పట్నం మహేందర్ రెడ్డికి కేటీఆర్ పరామర్శ
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్23: బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి జైల్లో గడపాల్సి వస్తోందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. చర్లపల్లి జైలులో ఉన్న నరేందర్‌రెడ్డితో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘30 మంది అమాయక రైతులను జైలులో పెట్టారు.. వాళ్ల కోసం పోరాటం చేయండి. ఫార్మా విలేజ్‌ను ప్రజలపై రుద్దుతున్నారని.. అక్కడి పేదల పక్షాన పోరాడాలని ములాఖత్ సందర్భంగా పట్నం నరేందర్‌రెడ్డి చెప్పారు.
భూములు ఇవ్వం అన్నందుకు.. కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టం వొచ్చినట్టు అరాచకాలు చేస్తున్నారు. కొడంగల్‌లో సర్పంచ్‌గా పనిచేసిన వ్యక్తి.. కాంగ్రెస్ పాలనలో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఇంటికి అడ్డంగా గోడ కట్టి దారి లేకుండా చేస్తే అవమానం భరించలేక క్షోభతో బలవన్మరణానికి పాల్పడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి చక్రవర్తి, నియంత కాదు. సొంత నియోజకవర్గమైతే అదేమైనా సామ్రాజ్యమా ?నాడు శిశుపాలుని పాపాలు లెక్క పెట్టినట్టు..
నేడు రేవంత్ పాపాలను ప్రజలు లెక్క పెడుతున్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరిట దౌర్జన్యాలు చేస్తున్నారు. తమ భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే ఇవ్వబోమన్న ఒకే ఒక్క మాటకి.. 30 మందికి పైగా రైతులు జైళ్లలో మగ్గుతున్నారు. వారి కుటుంబాలకు మేం ఒక్కటే చెబుతున్నాం.. రు భయపడాల్సిన అవసరం లేదు.. వెనక కేసీఆర్ ఉన్నారు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది. రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.