ఒకప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఐటీ రంగం విస్తరణ, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్, ఫార్మా రంగం , విమానాశ్రయం వంటి అభివృద్ధి ప్రాజెక్టులు నగరాన్ని పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టాయి. కానీ ప్రస్తుతం అదే రంగం మందగమనాన్ని ఎదుర్కొంటోంది. అమ్మకాలు తగ్గడం, పూర్తికాని ప్రాజెక్టులు పెరగడం, కొనుగోలుదారుల సందిగ్ధత, నిర్మాణ వ్యయాల పెరుగుదల కలిసి ఈ రంగాన్ని ఒత్తిడిలోకి నెట్టాయి. దేశవ్యాప్తంగా గృహ విక్రయాల్లో ఇటీవలి కాలంలో తగ్గుదల నమోదవగా, హైదరాబాద్‌లో కూడా వేలాది ఫ్లాట్లు నిర్ణీత గడువులోగా కొనుగోలుదారులకు అప్పగించబడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
రియల్ ఎస్టేట్ రంగం కేవలం భూములు, భవనాలకు మాత్రమే పరిమితం కాదు. నిర్మాణ కార్మికులు, సిమెంట్, ఉక్కు, విద్యుత్ సామగ్రి, రవాణా, బ్యాంకింగ్, ఇంటీరియర్ డిజైన్ వంటి వందలాది అనుబంధ రంగాలకు ఇది ఉపాధి, ఆదాయానికి మూలం. అలాంటి రంగం మందగిస్తే దాని ప్రభావం మొత్తం నగర ఆర్థిక వ్యవస్థపై పడటం సహజం. ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయి. ఐటీ రంగంలో నియామకాల వేగం తగ్గడం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, గృహ రుణాల భారం, అధిక ధరలు, పెట్టుబడిదారుల జాగ్రత్త ధోరణి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఒకవైపు భారీ ఎత్తున కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తుండగా, మరోవైపు వాటికి తగిన డిమాండ్ లేకపోవడం వల్ల విక్రయాలు మందగిస్తున్నాయి. దీనితో నిర్మాణ సంస్థలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది.
మరో ముఖ్యమైన అంశం కొనుగోలుదారుల విశ్వాసం దెబ్బతినడం. నిర్ణీత సమయంలో ఇళ్లు అందకపోవడం వల్ల చాలామంది ఒకేసారి అద్దె, ఈఎంఐ భారం మోస్తున్నారు. ఇలాంటి అనుభవాలు కొత్త కొనుగోలుదారులను కూడా వెనక్కి నెట్టేస్తున్నాయి . రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకం అత్యంత కీలకమైన మూలధనం. అది దెబ్బతింటే మార్కెట్ కోలుకోవడం కష్టమవుతుంది.
అయితే ఈ పరిస్థితిని శాశ్వత సంక్షోభంగా చూడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌కు ఉన్న బలమైన ఐటీ పునాది, ఔషధ పరిశ్రమ, స్టార్టప్ వ్యవస్థ, రవాణా మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న జనాభా వంటి అంశాలు దీర్ఘకాలంలో నగరానికి బలాన్నిస్తాయి. కానీ వాస్తవ డిమాండ్‌కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడం, ఊహాజనిత పెట్టుబడుల కంటే అవసరాల ఆధారిత గృహ నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వడం అత్యవసరం.
ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేయడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని నగర శివారు ప్రాంతాలకు విస్తరించడం, మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు రుణ సౌకర్యాలు మెరుగుపరచడం, రియల్ ఎస్టేట్ నియంత్రణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయడం అవసరం. ప్రాజెక్టులు ఆలస్యం చేసే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా కొనుగోలుదారుల విశ్వాసాన్ని తిరిగి పొందవొచ్చు .
రియల్ ఎస్టేట్ రంగం ఆరోగ్యంగా ఉంటేనే నగర ఆర్థిక వ్యవస్థ వైబ్రంట్ గా ఉంటుంది. హైదరాబాద్ అభివృద్ధి లో ఈ రంగం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అవసరమైంది కృత్రిమ ధరల పెరుగుదల కాదు; పారదర్శకత, విశ్వసనీయత, వాస్తవ డిమాండ్‌కు అనుగుణమైన అభివృద్ధి. అదే జరిగితే ప్రస్తుతం ఎదురవుతున్న మందగమనం నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ కోలుకుని స్థిరమైన వృద్ధి బాటలో నడవగలదు.




