డబ్బులు పడకపోతే అధికారులను సంప్రదించాలని సూచనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పథకాల్లో రైతు భరోసా ఒకటి. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులకు ఏడాదికి రెండు సీజన్ లలో ఎకరానికి రూ. 6వేలు చెప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. తొలి విడతలో ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం ప్రారంభించారు. క్రమంగా సాగుకు యోగ్యమైన భూమి ఉన్న అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రైతుల సంఖ్య పెరిగింది.. బీఆర్‌ఎస్ హాయాంలో తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి సాగుకు యోగ్యం కాని భూములను తొలగించారు. దీంతో రైతు భరోసా నిధుల జమకు కొంత ఆలస్యమైంది. అయితే పెట్టుబడి సాయం పొందే రైతుల సంఖ్య మాత్రం పెరిగినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
జనవరి 26న రైతు భరోసా పథకం ప్రారంభోత్సవం లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాలో 563 గ్రామాల్లో 9లక్షల 48వేల 333 ఎకరాలకు రూ.4,41,911 మంది అన్నదాతలకు రూ. 6 వేల చొప్పున రూ. 569 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. తొలుత ఎకరం భూమి ఉన్న రైతులు, ఆ తర్వాత ఆపైన ఉన్నవారికి క్రమంగా నగదు జమ అవుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.
రైతు భరోసా డబ్బులు రాలేదా..? రైతు భరోసా డబ్బులు జమ కాని రైతులు సంబంధిత ఏఈఓ,ఏఓ లను సంప్రదించాలి. వాళ్లు సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా ? చూసి వాటిని పరిష్కరించి సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారని అధికారులు సూచించారు. అంతేకాక కొత్తగా అంటే జనవరి 1 వరకు పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో మరి కొంత మంది అన్నదాతలకు రైతు భరోసా అందనుంది.