యాదాద్రీశుని ఆలయంలో 20 నుంచి 23 వరకు కార్తీకోత్సవం

– మూడు రోజులపాటు సాంస్కృతిక, భక్తి కార్యక్రమాలు
– యాదాద్రి–భువనగిరి జిల్లా కలెక్టర్

యాదాద్రి, ప్రజాతంత్ర, నవంబర్ 14 : యాదగిరిగుట్ట దేవస్థానం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జిల్లా యంత్రాంగం, దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో 20 నుండి 22వ తేదీ వరకు మూడు రోజులపాటు కార్తీకోత్సవం–2026నిర్వహించనున్నట్టు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కార్తీక మాస పవిత్రతను, ఆధ్యాత్మిక విశిష్టతను చాటిచెప్పడంతోపాటు, భారతీయ సనాతన ధర్మ సంప్రదాయాలు, భక్తి సంస్కృతి, కళలు మరియు సాంస్కృతిక వైభవాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడం ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశ్యం. ఈ సందర్భంగా విశేష ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తి సంగీత విభావరి, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 20న కోటి పుష్పార్చన మహోత్సవం – ఆధ్యాత్మిక ప్రవచనం – భక్తి సంగీత కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుండి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ ఆధ్యాత్మిక ప్రవచనం, తేలు విజయ బృందం వారిచే భక్తి సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 21సాయంత్రం 6 నుండి ప్రత్యేక సంగీత విభావరి కార్యక్రమం వుంటుంది. ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్ సంగీత దర్శకత్వంలో దీన్ని నిర్వహిస్తారు. 22న సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యేక శాస్త్రీయ నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు వుంటాయి. ఉత్సవాల ముగింపు రోజున భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలతోపాటు తెలంగాణ రాష్ట్ర విశిష్ట కళా, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే వైవిధ్యభరితమైన నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఒడిస్సీ నృత్య ప్రదర్శన-రుద్రాక్ష ఫౌండేషన్, తెలంగాణ ఆలయాల వైభవంపై ప్రత్యేక నృత్య రూపకం-పరంపర సంస్థ ఆధ్వర్యంలో అభినేత్రి బృందం, పేరిణి నృత్య ప్రదర్శన- కళాకృష్ణ బృందం వుంటాయి. భక్తి పారవశ్యం, ఆధ్యాత్మిక పరిమళం, సంగీత మాధుర్యం, శాస్త్రీయ నృత్య కళావైభవం.. ఈ నాలుగు అంశాల సమ్మేళనంగా కార్తీకోత్సవంను తీర్చిదిద్ది యాదగిరిగుట్టను మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి వేదికగా నిలపడం ఈ ఉత్సవాల సంకల్పం. కావున భక్తులందరు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *