– కేంద్ర కేబినెట్ విప్లవాత్మక సంస్కరణలు
– రూ.53,428 కోట్లతో ‘ప్రధానమంత్రి సామాజిక సహాయత యోజన’
న్యూదిల్లీ, అక్టోబర్ 14 : దేశంలోని పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సామాజిక భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఎన్ఎస్ఏపీ)ను పునర్వ్యవస్థీకరించి ప్రధానమంత్రి సామాజిక సహాయత యోజన పేరుతో 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్లపాటు అమలు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.53,428 కోట్లు కేటాయించారు. దివ్యాంగుల పెన్షన్లో కేంద్రం చరిత్రాత్మక మార్పులు చేసింది. ఇప్పటివరకు 80% వైకల్యం ఉంటేనే లభించే పెన్షన్ను ఇకపై 40% వైకల్యం ఉన్నవారికి కూడా వర్తింపజేయనున్నారు. అలాగే పెన్షన్ కోసం 18 ఏళ్లు వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా చిన్నారి పుట్టినప్పటి నుంచే తల్లిదండ్రుల ద్వారా సహాయం అందించేలా నిబంధన సడలించారు. దివ్యాంగుల పెన్షన్ మొత్తాన్ని 25% పెంచారు. ఈ నిర్ణయంతో దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 8.33 లక్షల నుంచి ఏకంగా 27.48 లక్షలకు (దాదాపు 3.3 రెట్లు) పెరగనుంది. అటు వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, కుటుంబ సహాయ పథకాల పేర్లు మారినప్పటికీ, వాటి అర్హతలు, కేంద్ర సహాయ మొత్తాలు, లబ్ధిదారుల పరిమితుల్లో మార్పు లేదు. కేంద్ర ప్రభుత్వం అందించే సహాయానికి అదనంగా.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత నిధులతో అందించే అదనపు పెన్షన్ సహాయం దీనికి వేరుగా ఉంటుంది. ఐదేళ్ల కాలంలో ప్రతి ఆర్థిక సంవత్సరానికి ₹10,685.60 కోట్ల చొప్పున వ్యయాన్ని నిర్దేశించారు. తెలంగాణలోనూ ప్రస్తుతం కేంద్రప్రభుత్వ సామాజిక భద్రత పథకాల లబ్ధిదారుల సంఖ్య 7.28 లక్షలు కాగా.. తాజా మార్పులతో ఇది మరింతగా పెరగనుంది. మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా.. ₹2,132 కోట్లను ఆయా పథకాల లబ్ధిదారుల అకౌంట్లలోకి నేరుగా బదిలీ చేసింది.వచ్చే మూడు నెలల్లో ఈ కొత్త అర్హతలు, పెంచిన ఆర్థిక సహాయం అమల్లోకి రానున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులకు పెన్షన్ సౌకర్యాల కల్పనలో సడలింపులు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




