భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన ఉపాధి హామీ కార్యక్రమంలో జూలై 1 నుంచి కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దాదాపు రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (మనరేగా) స్థానంలో వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) లేదా వీబీ-జీ రామ్-జీ అమల్లోకి వొచ్చింది. అయితే ఇదే సమయంలో గ్రామీణ పేదల జీవనోపాధికి వెన్నెముకగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, రాష్ట్రాల అధికారాలను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత వీబీ-జీ రామ్-జీ చట్టం–2025ను తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ యథాతథంగా అంగీకరించబోదని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గత శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను క్రమంగా కేంద్రీకరించి, గ్రామీణాభివృద్ధి పై రాష్ట్రాల పాత్రను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొస్తోందని ఆయన ఆరోపించారు. “తెలంగాణ రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదల భవిష్యత్తును తాకట్టు పెట్టే చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తలవంచి అమలు చేయదు. ప్రజల ప్రయోజనాలే మాకు పరమావధి” అని పేర్కొంటూ . ఈ చట్టంలోని అనేక నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్నారు.
2005లో అమల్లోకి వొచ్చిన ‘మనరేగా’ భారత సంక్షేమ చరిత్రలో ఒక మైలురాయి. ఉపాధిని ప్రభుత్వ దయగా కాకుండా చట్టబద్ధమైన హక్కుగా గుర్తించిన ఈ చట్టం గ్రామీణ భారతానికి ఆర్థిక రక్షణ కవచంగా నిలిచింది. వ్యవసాయ పనులు లేని కాలంలో కోట్లాది కుటుంబాలకు ఆదాయ వనరుగా మారింది. మహిళల ఉపాధి భాగస్వామ్యాన్ని పెంచింది. గ్రామాల నుంచి పట్టణాలకు బలవంతపు వలసలను కొంతవరకు అరికట్టింది. కొరోనా మహమ్మారి సమయంలో నగరాల నుంచి తిరిగి వొచ్చిన లక్షలాది వలస కార్మికులకు ‘మనరేగా’ జీవనాధారంగా నిలిచిన వాస్తవాన్ని దేశం చూసింది.
అయితే గత కొన్నేళ్లుగా ఈ పథకం అమలును నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అవసరాలకు తగ్గట్టు బడ్జెట్ కేటాయింపులు జరగలేదు. రాష్ట్రాలకు నిధుల విడుదల ఆలస్యమైంది. కార్మికులకు వేతనాలు వారాలు, నెలలు గడిచినా అందని పరిస్థితులు ఏర్పడ్డాయి. పని కోరిన ప్రతి ఒక్కరికీ చట్టం నిర్దేశించిన గడువులో పని కల్పించే వ్యవస్థ బలహీనపడింది. దీంతో ఉపాధి హామీ చట్టం కల్పించిన హక్కు క్రమంగా పరిపాలనా అనుమతులపై ఆధారపడే పథకంగా మారుతోందన్న విమర్శలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో వీబీ-జీ రామ్-జీ ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం గ్రామీణ ఉపాధి వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రకటిస్తోంది. 125 రోజుల ఉపాధి హామీ ఆకర్షణీయంగా కనిపించినా, దానికంటే ముఖ్యమైనది అమలు. పని అడిగిన ప్రతి కుటుంబానికి నిజంగానే 125 రోజుల పని దొరుకుతుందా? వేతనాలు సకాలంలో చెల్లిస్తారా? పని ఇవ్వలేకపోతే పరిహారం ఉంటుందా? ఇవే ఈ పథకం విజయాన్ని నిర్ణయించే అంశాలు.
ఇటీవలి కాలంలో డిజిటల్ హాజరు నమోదు, ఆధార్ ఆధారిత చెల్లింపులు, మొబైల్ యాప్‌ల ద్వారా పర్యవేక్షణ వంటి విధానాలను విస్తృతంగా అమలు చేస్తున్నారు. అవినీతిని అరికట్టడం, పారదర్శకత పెంచడం లక్ష్యాలుగా చెప్పినా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలు, బయోమెట్రిక్ వైఫల్యాలు, సాంకేతిక అవరోధాలు అనేక మంది కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సాంకేతికత ప్రజలకు సేవ చేయాలి కానీ, వారి హక్కులకు అడ్డంకిగా మారకూడదు.
మరోవైపు, ఉపాధి హామీ పథకం కేవలం వేతనం చెల్లించే కార్యక్రమం కాదు. గ్రామ చెరువుల పునరుద్ధరణ, భూసార పరిరక్షణ, వర్షపు నీటి సంరక్షణ, గ్రామీణ రహదారులు, వృక్షారోపణ, సాగునీటి వనరుల అభివృద్ధి వంటి పనుల ద్వారా శాశ్వత ఆస్తులను సృష్టించే అభివృద్ధి కార్యక్రమం కూడా. ఈ లక్ష్యాన్ని కొత్త పథకం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం దేశ వ్యవసాయం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పులు, అనిశ్చిత వర్షపాతం, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, తగ్గుతున్న ఉపాధి అవకాశాలు గ్రామీణ జీవితాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం కేవలం సంక్షేమ కార్యక్రమం కాదు; గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే భద్రతా వల. గ్రామాల్లో కొనుగోలు శక్తిని నిలబెట్టడంలో, స్థానిక మార్కెట్లను చైతన్యవంతం చేయడంలో, కుటుంబాలను అప్పుల బారిన పడకుండా కాపాడడంలో దీని పాత్ర ఎంతో కీలకం.
ప్రభుత్వం నిజంగా “వికసిత్ భారత్”ను నిర్మించాలనుకుంటే, గ్రామీణ భారతాన్ని మరింత బలోపేతం చేయాల్సిందే. అందుకోసం తగిన బడ్జెట్ కేటాయింపులు, సకాలంలో నిధుల విడుదల, వేతనాల చెల్లింపులో ఆలస్యం లేకపోవడం, పని కోరిన ప్రతి కుటుంబానికి హామీ మేరకు ఉపాధి కల్పించడం వంటి అంశాలు రాజీపడలేనివి. ఉపాధి హక్కును బలహీనపరిచే ఏ మార్పైనా గ్రామీణ పేదల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
పథకానికి కొత్త పేరు పెట్టడం, పనిదినాలను పెంచడం మాత్రమే అభివృద్ధికి ప్రమాణం కాదు. రాష్ట్రాల అధికారాలను హరించకుండా గ్రామీణ పేదల గౌరవాన్ని కాపాడే ఉపాధి హక్కు ఎంత బలంగా అమలవుతుందన్నదే అసలు ప్రమాణం. పేరు మారినా, స్ఫూర్తి మారకూడదు. చట్టం మారినా, పేదల హక్కు తగ్గకూడదు. అప్పుడు మాత్రమే ఉపాధి హామీ నిజమైన అర్థంలో గ్రామీ





