ట్రంలో రాజ‌కీయ నెగ‌ళ్లు!!

రాష్ట్రంలో హఠాత్తుగా రాజకీయ వేడి పెరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు ప్రధాన కారణమ‌ని వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్రభుత్వ టెండర్లపై అవినీతి ఆరోపణలు, రాష్ట్ర అప్పులపై సవాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల‌తో రాష్ట్రం ‘రాజ‌కీయ ఎల్‌నినో హీట్‌వేవ్‌’ తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే త‌క్ష‌ణ కార‌ణం మాత్రం గురుకులాల టెండ‌ర్లు,  సి-పాక్ స‌ర్వేలు, రాష్ట్ర అప్పుల‌పై ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు, ప్ర‌ధాన కార‌ణం. ఈ నేప‌థ్యంలో  అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఉనికిని చాటుకోవడానికి పరస్పరం ముఖాముఖి త‌ల‌ప‌డుతున్నాయి.

తెలంగాణ గురుకుల పాఠశాలల యూనిఫారాలు, షూస్, స్కూల్ బ్యాగుల కొనుగోలు టెండర్లలో దాదాపు రూ. 2,000 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేయ‌డంతో, ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఇరు పార్టీలు సవాళ్లు విసురుకున్నాయి. చర్చ కోసం అమరవీరుల స్థూపం (గన్‌పార్క్) వద్దకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్‌రావును పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత పీక్‌కు చేరింది. తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల (గురుకులాలు) విద్యార్థులకు యూనిఫాంలు, షూస్, బెడ్డింగ్, మరియు నిత్యావసర సరుకుల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన కేంద్రీకృత టెండర్ల ప్రక్రియ ప్ర‌స్తుత వివాదానికి కార‌ణం.  గురుకులాలకు సంబంధించిన దుస్తులు, బూట్లు, టైల సరఫరా కోసం రూ. 1,200 కోట్లు.. అలాగే పప్పులు, కూరగాయలు, గుడ్లు, చికెన్ వంటి సరుకుల కోసం మరో రూ. 800 కోట్లతో టెండర్లు పిలిచారని, ఈ మొత్తం ప్రక్రియలో దాదాపు రూ. 2,000 కోట్ల అవినీతి/అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

గతంలో తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ (టీజీసీఓ) ద్వారా స్థానిక చేనేత కార్మికులు, మహిళా స్వయం సహాయక సంఘాలకు బట్టలు కుట్టే ఆర్డర్లు ఇచ్చేవారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసి రాష్ట్రం వెలుపలి కార్పొరేట్ సంస్థలకు (గుజరాత్ కంపెనీలకు) ఈ టెండర్లు కట్టబెట్టిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ ఆరోపణలను కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. మొత్తం ప్రొక్యూర్మెంట్ విలువ రూ. 1,143 కోట్లు మాత్రమేనని, కేంద్రీకృత విధానం వల్ల తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు వొస్తాయని, అంతా పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేస్తున్నారు.  గురుకుల పాఠశాలల టెండర్ల వివాదంపై చర్చకు ఇరు పార్టీలు సవాళ్లు విసురుకున్నాయి. కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ గన్‌పార్క్‌కు రాగా,  బీఆర్ఎస్ తరఫున హరీశ్‌రావు, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరుతూ తాము చర్చకు వొస్తున్నామని చెప్పడానికి హరీశ్‌రావు మీడియా ముందే ముగ్గురు కాంగ్రెస్ మంత్రులకు ఫోన్ చేయగా, వారు ఫోన్లు ఎత్తలేదు.

ఇదే స‌మ‌యంలో  హరీశ్‌రావు వాహనాన్ని పోలీసులు తెలంగాణ భవన్ గేటు దాటకుండా అడ్డుకున్నారు. దీనితో ఆయన కారు దిగి, నడుచుకుంటూ గన్‌పార్క్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన సంద‌ర్భంగా  పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య జరిగిన తీవ్ర తోపులాటలో కింద‌ప‌డిన హరీశ్‌రావును పోలీసులు బలవంతంగా వాహనంలో ఎక్కించి కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు (ప్రివెంటివ్ కస్టడీలోకి) తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చర్చకు రమ్మని పిలిచి పోలీసులతో అరెస్టులు చేయించడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. మంత్రులతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, తమను ఆపడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని బీఆర్ఎస్ ఆరోపించింది. నిజానికి హ‌రీష్‌రావుతో, మంత్రులు చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్ల‌యితే ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌కంగా ఉందన్న  అభిప్రాయం ఏర్ప‌డేది. కానీ హ‌రీష్‌రావును అరెస్ట్ చేయ‌డం ప్ర‌భుత్వం చేసిన పెద్ద త‌ప్పు. ఎందుకంటే ఇప్ప‌టికే దూకుడుగా ఉన్న  బీఆర్ ఎస్ దీన్ని మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌క మాన‌దు. హ‌రీష్‌, కేటీఆర్‌ల‌ను దీటుగా ఎదుర్కొన గ‌లిగేది ఒక్క రేవంత్ మాత్ర‌మే. మిగిలిన కాంగ్రెస్ నేత‌ల్లో అంత‌టి స్థాయి స్పీడు లేదు.

సివిక్ పోల్ అనాలసిస్ కమిటీ (సీ-పాక్‌) ఇటీవల విడుదల చేసిన ‘మూడ్ ఆఫ్ తెలంగాణ – 2026’ ఒపీనియన్ పోల్ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద తుఫాన్ సృష్టించాయి. ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఈ సర్వే ప్రతిబింబించిందని రాజ‌కీయ పండితుల అభిప్రాయం. ఈ స‌ర్వే ప్ర‌కారం ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే బీఆర్ ఎస్‌కు 84 సీట్లు, కాంగ్రెస్‌కు 22, బీజేపీకి 6, ఎంబీటీకి 1సీటు వొస్తుంద‌ని అంచ‌నా వేసింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిన ట్రాక్ రికార్డ్ సి-పాక్  సంస్థకు ఉంది. బీఆర్ ఎస్‌లో ఉత్సాహానికి, కాంగ్రెస్‌లో ఆందోళ‌న‌కు ఇదో కార‌ణం.

వీటికి తోడు  తెలంగాణ అప్పుల లెక్కలపై సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేసీఆర్ హయాంలో రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించగా, తాము కేవలం రూ. 3.5 లక్షల కోట్లే అప్పు చేశామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పులు చేస్తూ దిల్లీకి మూటలు మోస్తోందని కేటీఆర్  ఎదురుదాడికి దిగారు. దీనికి తోడు  సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రవ్యాప్తంగా శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ సహా 67 మంది ప్రముఖ రాజకీయ నేతలకు భద్రతను (గన్‌మెన్లను) ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది.  దీనిపై  బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయ‌డం మ‌రో ప‌రిణామం. ఇక కాంగ్రెస్‌కు ప్ర‌త్యామ్నాయం తానేన‌ని చెప్పుకోవ‌డానికి బీజేపీ తంటాలు ప‌డుతుండ‌గా, తెలంగాణ‌లో ఒంటరి పోరుకు సిద్ధ‌మ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించి రాజ‌కీయ కుంప‌టిని ర‌గిలించారు.  జీహెచ్ ఎంసీ ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే జ‌రుగనున్న నేప‌థ్యంలో తెలంగాణలో రాజ‌కీయ మంట‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *