– భారత్ సమ్మిట్‌ను వ్యతిరేకించేవారు ప్రగతిశీల భావాలకు వ్యతిరేకులే
– సాధారణ ప్రజలకు మేలు చేసే సంస్కరణలు, విధానాలే మా లక్ష్యం
హెచ్ఐసీసీ వద్ద మీడియాతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: భారత్ సమ్మిట్‌ను వ్యతిరేకించేవారు ప్రజాస్వామ్య, ప్రగతిశీల భావాలకు విరుద్ధంగా ఉన్నవారేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, ఉదారవాదం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి మౌలిక విలువల పరిరక్షణే భారత్ సమ్మిట్ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో రెండు రోజులపాటు జరుగుతున్న భారత్ సమ్మిట్- 2.0 కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టితోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హైదరాబాద్‌కు భారత్ సమ్మిట్ కు హాజరయ్యారని తెలిపారు. ఇందులో వివిధ దేశాల విధాన రూపకర్తలు, నాయకులు, మేధావులు, ప్రొఫెసర్లు, ఆలోచనాపరులు ఉన్నారని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, ప్రగతిశీల ఆలోచనలు, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రపంచస్థాయి చర్చలకు హైదరాబాద్ వేదిక కావడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. భారత్ సమ్మిట్‌ను బీజేపీ వ్యతిరేకించడంపై స్పందిస్తూ.. ప్రజాస్వామ్యం, ప్రగతిశీల భావాలు, ఉదారవాదం, న్యాయం వంటి మౌలిక సిద్ధాంతాలను వ్యతిరేకించడమేనా వారి ఉద్దేశమని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ప్రపంచ నాయకులు హైదరాబాద్‌కు వస్తుంటే కొందరు తమ ఉనికిని చాటుకోవడానికి రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాహుల్ నైతిక, రాజకీయ విలువలు ఎంతో ఉన్నతమైనవని, దేశ భవిష్యత్తుపై ఆయనకు స్పష్టమైన దార్శనికత ఉందని భట్టి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, దేశ ఐక్యత, సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటంలో తెలంగాణ ఆయనకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వంటి నాయకులను ఆహ్వానించలేదంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇలాంటి అంశాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. రాహుల్ కు ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ప్రతి అంశంపై స్వచ్ఛమైన హృదయంతో పోరాడుతున్నారని చెప్పారు. తమ పోరాటం అధికారం కోసం కాదని, సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చే సంస్కరణలు, విధానాల అమలు కోసమేనని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


