వాగ్దానం.. నెర‌వేర్చాం

– గిగ్ వ‌ర్క‌ర్లు దేశాభివృద్ధిలో భాగ‌స్వాములు
– వారు బానిస‌ల‌నేది బీజేపీ భావ‌జాలం
– భాగ‌స్వాముల‌నేది కాంగ్రెస్ భావ‌జాలం
– వారికి రూ.5 ల‌క్ష‌ల ప్ర‌మాద, రూ.10 ల‌క్ష‌ల ఆరోగ్య బీమా
– గిగ్ వర్కర్ల సామాజిక భద్రత- సంక్షేమ పథకం ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 14: ప్ర‌స్తుత శతాబ్దం డేటా శ‌తాబ్దం.. ప్రపంచవ్యాప్తంగా డేటాపైనే చర్చ సాగుతోంది. డేటా సెంట‌ర్లు నిర్మిస్తున్నారు.. గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఉబర్ వంటి కంపెనీలు డేటా ఆధారంగానే నడుస్తున్నాయి.. కానీ భారత దేశంలో గిగ్ వర్కర్లకు వారి డేటా నేటికీ అందుబాటులో లేదు అని కాంగ్రెస్ అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జ‌య‌భేరి గ్రౌండ్స్‌లో శ‌నివారం జ‌రిగిన గిగ్ వ‌ర్క‌ర్స్ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా గిగ్ వర్కర్ల సామాజిక భద్రత సంక్షేమ పథకాన్ని ఆయ‌న ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామిల‌తో క‌లిసి ప్రారంభించారు. ఎన్ని డెలివరీలు చేశాను.. ఎంత సమయం పట్టింది.. ఎంత డబ్బు వచ్చింది.. ఎప్పుడు వచ్చింది.. ఈ సమాచారం గిగ్ వ‌ర్క‌ర్ల‌కు అందేది కాదు.. కష్టం వారిదే.. కానీ వారి డేటాను వారే చూసుకోలేకపోయేవారు అని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన‌ చట్టం డేటాపై వారికి హక్కును కల్పించబోతోంద‌ని చెప్పారు. వారు చేసే పని, పూర్తి చేసే రైడ్లు, డెలివరీలు, ప్రతి రైడ్ లేదా లావాదేవీకి ఎంత డబ్బు చెల్లిస్తున్నారో పూర్తి సమాచారం వారి చేతిలో ఉంటుంద‌ని తెలిపారు. ప్రభుత్వం గిగ్ వ‌ర్క‌ర్ల‌కు గ్యారెంటీ ఇస్తోంద‌ని, ఈ సమాచారం వారి మొబైల్ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంద‌ని, దాన్ని వారి చూసుకోవచ్చ‌ని స్ప‌ష్టం చేశారు. కొంతకాలం క్రితం తాను తెలంగాణ‌లోని గిగ్ వ‌ర్క‌ర్ల‌తో సమావేశమ‌య్యాను. ఆ సమయంలో వారి బాధల‌ను, కష్టాలను చెప్పుకున్నారు. తాను, కాంగ్రెస్ పార్టీ, త‌మ‌ ముఖ్యమంత్రి వారికి సహాయం చేయడంతోపాటు భద్రత, రక్షణ కల్పించడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చామ‌ని, ఆ హామీని, వాగ్దానాన్ని ఈ రోజు తాము నెర‌వేరుస్తున్నామ‌ని చెప్పారు. తెలంగాణ నగరాల్లో గిగ్ వ‌ర్క‌ర్లు రోజంతా ఎండలో స్కూటర్ నడుపుతూ డెలివరీలు చేస్తారు.. కానీ వారు విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకమైన స్థలం లేదు.. అందుకే రాష్ట్ర‌ ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం వై-ఫై సౌకర్యంతో కూడిన విశ్రాంతి కేంద్రాలు (రెస్ట్ జోన్లు) నిర్మిస్తోంద‌ని, అక్కడ వారు విశ్రాంతి తీసుకోవచ్చున‌ని చెప్పారు. ప్రభుత్వం ఇలాంటి రెస్ట్ జోన్ల‌ను హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని నగరాల్లో నిర్మించబోతోంద‌న్నారు. ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్నా, అనారోగ్యానికి గురైనా గిగ్ వ‌ర్క‌ర్లు తీవ్రంగా నష్టపోతారు.. పని చేయలేని పరిస్థితి ఏర్పడటంతో వారి కుటుంబం మొత్తం సంక్షోభానికి గుర‌వుతుంది.. అందుకే రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రతి గిగ్ వర్కర్‌కు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమా అందించడానికి గ్యారెంటీ ఇస్తోందని చెప్పారు. గిగ్ వ‌ర్క‌ర్ల‌కూ పింఛ‌ను రావాలి.. వారికీ సామాజిక భద్రత ఉండాలి.. వారి భవిష్యత్తు కోసం డబ్బు ఆదా కావాలి.. అందుకే ప్రతి లావాదేవీలో, వారు డెలివరీ చేసిన ప్రతి సారీ ఉబెర్ రైడ్ పూర్తి చేసిన ప్రతిసారీ అది బ్లింకిట్ డెలివరీ అయినా లేదా మరే ఇతర సేవ అయినా ప్రతి లావాదేవీ, ప్రతి డెలివరీపై 1 శాతం మొత్తం నేరుగా వారి భవిష్యత్తు, భద్రతకు జమ అవుతుంద‌న్నారు. కంపెనీలు ప్రతి లావాదేవీపై ఈ మొత్తాన్ని తెలంగాణ గిగ్ వర్కర్స్ బోర్డులో జమ చేయాల్సి ఉంటుంద‌ని, బోర్డు ద్వారా ఈ డబ్బు నేరుగా గిగ్ వర్కర్ల బ్యాంక్ ఖాతాలకు చేరుతుంద‌ని వివ‌రించారు.

రెండు భావ‌జాలాలు 

21వ శతాబ్దంలో రెండు రకాల భావజాలాలు ఉన్నాయి. ఒక భావజాలం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లది. వారు గిగ్ వ‌ర్క‌ర్ల‌ను వెట్టి చాకిరీ చేసే కూలీలుగా మార్చాలని కోరుకుంటున్నారు. వారు 24 గంటలు పని చేయాలని, వారి రక్తం, చెమట చిందించాలని, ప్రమాదాల్లో గాయపడాలని, దెబ్బలు తినాలని, చనిపోవాలని, అణచివేత‌కు గుర‌వ్వాలని వారు కోరుకుంటున్నారు, కానీ పూర్తి లాభం మాత్రం బిలియనీర్లకు దక్కాలి. అంబానీ-అదానీలకు దక్కాలి, ఉబెర్-ఓలాలకు దక్కాలి, వారి కష్టానికి తగిన ఫలితం, ప్రయోజనం వారికి దక్కకూడదు అని వారు అనుకుంటున్నారు అని విమ‌ర్శిచారు. రెండో భావజాలం కాంగ్రెస్ పార్టీది, నా భావజాలం. గిగ్ వర్కర్లు ఈ దేశానికి పునాది. కార్మికులు ఈ దేశానికి పునాది, ఆధారం. ఇది ఒక భాగస్వామ్యం. గిగ్ వర్కర్లను భాగస్వాములుగా చేయాలని, వారిని రక్షించాలని మేం కోరుకుంటున్నాం. వారికి భద్రత, రక్షణ కల్పించాలని మేం భావిస్తున్నాం అని చెప్పారు. గిగ్ వ‌ర్క‌ర్లు భయపడాల్సిన ప‌ని లేదు.. తెలంగాణ ప్రభుత్వం, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మొత్తం గిగ్ వ‌ర్క‌ర్ల‌కు అండగా నిలబడ్డాయి.. తాము గిగ్ వ‌ర్క‌ర్ల‌ను భాగస్వాములుగా చేస్తాం.. గిగ్ వ‌ర్క‌ర్ల కుటుంబాల విద్య, ఆరోగ్యం పూర్తి బాధ్యతను తీసుకోవడానికి ప్రయత్నిస్తాం.. తాము చేయగలిగినంత సహాయం చేస్తాం అని రాహుల్ గాంధీ భ‌రోసా ఇచ్చారు. గిగ్ వ‌ర్క‌ర్లు త‌మ‌కు పూర్తి మద్దతు ఇచ్చార‌ని ఆయ‌న తెలిపారు.జై హింద్‌.. జై తెలంగాణ అంటూ ప్ర‌సంగాన్ని ముగించారు. కాగా, స‌భ‌ జ‌రుగుతున్న స‌మ‌యంలో వేదిక‌పై ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్న ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్ఠి విక్ర‌మార్క‌, రాహుల్ గాంధీ మాటామంతీ స‌భికుల దృష్టిని ఆక‌ర్షించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *