
పత్రికలలో, టీవీ, ఇతర మాధ్యమాలలో ప్రధాన వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఇంకా కొన్ని పత్రికలు ఈ వారంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వార్తలు రాస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలలో ముప్పై జిల్లాల్లో ఇంతవరకు నేల తడవలేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.ఏరువాకకు ఎల్‌నినో దెబ్బ తో జూన్‌లోనే వర్షాభావం భయానకంగా ఉండి, తెలంగాణ లో 58% మైనస్, ఆంధ్ర రాష్ట్రంలో 63% మైనస్, ఖరీఫ్‌నకు ఆదిలోనే వాన గండం వచ్చింది. ఖరీఫ్ వ్యవసాయ పనుల ఆరంభానికి ఈ సంవత్సరం ఎల్‌నినో దెబ్బ తగిలింది. ఈ మారు తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని మొదట్లోనే వాతావరణ శాఖ హెచ్చరించింది కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లప్తత ధోరణి రైతులను నిండా ముంచింది. మరీ తొలుతనే సమస్య ఉండకపోవచ్చని, జూలై, ఆగస్టు మాసాల్లో తక్కువగా వానలు పడతాయని రాష్ట్ర ప్రభుత్వం ధీమాగా ఉంది. అటు వాతావరణశాఖ ఇటు ప్రభుత్వం అంచనాలకు భిన్నంగా ఖరీఫ్ మొదటి నెల జూన్‌లోనే సేద్యానికి వాన గండం వచ్చి పడింది.
నైరుతి రుతుపవనాలు ఊహించిన దానికంటే ఐదారు రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించి మురిపించి అంతలోనే ముఖం చాటేశాయి. తొలకరి వానల జాడ లేక సాగు పనులు స్తంభించాయి. మామూలుగా జూన్‌లో వర్షాలు ఆశాజనకంగా కురుస్తాయి. కాని ఈ ఏట సగటు సాధారణ వర్షంలో ఏకంగా తెలంగాణ లో 58 శాతం లోటు ఆంధ్రాలో 63.19 శాతం తక్కువ పడింది. జూన్ 1 నుంచి జూన్ 30 వరకు సాధారణ వర్షపాతం 79.24 మిల్లీమీటర్లు కాగా 29.17 మిమీ పడింది. ఎపిలో 28 జిల్లాలుండగా ఏకంగా 17 జిల్లాల్లో అత్యల్ప వర్షం (మైనస్ 60-99 శాతం) తెలంగాణాలో పదిహేను జిల్లాల్లో 59 శాతం మైనస్ కురిసింది. జూన్‌లో రెండు రాష్ట్రలలో ఏ జిల్లాలోనూ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. ఎంతటి తీవ్ర కరువు పరిస్థితులు తెలెత్తినా నైరుతి రుతుపవన కాలం మొదటి నెలలో ఇటువంటి అనావృష్టి లేదని, 124 సంవత్సరాల తర్వాత ఇలాంటి పరిస్థితి ఉందని మేధావులు రైతులు చెబుతున్నారు.
వ్యవసాయ ఆధారిత రాష్ట్రలైన ఆంధ్ర తెలంగాణ లో అత్యధిక సాగు ఖరీఫ్‌లోనే సాగుతుంది. సీజన్‌లో దాదాపు 80 లక్షల ఎకరాల్లో, తెలంగాణాలో 68 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటల సాగుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. కూరగాయలు, ఉద్యానవన పంటలతో కలిపితే కోటి ఎకరాల సేద్యం ఒక్క ఖరీఫ్‌లోనే జరుగుతుంది. ఆదిలోనే తీవ్ర వర్షాభావం నెలకొనడంతో మొత్తం సీజన్‌పై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్, నవంబర్‌లో తరచు తుపాన్లు వచ్చి చేతికొచ్చిన పంటలను ఊడ్చిపెడుతున్న అనుభవంతో ఈ తడవ పంట కాలాన్ని కాస్త ముందుకు జరపాలని ప్రభుత్వం ఆశించింది. ముందుగానే కాల్వలకు నీరు విడుదల చేయడానికి క్యాలెండర్ సైతం ప్రకటించింది. కాని జూన్‌లో తీవ్ర వర్షాభావం ఏర్పడటంతో ప్రభుత్వ అంచనాలు తప్పాయి.
ప్రధాన జలాశయాలైన శ్రీశైలం పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 42 టీఎంసీలు ఉన్నాయి. డెడ్ స్టోరేజిగా పేర్కొంటున్నారు. నాగార్జునసాగర్ ఫుల్ కెపాసిటీ 312 టిఎంసి కాగా ఇప్పుడు 138 టిఎంసి ఉన్నాయి. పులిచింతలలో 45 టిఎంసిలకు 33 టిఎంసి ఉన్నాయి. కృష్ణాపై ఎగువనున్న కర్ణాటక ఆల్మట్టి, నారాయణపూర్‌లోనూ అంతంత మాత్రంగానే నీటి నిల్వలున్నాయి. ఈ తరుణంలో కృష్ణా డెల్టాకు పీట్టిసీమ నీరే దిక్కు. అయితే గోదావరి బేసిన్‌లో వానల్లేకపోతే వరద రాకపోతే పట్టిసీమ నీటికి సైతం సమస్య నెలకొంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు, తక్కువ కాల వ్యవధిలో పంట చేతికొచ్చే రకాలను సాగు చేయాలని సూచిస్తోంది. ఇదిలాఉండగా, గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో పలు మండలాల్లో వర్షాభావం నెలకొంది. ఆ ప్రభావంతో భూగర్భ జలాలు కిందికి చూస్తున్నాయి.





