పథకాలకు పేర్లు పెట్టడం కాదు…అమలు చేయాలి

– రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలపై సమీక్ష జరపండి
– పాత హామీలను తిరగదోడటం.. అన్నీ ఎగ్గొట్టడం
– వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలేదీ?
 – ప్రజలకు కావలసింది జిమ్మిక్కులు కాదు.. హామీల అమలు
– ఎక్స్ వేదికగా రాహుల్ ను నిలదీసిన హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : దివంగత మాజీ ప్రధానులు ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పట్ల నిజంగా గౌరవం ఉంటే కేవలం పథకాలకు వారి పేర్లు తగిలిస్తే సరిపోదు, వారి పేరు మీద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. అమలుకు నోచుకోని పథకాలకు ఆ మహనీయుల పేర్లు పెట్టి ప్రజలను మోసం చేయడం వారిని అవమానించడమే అవుతుందని మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు  ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేర్లతో పథకాలు పెట్టి, మూడు బడ్జెట్లు గడిచినా నిరుపేద కూలీలు, నిరుద్యోగ యువతను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా మోసం చేస్తోందో ఎండగడుతూ రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గారు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు కాబట్టి, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరును, వారు ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లను సమీక్షించడానికి ఇదే సరైన సమయం. ఇవి కేవలం బడ్జెట్ ప్రకటనలు మాత్రమే కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టో ద్వారా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు. మరి ఇప్పటికీ అవి ఎందుకు అమలు కాలేదో ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకోండని సలహా యిచ్చారు.  రేవంత్ రెడ్డి ప్రభుత్వ మూడు బడ్జెట్ల ఫార్ములా చాలా సింపుల్.. హామీలు ప్రకటించడం.. పాత ప్రకటనలనే మళ్లీ కొత్త బడ్జెట్‌లో తిరగబోయడం.. చివరకు పైసా ఇవ్వకుండా ఎగ్గొట్టడం..ఇచ్చిన హామీలను అమలు చేయాల్సింది పోయి, పాత బడ్జెట్ ప్రకటనలనే మళ్లీ మళ్లీ ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ. 12,000 ఆర్థిక సాయం అందిస్తామని 2024-25 బడ్జెట్‌లో ఘనంగా ప్రకటించారు. ఆ తర్వాత 2025-26 బడ్జెట్‌లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్నారు. కానీ వరుసగా మూడు బడ్జెట్లు పూర్తయినా నేటికీ ఆ నిరుపేద కూలీలకు ఇస్తామన్న రూ. 12 వేల సాయం అందలేదు. కాంగ్రెస్ భాషలో హామీల అమలు అంటే ఇదేనా అని ప్రశ్నించారు.  మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు 2025-26 బడ్జెట్‌లో ‘రాజీవ్ యువ వికాసం’ కింద రూ. 6,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ 2026-27 బడ్జెట్‌లోనూ అదే రూ. 6,000 కోట్ల అంకెను వల్లెవేశారు. బడ్జెట్ కాగితాల మీద వేల కోట్ల అంకెలు కనిపిస్తున్నాయి తప్ప, క్షేత్రస్థాయిలో నిధుల విడుదలేది? అమలు ఎక్కడ? ఉపాధి కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ సాయం ఎప్పుడు అందుతుంది? మూడు బడ్జెట్లు మారినా.. అవే పాత హామీలు, అవే కాగితపు ప్రకటనలు తప్ప ప్రభుత్వానికి ఇసుమంతైనా జవాబుదారీతనం లేదు. పేదల, యువత పక్షపాతిగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ.. తన సొంత మేనిఫెస్టో హామీలను ఇంత దారుణంగా తుంగలో తొక్కడాన్ని ఎలా సమర్థించుకుంటుంది? ఓట్ల కోసం మీరు పదేపదే చెప్పిన మాటలను నమ్మిన భూమిలేని కూలీలు, నిరుద్యోగ యువత ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూడాలని ప్రశ్నించారు. ఇకనైనా రాజకీయ నినాదాలు, ఉపన్యాసాలు పక్కన పెట్టండంటూ హితవు పలికారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది జిమ్మిక్కులు కాదు.. సుపరిపాలన! మోసాలు కాదు.. హామీల అమలు..పాత హామీల తిరగబోత కాదు.. ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండాలన్నారు.

————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *